amp pages | Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ: వైఎస్సార్‌సీపీ ముందంజ

Published on Tue, 03/21/2017 - 13:26

అనంతపురం/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. పశ్చిమ రాయలసీమ(చిత్తూరు, అనంతపురం) ఎమ్మెల్సీ స్థానంలో  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆరో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యే సమయానికి గోపాల్‌రెడ్డి 12,637 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి రెండో స్థానంలోనూ, పీడీఎఫ్‌ అభ్యర్థి గేయానంద్‌ మూడో స్థానంలోనూ ఉన్నారు.
 
ఇక ఉత్తరాంధ్ర(విశాఖ) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్‌ మాధవ్‌ ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యే సమయానికి మాధవ్‌  5,045 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి అజయ్‌ శర్మ రెండో స్థానానికి పరిమితమైపోయారు.

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ
రాయలసీమలో సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ, (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఘన విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో విఠపు బాలసుబ్రహ్మణ్యం.. తన సమీప ప్రత్యర్థి, అధికార టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుపై 3,553 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.  
 
పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి.. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చలపుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక ఓటమి పాలయ్యారు.   కత్తి నరసింహారెడ్డికి 3,763 ఓట్ల మెజారిటీ వచ్చింది. అటు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్‌ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది.