ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

Published Mon, Apr 8 2024 8:15 AM

-

కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి

కొత్తూరు: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తనను ఆశీర్వదించి గెలిపించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నందిగామ, కొత్తూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వం అమలు చేసే పథకాలను వర్తింపచేస్తామన్నారు. ఎన్నికల తర్వాత నిరుద్యోగులకు ఆర్థిక సాయంతో పాటు ఏకకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధిహామీ తరపున కూలీలకు రోజుకు రూ.400 కూలీతో పాటు ఎక్కువ రోజులు పనికల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. ఎన్నికల తర్వాత అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శించారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఎమ్మెల్యేగా, ఇతర పదవుల్లో ఉండి కూడా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలను మర్చిపోయారన్నారు. అనంతరం చౌదరిగూడతో పాటు కొత్తూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, శివశంకర్‌గౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, గోవర్దన్‌గౌడ్‌, జంగ నర్సింహ పాల్గొన్నారు.

ఉగాది నుంచి

నాటక మహోత్సవాలు

బంజారాహిల్స్‌: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిలింనగర్‌లోని డాక్టర్‌ డి.రామానాయుడు కళా మండపంలో ఈ నెల 9 నుంచి 13 వరకు రాత్రి 9 గంటల నుంచి పద్య నాటక మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు ఆది శేషగిరిరావు, సెక్రటరీ కాజా సూర్యనారాయణ, కార్యనిర్వాహకులు పొత్తూరి వెంకట సుబ్బారావు నేతృత్వంలో ఈ నాటక మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు రాత్రి 9 గంటలకు నాగోల్‌ శ్రీసీఎస్‌ఆర్‌ కళామందిరం వారిచే గుణనిధి, 10న బాపట్ల చెరుకుపల్లి ఉషోదయ నాట్య కళామండలి వారిచే మోహిని భస్మాసుర (పౌరాణిక పద్య నాటకం), 11న హైదరాబాద్‌ నవక్రాంతి కల్చరల్‌ అసోసియేషన్‌చే బాలనాగమ్మ పద్యనాటకం, 12న గుంటూరు శ్రీనివాస చైతన్య కళా నాట్య మండలిచే సత్యహరిశ్చంద్ర (వారణాసి, కాటి సీన్లు), 13న రాత్రి 9 గంటలకు ఖమ్మం మధిర సుమిత్ర యూత్‌ అసోసియేషన్‌చే యయాతి పద్యనాటకం ప్రదర్శించనున్నారు.

జలమండలి చలివేంద్రాలు

పాదచారుల దాహార్తి తీర్చేందుకు చర్యలు

సాక్షి, సిటీబ్యూరో: ఉష్ణతాపం పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర పనుల నిమిత్తం బయటకి వచ్చే వాహనదారులు, పాదచారులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. నగరంలో జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు ఆస్పత్రులు, బస్టాండ్‌ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఆదివారం బసవతారకం, మెహిదీపట్నం రైతు బజార్‌ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను జలమండలి ఎండీ సుదర్శన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రోజురోజుకీ ఎండలు పెరుగుతుండటంతో జన సంచారం ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రెండు కేంద్రాలను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. మిగతా ప్రాంతా ల్లోనూ ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విడతల వారీగా మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే కాలంలో జలమండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు మంచి ఆదరణ వస్తే.. వాటిని ఏడాది పొడుగునా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఏవైనా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తే.. వారికి ట్యాంకర్‌ ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేస్తామని చెప్పారు. దీని కోసం ఆయా డివిజన్ల అధికారుల్ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆపరేషన్స్‌–1 అజ్మీరా కృష్ణ, సీజీఎం వినోద్‌ భార్గవ పాల్గొన్నారు.

Advertisement
Advertisement