తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! | Love Sacrifice As A Symbol Of Assurance May 12th Mother's Day Special Story In Telugu| Sakshi
Sakshi News home page

Mother's Day 2024 Special Story: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!

Published Sun, May 12 2024 8:24 AM

తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!

ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్‌ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్‌! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్‌ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్‌ మాత్రమే!

అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్‌ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!

ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్‌ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్‌లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్‌ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ‘మదరింగ్‌ సండే’ కూడా ‘మదర్స్‌ డే’ లాంటిదే.

అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్‌ మదర్స్‌ డే కాన్సెప్ట్‌! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్‌ రీవ్స్‌ జర్విస్‌ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్‌ డే క్లబ్స్‌’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.

ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్‌ వార్‌ టైమ్‌లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్‌ జర్వీస్‌ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ పేరుతో సభను  ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్‌లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్‌ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.

జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్‌ జర్విస్‌ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్‌  1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్‌ డే క్లబ్స్‌’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్‌ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్‌ వుడ్రో విల్సన్‌.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్‌ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్‌ డే ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్‌ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.

ఆ రోజున గ్రీటింగ్‌ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్‌ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్‌ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్‌ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్‌ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్‌ ఫ్లవర్స్‌ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్‌. ‘మదర్స్‌ డే’ అనేది ఓ సెంటిమెంట్‌గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్‌ ప్రాఫిట్‌ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్‌ సెలబ్రేషన్స్‌ని వ్యతిరేకిస్తూ  మళ్లీ ఓ క్యాంపెయిన్‌ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్‌ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్‌ డే’ గ్లోబల్‌ ఈవెంట్‌  అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!

అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్‌ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!

  • ప్రతి సంవత్సరం.. ‘మదర్స్‌ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్‌ కాల్స్‌ రికార్డ్‌ అవుతాయట.

  • క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్‌ డే!

  • ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో  నాలుగింట ఒక వంతు పూలు మదర్స్‌ డే రోజునే అమ్ముడుపోతాయి.

  • ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్‌కి మదర్స్‌ డే బిజీయెస్ట్‌ డే.

  • మదర్స్‌ డే సంప్రదాయ కానుక.. సింగిల్‌ కార్నేషన్‌.

  • ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్‌తోనే మొదలవుతుందట.

  • ఇటలీలో మదర్స్‌ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్‌ చేస్తారట కుటుంబ సభ్యులంతా!

ఒంటరి తల్లులకు అండగా.. 
ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్‌ హేడెన్‌ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్‌ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్‌ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్‌ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ  విరగబూసే చేమంతులే మదర్స్‌ డే  సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.

పబ్లిక్‌ హాలీడే కాదు.. 
పోలండ్‌లో ‘మదర్స్‌ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్‌ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్‌ కార్డ్స్, పేపర్‌ ఫ్లవర్స్‌ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.

బిజీయెస్ట్‌ డే ఆఫ్‌ ది ఇయర్‌!
మెక్సికోలో మే 10న ‘మదర్స్‌ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్‌తో సెలబ్రేట్‌ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్‌కి తీసుకెళ్తారు. మదర్స్‌ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్‌ అన్నిటికీ బిజీయెస్ట్‌ డే ఆఫ్‌ ది ఇయర్‌ అని చెబుతారు స్థానికులు.

మదర్‌ ఫిగర్స్‌ అందరికీ..
నికరాగువాలో మే 30న ‘మదర్స్‌ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్‌లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్‌ ఫిగర్స్‌ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.

రాణి పుట్టిన రోజు..
థాయ్‌లండ్‌లో ఆ దేశపు రాణి.. క్వీన్‌  సిరికిట్‌ బర్త్‌ డే.. ఆగస్ట్‌ 12ను ‘మదర్స్‌ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్‌ డేని ‘మదర్స్‌ డే’గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా  ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్‌ సిరికిట్‌ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.

మూడు రోజుల వేడుక!
ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు.  వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ..  డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్‌’, ‘పంచ్‌’లను ఆరగిస్తారు. హష్‌ అంటే ఇథియోపియన్‌ మసాలాలు, చీజ్‌తో వండిన మటన్‌ లేదా బీఫ్‌. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్‌ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్‌బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.

కుటుంబ పండగ
బ్రెజిల్‌లో మే రెండో ఆదివారమే ‘మదర్స్‌ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్‌ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి  ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డించే  ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్‌ మీట్‌ ‘మదర్స్‌ డే’ స్పెషల్‌ డిష్‌ ఇక్కడ.

వారం రోజులు..
పెరూలోనూ  మే రెండో ఆదివారమే ‘మదర్స్‌ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.

రూరల్‌ విమెన్స్‌ డే కూడా..
మలావీలో అక్టోబర్‌ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్‌ హాలీడే. అక్టోబర్‌ 15 ‘రూరల్‌ విమెన్స్‌ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.

రెడ్‌ కార్నేషన్‌తో.. 
జపాన్‌లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి  కోజన్‌ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్‌ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్‌ కార్నేషన్‌ ఫ్లవర్‌తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.

రెండుసార్లు.. 
రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.

ఆఖరి ఆదివారం
ఫ్రాన్స్‌లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్‌ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్‌ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.

స్వయంగా చేసి.. 
స్పెయిన్‌లో డిసెంబర్‌ 8న ‘మదర్స్‌ డే’ను సెలబ్రేట్‌ చేస్తారు. దీన్ని మదర్‌ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున  గీట్రింగ్‌ కార్డ్స్, చాక్‌లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!

జపాన్‌లో అమ్మకు రెడ్‌ కార్నేషన్‌ ఇస్తూ..

తల్లులకు ఆసరాగా.. 
స్వీడన్‌లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్‌ డే’. ఈ రోజున స్వీడిష్‌ రెడ్‌ క్రాస్‌.. చిన్న చిన్న ప్లాస్టిక్‌ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.

ఎంత మంది పిల్లలు అనే లెక్కన
జర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్‌ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్‌లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్‌ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్‌తో సత్కరించేవారట.

రెండూ ఒకే రోజు
ఫిలిప్పీన్స్‌లో మే రెండో ఆదివారం నాడే  మదర్స్‌ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కస్‌ డిసెంబర్‌ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్‌ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా   ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్‌ జోసెఫ్‌ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ  రెండిటినీ డిసెంబర్‌కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్‌ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్‌ డే’ రోజున ఫ్లవర్స్, చాక్‌లేట్స్, గిఫ్ట్‌లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.

స్కౌట్‌ మూవ్‌మెంట్‌ మద్దతు
ఆస్ట్రియాలో మదర్స్‌ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్‌ విమెన్స్‌ మూవ్‌మెంట్‌ వ్యవస్థాపకురాలు మరియాన్‌ హెయినిష్‌ ‘మదర్స్‌డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్‌ మూవ్‌మెంట్‌  మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్‌ డే’ సెలబ్రేట్‌ చేసుకుంటారు.

పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..

అమ్మను చూసే రోజు..
నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్‌ హెర్నే దిన్‌ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్‌ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.

ముస్తఫా అమిన్‌ వల్ల..
ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్‌ వంటి దేశాల్లో మార్చ్‌ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్‌ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్‌ ముస్తఫా అమిన్‌ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్‌ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.

నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి పండగ..

పిల్లల్ని రక్షించినందుకు..
ఇజ్రాయెల్‌లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్‌ క్యాలెండర్‌ ప్రకారం షెవత్‌ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్‌ నాయకత్వం లోని యూత్‌ ఆలియా ఆర్గనైజేషన్‌.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి  గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.

ఇంకా ఈ దేశాల్లో.. 
నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్‌ సండే ఆఫ్‌ లెంట్, ఎల్‌ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్‌ రిపబ్లిక్,  హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు.

Advertisement
 
Advertisement
 
Advertisement