ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

Published Thu, Mar 28 2024 1:25 AM

 గుమ్మలక్ష్మీపురంలో వాటర్‌ ట్యాంకులను 
పరిశుభ్రం చేస్తున్న కార్మికులు  - Sakshi

పార్వతీపురంటౌన్‌: దశాబ్దాల కాలంగా వాణిజ్యపరంగా, వ్యాపార పరంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం వెలుగొందేది. దీనిని గుర్తించిన గత పాలకులు డివిజన్‌గా మార్చారు. అయితే డివిజన్‌ స్థాయి తప్ప ఎక్కడా అభివృద్ధి దాఖలాలు ఉండేవి కాదు. అభివృద్ధికి నోచుకోని పార్వతీపురం డివిజన్‌ను ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తించి పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. మెరుగైన పారిశుద్ధ్య చర్యల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు పారిశుద్ధ్యం మెరుగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ప్రజల్లో చైతన్యం నింపడం ద్వారా గ్రామాలు, నివాసిత ప్రాంతా లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషిచేస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని 452 పంచాయతీల్లో క్రమం తప్పకుండా ప్రతి శుక్ర, శనివారాలు డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య ఆరోగ్యసిబ్బంది సమన్వయంతో డ్రైడే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలోనే ముందంజలో పార్వతీపురం మన్యం జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా నిలిచింది.

ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో

గ్రామాల్లో తాగునీటి నిల్వకేంద్రాలైన వాటర్‌ ట్యాంకుల పరిశుభ్రతకు అఽధిక ప్రాధాన్యమిస్తూ ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది, గ్రామంలో స్వచ్ఛందంగా వచ్చే వ్యక్తులతో కలిసి నెలకు రెండుసార్లు వాటర్‌ ట్యాంకులను పరిశుభ్రం చేస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. అకాల వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో వర్షపు నీటి నిల్వతో అంటు వ్యాధులు ప్రబలకుండా వర్షపునీటిని దారి మళ్లించేందుకు పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రతి శుక్ర, శనివారాలు క్రమం తప్పకుండా డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలను పరిశుభ్రం చేస్తూ బ్లీచింగ్‌, ఫాగింగ్‌, క్లోరినేషన్‌ పిచికారీ చేస్తూ గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నారు.

వైద్య ఆరోగ్యసిబ్బంది ఆధ్వర్యంలో..

గ్రామస్తుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డ్రైడే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి మందులు, రక్తపరీక్ష కిట్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వాటిని పర్యవేక్షించడానికి ఒక ఏఎన్‌ఎంను గ్రామస్తుల కోసం నియమించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఓఆర్‌ఎస్‌, జింక్‌ మాత్రలను అందుబాటులో ఉంచారు. జిల్లా స్థాయి అధికారి ప్రతి శుక్ర, శనివారాల్లో గిరిజన గ్రామాలకు వెళ్లి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో గిరిజనులకు గ్రామాల్లోనే మంచి వైద్యసేవలు అందుతున్నాయి.

 కేదారిపురంలో చెత్తను సేకరిస్తున్న గ్రీన్‌ అంబాసిడర్‌
1/3

కేదారిపురంలో చెత్తను సేకరిస్తున్న గ్రీన్‌ అంబాసిడర్‌

 సీజనల్‌ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది
2/3

సీజనల్‌ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది

పార్వతీపురం మండలంలో యాంటీ లార్వా పిచికారీ చేస్తున్న సిబ్బంది
3/3

పార్వతీపురం మండలంలో యాంటీ లార్వా పిచికారీ చేస్తున్న సిబ్బంది

Advertisement
Advertisement