వెన్నుపోటు రాజుపై ఇక వేటు!

28 Mar, 2024 14:49 IST|Sakshi

ఎమ్మెల్సీ రఘురాజుపై శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ విప్‌ పాలవలస విక్రాంత్‌ వినతి

 మరోవైపు హైదరాబాద్‌లో లోకేశ్‌ నివాసంలో రఘురాజు ప్రత్యక్షం?

 గొంప కృష్ణ పంచాయితీలో భాగస్వామ్యం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: వేర్వేరు పార్టీల్లో ఉండే అన్నదమ్ములను చూశాం... కానీ ఒకే ఇంట్లో చక్కగా కాపురం చేసుకుంటున్న దంపతుల్లో భర్త ఒక పార్టీలో, భార్య ప్రత్యర్థి పార్టీలో ఉండటం బహుశా ఇప్పటివరకూ ఎక్కడా చూసిఉండం!. నమ్మి నెత్తిన పెట్టుకున్న పార్టీలకు వెన్నుపోటు పొడిచే ఆ ఉత్తమ దంపతుల గురించి తెలుసుకోవాలంటే శృంగవరపుకోట రావాల్సిందే. వారిలో భర్త ఇందుకూరి రఘురాజు, భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్‌ సుధారాజు!. జిల్లాలో రాజకీయ, సామాజిక సమీకరణలతో సంబంధం లేకుండా కేవలం అభిమానంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి వారిని అందలం ఎక్కించారు.

చివరకు ఆయన మాటను పెడచెవినపెట్టి, ప్రత్యర్థులతో చేతులు కలిపి వైఎస్సార్‌సీపీకే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమైపోయారు. తనకు రిజర్వుర్డ్‌ మండలంలో వైస్‌ ఎంపీపీ పదవి ఇచ్చి, రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వైఎస్సార్‌సీపీని కాలదన్ని సుబ్బలక్ష్మి టీడీపీలోకి ఫిరాయించారు. తాను కూడా ఫిరాయిస్తే ఎక్కడ ఎమ్మెల్సీ పదవి పోతుందోననే భయంతో రఘురాజు మాత్రం పసుపు కండువా వేసుకోలేదు. అదొక్కటి తప్ప తెరవెనుక టీడీపీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారో ఎస్‌.కోట ప్రజలకు బహిరంగ రహస్యమే.

‘కోళ్ల’ మేలు కోసం కుతంత్రాలు...
నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాపల్లి నియోజకవర్గం రద్దు అయిపోయిన నేపథ్యంలో కోళ్ల కుటుంబం శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గానికి మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం చూస్తే... తొలి నుంచి సొంత పార్టీ నాయకులతో కలహాలు అలవాటైన ఇందుకూరి రఘురాజు 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచారు. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి స్వయంగా వారించినా వెనక్కి తగ్గని ధిక్కార స్వభావం ఆయనది. కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసిన అల్లు కేశవ వెంకట జోగినాయుడి ఓటమికి కారణమయ్యారు. ఇండిపెండెంట్‌ (కాంగ్రెస్‌ రెబల్‌)గా పోటీచేసి పరోక్షంగా టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి గెలుపునకు బాటలు వేశారు. ఆ ఎన్నికల్లో జోగినాయుడిపై కేవలం 3,440 ఓట్ల మెజార్టీతో ఆమె బయటపడ్డారు.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘురాజు పోటీచేసి టీడీపీ అభ్యర్థి లలితకుమారి గట్టెక్కడానికి ఉపయోగపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అలాంటి కుతంత్రాలేవీ కుదర్లేదు. కొత్తవాడు ఓడిపోతాడనుకుంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు 11,365 ఓట్ల మెజార్టీతో లలితకుమారిని మట్టి కరిపించారు. 2024 ఎన్నికల్లో అయినా ఆమెను గట్టెక్కించడానికి రఘురాజు దంపతులు ఒక వ్యూహం ప్రకారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దిగారు. మరోవైపు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 58 నెలల్లో అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మరింత ప్రజాభిమానం సంపాదించుకున్నారు. మళ్లీ అతనికే వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇస్తే గెలుపు ఖాయమని, లలితకుమారికి మళ్లీ ఓటమి తప్పదని భావించిన రఘురాజు దంపతులు ప్రత్యక్ష యుద్ధానికి దిగారు.

ఇది సరికాదని జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఇతర నాయకులు హెచ్చరించినా తగ్గలేదు. చివరకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడలా... కడుబండి శ్రీనివాసరావుకు మద్దతుగా ఉండాలని హితవు పలికారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత రఘురాజు భార్య సుబ్బలక్ష్మిని, ఆయన అనుచరులను టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి స్వయంగా విజయవాడ తీసుకెళ్లి ఇటీవల లోకేశ్‌తో టీడీపీ కండువా వేయించారు. తన భర్తకు ఎమ్మెల్సీ పదవి, తనకు వైస్‌ ఎంపీపీ పదవి ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడుస్తున్నామనే కనీస నైతిక విలువల్లేకుండా సుబ్బలక్ష్మి ఎంతో సంతోషంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

లేకలేక వచ్చిన పదవి కోసం...
ఇందుకూరి రఘురాజు రాజకీయ నేపథ్యం చూస్తే ఎస్‌.కోట మండలంలో ఆయన ప్రభావం అంతంత మాత్రమే. తన చేతిలో ఉన్నాయని చెబుతున్న నాలుగు ఊర్లలో కూడా టీడీపీకే మెజార్టీ ఓట్లు ఉండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక, రాజకీయ సమీకరణాలతో నిమిత్తం లేకుండా, అదీ జిల్లాలో అప్పటికే క్షత్రియ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నా అదే సామాజికవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి గౌరవించింది. ఆయన భార్య సుబ్బలక్ష్మి కి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా వైస్‌ ఎంపీపీ పదవి వరించింది.

ఇద్దరూ చక్కగా పదవులు అనుభవిస్తూ వైఎస్సార్‌సీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భార్య, నలుగురైదుగురు అనుచరులూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నా రఘురాజు మాత్రం తాను ఇంకా వైఎస్సార్‌సీపీలోనే ఉన్నానంటూ బుకాయించడం మొదలెట్టారు. ఎక్కడ టీడీపీ కండువా వేసుకుంటే ఎమ్మెల్సీ పదవి ఊడిపోతుందనేది ఆయన భయం.

రఘురాజుపై ఫిర్యాదు దాఖలు...
ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒక పార్టీ తరఫున చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తి తర్వాత సదరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం–1985 ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ఈ ప్రకారం వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టిన రఘురాజు ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తూ బుధవారం ఫిర్యాదు దాఖలైంది. శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు విప్‌ పాలవలస విక్రాంత్‌ ఫిర్యాదు పత్రం అందజేశారు. తదుపరి శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు స్పందించాల్సి ఉంది. ఈ ఫిర్యాదులోని ఆరోపణలపై వివరణ కోరుతూ రఘురాజుకు నోటీసులు జారీ చేస్తారు. ఆరోపణలు రుజువైతే ఎన్నికల కమిషన్‌ అనుమతితో రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.

వేటు వేయక తప్పని పరిస్థితి...
శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ దక్కించుకున్న కోళ్ల లలితకుమారికి వ్యతిరేకంగా గొంప కృష్ణ గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. తనకు టిక్కెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆయనకేదో ఎమ్మెల్సీ ఆశచూపించి పక్కకు తప్పించే ఆలోచనతో నారా లోకేశ్‌ హైదరాబాద్‌ లో తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడ జరిగి న టిక్కెట్‌ పంచాయితీలో ఎమ్మెల్సీ రఘురాజు పాలుపంచుకొన్నారనేది విశ్వసనీయ సమాచారం. లోకేశ్‌ ఇంట్లో రఘురాజును చూసి అక్కడికి వెళ్లిన టీడీపీ నాయకులే అవాక్కయ్యారట.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers