amp pages | Sakshi

గుడ్డుకు శ్రావణ క్షోభ

Published on Mon, 08/27/2018 - 13:14

తూర్పు గోదావరి ,మండపేట: వేసవి ఇక్కట్ల నుంచి గట్టెక్కుతున్నామన్న కోళ్ల రైతుల ఆనందాన్ని శ్రావణమాసం ఆవిరి చేస్తోంది. శ్రావణ శుక్రవారాలు, ఇతర పర్వదినాల కారణంగా చాలామంది మహిళలు గుడ్డు వినియోగించరు. ఈ కారణంగా గుడ్డు ధర నిరాశాజనకంగా తయారైంది. ప్రస్తుత ధరను బట్టి రోజుకు పరిశ్రమకు సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. త్వరలో గణపతి నవరాత్రులు రానుండటంతో మున్ముందు పరిశ్రమకు గడ్డు కాలమేనని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎండల తీవ్రతతో ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మేర పడిపోయిన గుడ్ల ఉత్పత్తి తొలకరి జల్లులతో సాధారణ స్థితికి చేరింది. ప్రస్తుతం రోజుకు 1.1 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 60 శాతం ఎగుమతి అవుతుండగా, మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం పెరిగింది. ఈ ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కోళ్ల మరణాలు, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం, నిర్వహణ భారం తదితర రూపాల్లో పరిశ్రమకు దాదాపు రూ.50 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. వేసవి ప్రభావంతో ఏప్రిల్‌లో రూ.3కు పతనమైన గుడ్డు రైతు ధర జూలైలో ఎగుమతులు పుంజుకుని పెరుగుతూ వచ్చింది. జూలై 27వ తేదీ నాటికి రైతు ధర రూ.4.11కు చేరుకుంది. శ్రావణమాసం రాకతో ఉత్పత్తికి తగిన డిమాండ్‌ లేక ధర పతనమవుతోంది. జిల్లా నుంచి ఎగుమతులు జరిగే ఉత్తరాది రాష్ట్రాల్లో మనకంటే దాదాపు 15 రోజులు ముందుగానే శ్రావణమాసం మొదలవుతుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు జిల్లాలో వినియోగం తగ్గడంతో ఈ నెల 11వ తేదీ నాటికి రైతు ధర రూ.3.30కు పతనమైంది. ప్రస్తుతం నెక్‌ ప్రకటిత ధర రూ.3.41కు చేరినా అది రైతులకు అందడం లేదంటున్నారు. పెరిగిన నిర్వహణ భారంతో గుడ్డు రైతు ధర రూ.3.75 ఉంటేనేకాని గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఆ మేరకు జిల్లా పరిశ్రమకు రోజుకు సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుడ్లు తేలేస్తున్న వినియోగదారులు
తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా వ్యాపారులు రిటైల్‌ అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. రైతు ధర రూ.3.41 పైసలు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.ఐదు వరకు అమ్మకాలు చేస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న అనపర్తి, మండపేట, పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోను ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. పెరిగిన ధరతో వీటిని కొనుగోలు చేసేందుకు సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు.

ఊరటనిస్తున్న చికెన్‌ ధరలు
రిటైల్‌ మార్కెట్‌లో చికెన్‌ ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఎండల తీవ్రతతో గత రెండు నెలల్లో చికెన్‌ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. బ్రాయిలర్‌ లైవ్‌ కిలో రూ.120కు చేరగా, మాంసం కిలో రూ.220కు, స్కిన్‌లెస్‌ రూ.240కు చేరి వినియోగదారుల్ని బెంబేలెత్తించాయి. కొత్త బ్యాచ్‌లు రావడం, శ్రావణమాసంతో వినియోగం సరిగా లేక ధర తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్‌ లైవ్‌ కిలో రూ.82 ఉండగా, మాంసం రూ.160, స్కిన్‌లెస్‌ రూ.180కు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధర మరింత తగ్గే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. గత నెలలో రూ.80గా ఉన్న లైవ్‌ కిలో లేయర్‌ కోడి ధర ప్రస్తుతం రూ.60కు తగ్గిపోయింది. ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.5 ఉంటేనే నష్టాల భర్తీ
వేసవిలో కోట్లాది రూపాయల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ఆ నష్టాల నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో ధర పతనం కావడం పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. మార్కెట్‌లో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. పౌల్ట్రీల నిర్వహణ భారం పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డుకు రైతు ధర రూ.5 ఉంటే కాని కోళ్ల రైతులు పాత నష్టాలను భర్తీ చేసుకోలేరు.
–  పడాల సుబ్బారెడ్డి, నెక్‌ జాతీయ కమిటీ సభ్యుడు, పౌల్ట్రీ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?