Funday Story: 'వనప్రస్థపురం'.. మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి ఇదే..!? | Sakshi
Sakshi News home page

Funday Story: 'వనప్రస్థపురం'.. మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి ఇదే..!?

Published Sun, Apr 14 2024 9:56 AM

Funday Story: This Week Story Vanaprasthapuram - Sakshi

హాలిడే ట్రిప్‌కు పిల్లలు, మనవళ్ళతో ఓలా  కార్లు బయల్దేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి, హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్‌ టేబులు మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకూ తిననని మారాం చేస్తూ వదిలేసిన పప్పు, నేయి అన్నం. దాని పక్కనే హడావుడిలో మరచిపోయిన మంచినీళ్ళ బాటిల్‌. ఇల్లంతా నిశ్శబ్దం కరెంటు పోయినట్టుగా. గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ, దుప్పటి పైకి లాక్కున్న చప్పుడు. ఎంగిలి కంచం సింకులో వేసి, బెడ్‌రూమ్‌లోకి తొంగిచుశాను.

‘ఎట్లా ఉంది’
      ‘తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్‌ అయ్యారు నావల్ల’
‘మరెప్పుడైనా వెళదాంలే ఏం పోయింది’
      ‘మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్‌మహల్‌ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా, ఇదిగో ఇన్నాళ్ళకి వీలయితే, ఈ వైరల్‌ ఫీవర్‌ మొత్తాన్ని దెబ్బతీసింది’ నిస్పృహగా నవ్వింది సుభద్ర.
      చేయి పట్టుకుని నిమిరాను. పలుచటి ముఖం. జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత. కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొకటే ఈ మధ్య పలచబడింది. కాసేపటికి కునుకులోకి జారింది.

బయటకు వచ్చి సోఫాలో కూర్చుని, క్రాస్‌వర్డ్‌ చేయటం మొదలు పెట్టాను. ఇరవై నిముషాలు పట్టింది. అలవాటయితే తేలికయిన ప్రక్రియే. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఫ్రిజ్‌ నుంచి పాలు తీసి బయటపెట్టాక, టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా లాసా–లమ్సా చాక్లెట్‌ టీ గుర్తుకొచ్చింది.
      ఈ రోజుల్లో ఎవరయినా తాగుతున్నారా? అనుమానమొచ్చింది. ఫోను చేశాను. త్రివేణి  సూపర్‌ మార్కెటులో ఆశ్చర్యకరంగా స్టాక్‌ ఉంది. పదినిమిషాల్లో పిల్లవాడితో పంపాడు.
కొంచెం పాలతో, తక్కువ పంచదారతో, లైట్‌గా పెట్టిన టీ మరుగుతుంటే, వాసన కాస్త బలంగానే తగులుతోంది. రెండు మగ్గుల్లో పోసి బెడ్‌ రూమ్‌కు తీసుకువెళ్ళాను. చూస్తూనే లేచి కూచుంది సుభద్ర. మొదటి సిప్‌కే ముఖం విప్పారింది.
      ‘ఇదెక్కడిది’ ఆశ్చర్యంగా అడిగింది.
‘తెప్పించాను ఇప్పుడే’ టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తుండి పోయింది తాగడం మానేసి.
      ‘చల్లారిపోతుంది తాగు’
‘ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి’
      ‘ముంబైలోని మాతుంగా కింగ్స్‌ సర్కిల్‌. అక్కడి పూలమాలలు. పక్కనే శృంగేరి మఠం. గిరి బుక్‌ స్టోర్‌’
‘ఇంకా’
     ‘బొంబాయ్‌ బ్లాస్ట్స్‌... మోకాళ్ళలోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం  మెయిన్‌ రోడ్డు వరకూ చుడీదార్‌ ఎగగట్టి నడచిపోవడం’

జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రతగా నెమరువేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ  తాగాం.
      ‘ఎన్నేళ్ళయింది చాక్లెట్‌ టీ తాగి’
‘1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్‌. వెనక్కు చెన్నై. కొన్ని రోజులు అమెరికా మళ్ళీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు’ అందామె.
      ‘మనం ప్రయత్నించలేదుగా’
‘అంటే అత్తగారికి ఇష్టం లేదు. రెండు రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య, అత్తయ్య పోయాక, ఎప్పుడూ రుచిచూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు’
      ‘హోటల్స్‌లో దొరకదు’ నేను ముక్తాయింపుగా అన్నాను.

మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోను చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది. వంట ఏం చేసుకున్నారు వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్‌.
కార్న్‌ ఫ్లేక్స్‌ను బౌల్స్‌లో తీసుకుని వేడి పాలు ఒంపుకొని డైనింగ్‌ టేబులు మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బమ్‌. దుమ్ము తీసి డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టాను.
      దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆల్బమ్‌. పసి పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళయినారు. చిన్న గొలుసు రెండు పిలకలతో అక్కయ్య ఎత్తుకొని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్‌ అయింది. కళకళలాడుతున్న ముఖాల్తో అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నులు. కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫొటోలో దాదాపు 65 మందిమి ఉన్నాము. మనిషి మనిషిని లెక్కపెడితే ప్రస్తుతం అందులో నలభయి అయిదు మంది ప్రపంచంలోనే లేరు. పది మంది ఇండియాలో లేరు. 
      ‘పెళ్ళిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా. భక్ష్యాలతో పాల మీగడ లేదని మీ ఆత్తకు కోపం వచ్చింది’ సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బమ్స్‌ వెనక్కి పెట్టేయబోతుంటే, సుభద్ర టీపాయి మీద ఉంచమన్నది– మధ్యాహ్నం తీరికగా చూసుకోవడానికి ఇద్దరం కలిసి.
      రోజుకు రెండుసార్లు పిల్లల ఫోనులు కొనసాగుతూనే ఉన్నాయి. టాక్సీ ప్రయాణం, హోటల్స్‌లో తందూరీ రోటీ రుచి. ఆగ్రా దారిలో ధాబాలు..  పుల్కాలు.. మజా కూల్‌డ్రింకు... బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్‌లెస్‌ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట.
      ‘ఎన్నేళ్ళయింది నువ్వీ పింక్‌ స్లీవ్‌ లెస్‌ వేసుకొని’ అశ్చర్యంగా అడిగాను.
‘ఏమో! అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది’
      ‘ఇన్నేళ్ళయినా ఎంత బాగుందో’ పెద్దగా అనేసి నాలిక కరుచుకొని చుట్టూ తిరిగి చూశాను. ఇంట్లో మేమిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది.
‘ఏమిటి కాగితాల కట్ట’
      ‘ఉత్తరాలు’
‘ఏ ఉత్తరాలు’
      ‘పెళ్ళికి ముందు ఆరు నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి’ నవ్వుతూ టేబుల్‌ మీద పెట్టింది సుభద్ర.
ఒక కట్టకు గ్రీన్‌ బాండు. అవి సుభద్ర రాసినవి. రెడ్‌ రబ్బర్‌ బాండ్‌తో నావి.

      ‘ఉప్మా చేయమంటారా?’
‘నువ్వేం చేయద్దు. కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో’
      సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు. ఎన్ని ఆలోచనలు. ఎంత అర్థం లేని కవిత్వం. ఎప్పటి సినిమా పాటలు. మూడు వేలతో హనీమూన్‌ ఎక్కడికంటూ ఎన్ని చర్చలు. పెళ్ళికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచి పట్టుచీర వర్ణన. రాసి కొట్టేసిన చిలిపి మాటలు. అప్పుడు చదివిన నవలల ప్రశంస. కనబోయే  పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతోంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి.

గంట తరవాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ అరవయి ఏళ్ళు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమయిన దేవాలయం తలుపులు తీస్తే, చెక్కు చెదరని అమ్మవారి విగ్రహం కనబడినట్లు అనిపించింది నాకు.
పుస్తకాలు చదవడం మొదలెట్టాం.

ఒకరోజు ‘మిడ్‌ నైట్స్‌ చిల్ట్రన్‌’ కొంతభాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు ‘వెన్నెల్లో ఆడపిల్ల’ యండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దగ్గరి సుధా హోటల్‌లో మసాలా దోశె. మూడోరోజు ఎన్నేళ్ళుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం ఓ గంటసేపు టీకి. 
      ఎప్ప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. 
ఉదయాన్నే ఐదున్నరకల్లా లేచి ఒక అరగంట ఐ.ఎం.లో నేర్చుకున్న యోగా చేయడం, ఆ తరువాత మరో అరగంట పాటు ఏ ఆలోచనా లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మనవళ్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో, పనిమనిషిని కూడా లేట్‌గా రమ్మన్నాము. ఒక విధమైన నిర్వా్యపారత్వంతో చాలారోజుల నుంచి వెతుకుతున్నది, కొంచెం కొంచెం దొరుకుతున్న తృప్తి మొదలైంది.  
      వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా, కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూచున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి. మనసులు పెనవేసుకున్నాయి.

నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మళ్ళా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యేవాళ్ళు, హోమ్‌వర్క్‌ మరచిపోయిన వాళ్ళు, స్కూలు బాగ్‌ దొరకని వాళ్ళు, బ్రేక్‌ఫస్ట్, లంచ్, డిన్నర్‌ అన్నిటికి హడావుడి.. పూర్తి బిజీ రొటీన్‌ మళ్ళీ మొదలయింది. మనవళ్ల బస్సు కోసం రోడ్డు మీద నిలుచోవడం, ఎన్డీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్ళతో పాడించే కార్యక్రమాలు. అప్పుడప్పుడు రాని నీళ్ళు, ఎప్పుడూ ఎగ్గొట్టే పనిమనిషి.
      పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాము. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి ఒకసారి ఏడాది లాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి.
      నెలరోజుల తరువాత రెండోవాడి కొలీగ్‌ పెళ్ళికి పిలుపు వచ్చింది. పెళ్ళి చేసుకునే అమ్మాయి మాకు కూడా బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి కార్డు ఇచ్చి రమ్మనమంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు.
      ‘నాకెందుకో రావాలని లేదురా’ ప్రయాణానికి గంట ముందర చెప్పాను. 
‘ఏం నాన్నా? ఒంట్లో బాలేదా’ ఆదుర్దాగా అడిగాడు మా రెండోవాడు.
      ‘ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చుని, బఫే తినే ఇంట్రెస్టూ, రాను పోను నాలుగు గంటలు కార్లో కూచునే ఓపిక రెండూ లేవు’
నేనూ రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్లక తప్పలేదు.
      ఆ పైవారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం. కుటుంబసమేతంగా వనభోజనాలు. మరో వారం బిర్లామందిర్‌ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము నేను, సుభద్ర.
మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్ళకు, ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము. సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళకు, మాకూ తెలుస్తూనే ఉంది.

ఆదివారం ఉదయం. అందరం బ్రేక్‌ఫస్ట్‌ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోడానికి  వెళ్లారు. పెద్దకొడుకు, కోడలు, చిన్నకొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపరుతో బయటకు వచ్చిన నన్ను చూసి, సింగల్‌ సీటరు సోఫా ఖాళీ చేసి కూర్చొమన్నాడు పెద్దవాడు.
      ‘అమ్మా నువ్వు కూడా ఇటురా’ పిలిచాడు.
టీ కప్పులు ట్రేలో పట్టుకొని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల, ఏ ఉపోద్ఘాతం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు.
      ‘నాన్నా ఈ మధ్య మీరు ఇద్దరూ మాతో బయటికి రావడాన్ని ఎవాయిడ్‌ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసు బాలేదా?’
‘అదేమీ లేదురా’ మాట దాటేశాను.
      ‘పోనీ పిల్లలతో, పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు’
‘పనిలో ఏ ప్రాబ్లమ్‌ లేదురా’
      ‘ఎందులోనూ ఏ ప్రాబ్లమ్‌ లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది. తాజ్‌మహల్‌ ట్రిప్‌ కాన్సిల్‌ అయినప్పటి నుంచి మీరు దేనికీ మాతో కలిసి రావట్లేదు. ఎందుకు?’
సుభద్ర, నేను మార్చి మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నామటుకు నాకు, ఈ మౌనం, ముసుగులో గుద్దులాట కొనసాగితే, మనస్పర్థలు మొదలయితాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను.

‘మేము వనస్థలిపురంలోని మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ ఆర్నెల్లు’ కొడుకులు, కోడళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు.
      ‘ఎందుకు నాన్నా? ఏమయింది’ చిన్నవాడి ప్రశ్న.
‘ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్కమాట అనలేదు. పిల్లలు కూడా ఏమీ నోరుజారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు’
      ‘మరి?’
‘నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు. కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది... రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలుండాలని. అట్లాగే నేను చెప్పేవి, అనుకునేవి, మీకు అరవై, డెబ్బై ఏళ్ళు వస్తేగాని పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక  భార్య భర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం.

పెళ్ళయిన మొదటి రెండేళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మ, నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు కొన్ని దశాబ్దాలు హాడావుడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా, మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బమ్‌ చుసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో, ఇప్పుడు దాదాపు అసంభవం అయింది.

కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు చానల్‌ మార్చేస్తుంది. తలత్‌  మెహమూద్‌ గజల్‌ చిన్నకోడలికి మలేరియా వణుకుపాట. పాత ఆల్బం టీపాయ్‌ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలచుకున్నది మాత్రమే చేయడం, ఈ స్వతంత్రం కాస్త కావాలి అనిపిస్తోంది రా’ నా మాటలకు చిన్నకోడలు కాస్త గిల్టీగా తలదించుకుంది.
      ‘ఓ పదిహేను రోజులు ఎక్కడి కన్నా వెళ్ళిరండి నాన్నా!’ చిన్నవాడు సలహా ఇచ్చాడు. 
‘నేను కోరుకునేది ఎక్కడికీ పోనక్కరలేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు అరవై అయిదు ఏళ్ళు. మహా అయితే మరో పదిహేనేళ్ళు, ఆరోగ్యం బాగుంటే ఇరవై. మా ఇద్దరిలో ఒకరు ముందు, ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దరిలో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమలు, మనవరాళ్ళు తప్ప, ఏ జ్ఞాపకాల గుబాళింపు, ఏ మాటల మంద్రధ్వని ఆలంబనగా ఉండనక్కరలేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లకు పాలు పడుతూనో కనబడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపమూ ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు’

ఉద్యోగం చేస్తున్న పెద్దకోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది – ‘పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా’
‘మళ్ళా అదే మాట. మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు. కాని మనమలు మనవరాళ్ళతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి, గబగబా దీపం పెట్టి, హాడావుడిగా చేసే పూజ తప్ప, అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడు ఇచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా నేను సాధించినదేమిటి? నన్ను, నేను ఎంతవరకు తెలుసుకున్నానన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరపెడుతున్నది.’

      ‘అయితే వెళ్ళిపోతారా’ కూతురు లేని లోటును తీర్చిన చిన్నకోడలు ఒక్కసారి బావురుమంది.
‘అదేమిటమ్మా, ఆరునెలలు అనుకుంటున్నాము. ఉండగలమో, లేదో? మనసంతా ఇక్కడికే లాగుతుందేమో? చంటివాణ్ణి జోకోట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో? ఏ అవసరం వచ్చినా చెప్పండి రెండు గంటల్లో హైటెక్‌ సిటీలో వచ్చివాలతాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా, వెంటనే బయలుదేరి రండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థ ఆశ్రమాన్ని కొన్ని నెలలు అయినా వనస్థలిపురంలో గడుపుదామని మా ప్రయత్నం.

భగవంతుడి దయ వల్ల మొదటి రెండు నెలలు ఈ ప్రయత్నం సఫలమయితే, తరువాతి రెండు నెలలు ఉత్తరాలు రాసుకునే వెనకటి రోజులకు పోదామనుంది. వీలయితే వాట్సప్‌ని ఫోను నుంచి తీసేద్దామనీ ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం, బాగా అవసరమనుకుంటేనే మా సలహాను అడగడం మీకూ మంచిది. మాకూ మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనబడకపోతే మూడు దశాబ్దాల క్రింది నా యూరోపియన్‌ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో! మనవరాలు సంగీతం క్లాసు టయిమ్‌కి వాకింగ్‌ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దు పాటలు వింటానేమో’

‘అహంకారమడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరతీసుకో అన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా మీ నాన్నకు’ సుభద్ర వత్తాసు పలికింది.
తేలికపడిన మనసుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. — బారు శ్రీనివాసరావు

ఇవి చదవండి: Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!

Advertisement
Advertisement