ఫర్‌ డెమాక్రసీ? అగేనెస్ట్‌ డెమాక్రసీ? | Sakshi
Sakshi News home page

ఫర్‌ డెమాక్రసీ? అగేనెస్ట్‌ డెమాక్రసీ?

Published Fri, Apr 12 2024 12:27 AM

Sakshi Guest Column On Andhra Pradesh Politics Citizens for Democracy

అభిప్రాయం

‘సిటిజెన్స్‌ ఫర్‌ డెమాక్రసీ’ ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ సంస్థ చేసిన అతి గొప్ప పని ముసలివాళ్ళకు, గుడ్డివాళ్ళకు, కుంటివాళ్ళకు ఇంటి దగ్గరే పింఛన్లను అందించే కార్యక్రమాన్ని ఆపించడం. ఇందుకోసం ముందు కోర్టుకు పోయింది. తరువాత ఎన్నికల కమిషన్‌ వద్దకు పోయి ఆపించింది. ఎందుకు? జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నియమించిన 2,50,000 మంది వలంటీర్లు ఫించన్ల పంపిణీ ద్వారా ఓటును ప్రభావితం చేస్తారని. ఇదో కొత్త వాదన, వింత వాదన. ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ సంస్థను ప్రజలు గౌరవిస్తారా?

వైసీపీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వలంటీర్లను కాంట్రాక్టు ఉద్యోగ పద్ధతిలో నియమించింది. వారినందరినీ ఉద్యోగాల నుండి తీసేసే అధికారం ఈసీకి కూడా లేదు. వలంటీర్లు చేసే అతిమానవత్వపు పని ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఒకటో తారీఖు నాడు పెన్షన్‌ డబ్బు వాళ్ళ ఇంటి వద్ద అందించడం. అదికాక వీళ్లు ఇంకా చాలా పనులు తమ క్లస్టర్స్‌ (దాదాపు 50 కుటుంబాలు)లో చేస్తారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఆ కుటుంబాలతో, ఆ ముసలి వారితో, రోగస్థులతో సంబంధంలో ఉండి వారి మెప్పును పొందిన వలంటీర్లను ఎన్నికలయ్యే వరకు వారిని కలిసి మాట్లాడకుండా ఎలా ఆపుతారు?

అంతేకాదు, ప్రభుత్వ వెల్‌ఫేర్‌ స్కీముల కిందికొచ్చే ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా మెజారిటీ. అటువంటి కుటుంబాలన్నిటితో ఈ వలంటీర్లు చాలా ఇతర స్కీముల ద్వారా కూడా కలుస్తారు కదా. ఆరోగ్య సంబంధ స్కీములు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అవసరాలు, స్కూలు పిల్లలకు ఉన్న అవసరాలు, రేషనుకు సంబంధించిన అవస రాలు అన్నీ వాళ్లు ఇంటింటికి తీరుస్తున్నారు.

ఈ క్రమంలో వాళ్ళకు చెడ్డ పేరొస్తే తప్ప, మంచి పేరుతో, సహాయ సహకార సంబంధాలలో వలంటీర్లు ఉంటే వారి సంబంధాల్ని సిటిజెన్స్‌ ఫర్‌ డెమాక్రసీ గానీ, ఈసీగానీ ఎలా ఆపుతాయి? ఈ పనిని ఈ సంస్థ డెమాక్రసీకి అను కూలంగా కాదు చేసింది; డెమాక్రసీ వ్యతిరేక బుద్ధితో చేసినట్లు అర్థమౌతూనే ఉంది. ఈ వలంటీర్లు ఆయా గ్రామాల వారే, వాడల వారే. పట్టణాల్లో కూడా వాళ్ళు పనులు చేసే కుటుంబాలకు తెలిసిన వారే. వీళ్ళు నిత్య సంబంధాలు ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఫించను ఇవ్వకుండా ఆపితే ఆగుతాయా? 

అప్పుడు ఈ సంస్థ ఏమి చెయ్యాలి? ఈ వలంటీర్ల ఉద్యోగాలు పీకించి గ్రామ బహిష్కరణ చేయించాలి. అప్పుడు వీళ్ళు నిజమైన సిటిజెన్స్‌ ఫర్‌ డెమాక్రసీ పని చేసినట్టు! కానీ అది వారి నుంచి కాదు కనుక ఈ ఒక్క డిమాండ్‌ సాధించారు. ఈ పని చేసింది ప్రజా స్వామ్యం కోసమా, ప్రతిపక్షాల కోసమా?

అసలు ఈ సంస్థ ఏర్పడిన విధానం, దాని లక్ష్యం, అది సాధించిన ఘనతలను చూద్దాం. ఇది 2023 అక్టోబర్‌లో విజయవాడలో ఏర్పడింది. మాజీ ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌) జనరల్‌ సెక్రటరీగా ఏర్పడింది. మాజీ ఛీప్‌ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం (రిటైర్డ్‌ ఐఏఎస్‌) ఇందులో ముఖ్యంగా పని చేస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోనే డెమాక్రసీని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఇద్దరికీ పౌరహక్కుల గురించి ఎన్నడూ మాట్లాడిన చరిత్ర లేదు. ఆదివాసుల్లోగానీ, దళితుల్లోగానీ వీరికి అభిమానులు ఉన్నట్లు ఎక్కడా కనిపించదు.

ఇంతకుముందు ఐఏఎస్‌ అధికారులు పదవుల్లో ఉండగా, దిగిపోయాక కూడా ప్రజల హక్కుల కోసం పని చేసినవాళ్ళు ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో ఎస్‌ఆర్‌ శంకరన్, కాకి మాధవరావు చాలా కాలం ఇటువంటి పని చేశారు. ఆదివాసుల కోసం బీడీ శర్మ చాలా పనిచేశారు. శంకరన్‌ రిటైర్‌ అయ్యాక కమిటీ ఆఫ్‌ కన్సర్న్‌డ్‌ సిటిజన్స్‌ అనే సంస్థ పెట్టి బీద ప్రజల కోసం, పౌర హక్కుల రక్షణ కోసం చాలా పనిచేశారు. ఆయన మరణానంతరం దళిత సంఘాలు ఈనాటికీ ఆయన సంస్మరణ సభలు జరుపుతాయి. కాకి మాధవరావు ఫోరమ్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌లో చాలా చురుకుగా పనిచేశారు. బీడీ శర్మ ఆది వాసుల హక్కుల కోసం తన జీవిత కాలమంతా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

అందుకు భిన్నంగా రమేష్‌ కుమార్, సుబ్రహ్మణ్యం... చంద్ర బాబు నాయుడి ఏజెంట్లుగా వ్యవహరించారని స్పష్టంగా అర్థమౌ తూనే ఉంది. దానివల్ల ఎవరి హక్కులు భంగమయ్యాయి? అతి బీద, ముసలి, కుంటి, గుడ్డి వారి హక్కులు భంగమయ్యాయి. చాలా బాధా కరమైన విషయమేమంటే ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన సిటిజెన్స్‌ ఫర్‌ డెమాక్రసీ అనే పేరు గల సంస్థను ప్రజలు గౌరవిస్తారా?

ఇప్పుడు పరిస్థితి చూడండి. అదే చంద్రబాబు నాయుడు నేను వలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను; వాళ్ళందరికీ నెలకు 10 వేలు ఇస్తానంటున్నాడు ఎందుకు? మొత్తం ప్రజానీకంలో ఆయన ఆట బొమ్మలైన మాజీ ఐఏఎస్‌ అధికారులు చేసిన పనివల్ల మొత్తం కూటమి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఈ కూటమి కూడా ఒక ఉమ్మడి మానిఫెస్టోను ప్రకటించలేదు. ఎవరిది వాళ్ళు మానిఫెస్టోగా రాసుకున్నారు. కానీ రేపు అధికారమొస్తే ముగ్గురు మంత్రి మండలిలో ఉండి పరిపాలించాలి. చంద్రబాబు ఇప్పుడు ఇచ్చే హామీలు బీజేపీ, జనసేనవి కావు కదా! వాళ్ళెందుకు అంగీకరిస్తారు? ఆయన పబ్లిక్‌ మీటింగుల్లో ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నాడు.

మరో వాగ్దానం చూడండి. ఆయన అధికారంలోకి వస్తే ప్రతి స్త్రీకి సంవత్సరానికి 15 వేలు ఇస్తాడట. ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తాడట. ఇద్దరుంటే 30 వేలు, ముగ్గురుంటే 45 వేలు అంటున్నాడు. ఈ పైసల పంపకాన్ని బీజేపీ ఒప్పుకుంటుందా! అందుకు మోదీ సరే అన్నాడా? చంద్రబాబు హామీలు జగన్‌ హామీ లలా కాదే. జగన్‌ అన్నీ స్వయంగా తన పార్టీలో నిర్ణయించగలడు. కానీ బాబు ఇప్పుడు అలా చెయ్యలేడే. బీజేపీ ఒక జాతీయ పార్టీ. దానికి 30 వేల ఎకరాల్లో వేల కోట్లు పెట్టి రాజధాని కట్టడమే అంగీకారం కాదు. ఇప్పుడు ఆంధ్రలో వలంటరీ వ్యవస్థను అంగీకరిస్తే దేశమంతా అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశముంది. కనుక బాబు బోగస్‌ వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయన అయోమయంలో మాట్లాడు తున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు దేశంలో చాలా అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రశాంత్‌ కిశోర్‌ డబ్బులతో ఎన్నికల రిజల్ట్‌ ప్రిడిక్షన్స్‌ చేస్తూ స్వంత పార్టీ పెట్టి బిహార్‌లో ఏ మాత్రం గుర్తింపు లేని నాయకుడుగా మిగిలిపోయి ఇప్పుడు మళ్ళీ పాత అవతారమెత్తుతున్నాడు. ఏపీ ఎన్నికలు అతన్ని దేశంలోనే ఎవరూ నమ్మకుండా చేసే అవకాశముంది. విదేశాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకొని వచ్చిన ఈ బ్రాహ్మణ మేధావి ఇంగ్లిష్‌ మీడియం విద్యా ప్రభావంగానీ, సంక్షేమ పథకాల ప్రభావంగానీ ఎన్నికల్లో ఉండదని ఊకదంపుడు బ్రాహ్మణ వాదం చేస్తున్నాడు.

బడులు కాకుండా, గుడులు కడితే ప్రజలు ఓట్లేస్తారని వీరి సిద్ధాంతం. రిటైర్డ్‌ ఐఏఎస్‌లు పౌరహక్కుల నాయకుల అవతారమెత్తి ముసలోళ్ళను, కుంటోళ్లను, గుడ్డోళ్ళను ముంచితే వారి నాయకుడు చంద్రబాబు వలంటీర్లను, అమరావతి రైతులను అంతు లేని ఆశలతో ముంచుదామని చూస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. ఎలా నమ్ముతారు? జగన్‌ వెల్‌ఫేర్‌ కార్యక్రమాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది; అభివృద్ధి అంటే సింగపూర్‌ వంటి రాజధాని కట్టలేదు; అద్దంలా మెరిసే రోడ్లు వెయ్యలేదు అంటూనే ఇప్పుడు జగన్‌ను మించిన హామీలిస్తున్నాడు.

ఆయన ఇచ్చే హామీల గురించి పవన్‌ కల్యాణ్‌ గానీ, పురందే శ్వరిగానీ ఏమీ మాట్లాడటం లేదు. అంటే ఆ పార్టీలు ఈ వాగ్దానా లను అంగీకరించవనే కదా అర్థం. ఎన్నికలు ఇంకో నెల రోజులు ఉండగా, ఈ మూడు పార్టీల పరేషాన్‌ చూస్తే చూసేవారికే జాలేస్తుంది. మరీ చంద్రబాబు అయితే ఓడిపోతే ఎట్లా, ఎట్లా అనే భయం ముఖంలో కనిపిస్తుంది. ఇవి ఆఖరి ఎన్నికలని ఆయన భయమే చెబుతుంది. ఏమౌతుందో ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త  

Advertisement
Advertisement