amp pages | Sakshi

గెలుపు గుర్రాల్లాంటి అభ్యర్థులు

Published on Mon, 03/18/2019 - 07:59

నోటిఫికేషన్‌ విడుదల కానున్న వేళ.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణాన.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అచంచల ఆత్మవిశ్వాసంతో ఒకేసారి రాష్ట్రంలోని అందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సమరోత్సాహం తొణికిసలాడుతోంది. జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఊహించిన విధంగానే పార్టీ సమన్వయకర్తలకు అవకాశం దక్కింది. కొత్త నేతల చేరికతో మంచి జోష్‌ మీదున్న పార్టీ.. సమష్టి కృషితో సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు గుర్రాల్లాంటి అభ్యర్థులను బరిలోకి దించింది. గత ఐదేళ్ల కాలంలో ఒకవైపు అధికార టీడీపీ అరాచకాలపై పోరాడుతూ, మరోవైపు వైఎస్సార్‌సీపీ పటిష్టత కోసం అహర్నిశలు కష్టపడినవారికి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారు. పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులందర్నీ ఆదివారం ఒకే జాబితాలో ప్రకటించి సంచలనం సృష్టించారు. మహిళలకు, యువ నాయకత్వానికి పెద్దపీట వేశారు. సార్వత్రిక ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇదే తరుణంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూడా నామినేషన్ల ఘట్టానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇన్నాళ్లూ నియోజకవర్గాల్లో గడపగడపా చుట్టేసిన తమ నాయకులు.. టీడీపీ అభ్యర్థులపై విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులూ ఉరిమే ఉత్సాహంతో ఉన్నాయి. జిల్లా పరిధిలోకి  వచ్చే మూడు పార్లమెంటు స్థానాలైన శ్రీకాకుళం, విజయనగరం, అరుకులో యువ నాయకులైన దువ్వాడ శ్రీనివాస్, బెల్లాన చంద్రశేఖర్, గొట్టేటి మాధవిలను వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ బరిలోకి దించారు. టెక్కలి ప్రాంతానికి చెందిన దువ్వాడ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేశారు. కాకరాపల్లి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమం చేసిన దువ్వాడ కొద్ది రోజుల పాటు జైలులోనూ ఉన్నారు. జిల్లాలో సుపరిచితుడైన ఆయనను గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలోకి జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు వస్తాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీకి దిగనున్న బెల్లాన చంద్రశేఖర్‌కు సౌమ్యుడిగా పేరు. ఆయనకు ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గ ప్రజలతో కుటుంబ, స్నేహ సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. అరుకు పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం వస్తుంది. అరుకు నుంచి దివంగత వామపక్ష నాయకుడు గొట్టేటి దేముడు కుమార్తె మాధవి పోటీ చేయనున్నారు. ఎంతో నిజాయితీపరుడిగా దేముడుకు పేరు. గిరిజనుల్లో వైఎస్సార్‌ సీపీకి ఉండే పట్టుతోపాటు తండ్రి పేరు ప్రఖ్యాతులు కూడా మాధవి విజయానికి దోహదం చేయనున్నాయి. 

సీనియర్‌ నాయకులకు గౌరవం...
సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావును శ్రీకాకుళం శాసనసభ స్థానం నుంచి, తమ్మినేని సీతారాంను ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ బరిలోకి దింపింది. అలాగే మరో సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ నరసన్నపేట నుంచి పోటీ చేయనున్నారు. తొలిసారి నేదురుమల్లి జనార్దనరెడ్డి, తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ధర్మాన ప్రసాదరావు 2004 సంవత్సరంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లోనూ మంత్రిగా ఉన్నారు. వైఎస్సార్‌ ఇచ్చిన చొరవతో జిల్లాకు జీవధార వంటి వంశధార రెండో దశ ప్రాజెక్టు రూపకల్పనకు కృషి చేశారు. అలాగే వైఎస్సార్‌ను ఒప్పించి శ్రీకాకుళంలో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (రిమ్స్‌), ఎచ్చెర్లలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ ఏర్పాటులోనూ తనవంతు భూమిక పోషించారు. శ్రీకాకుళం నగరానికి అదనంగా రెండు భారీ వంతెనలు, జిల్లా అంతటా తారురోడ్డులు మంజూరుచేసి సిక్కోలును ప్రగతిబాట పట్టించడానికి కృషి చేశారు.

తమ్మినేని సీతారాం కూడా 2004 వరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్‌టీ రామారావు, చంద్రబాబు క్యాబినెట్‌ల్లో మంత్రిగా పనిచేశారు. ఆమదాలవలస అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ఆర్టీసీ బస్టాండ్, 30 పడకల సామాజిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇక నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్న ధర్మాన కృష్ణదాస్‌ నరసన్నపేట నియోజకవర్గం నుంచి మరోసారి పోటీచేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలాకి మండలంలోని వనిత మండలం వద్ద నిర్మించిన తాగునీటి ప్రాజెక్టుతో 30 గ్రామాల దాహార్తి తీరుతోంది. నరసన్నపేట మండలంలోని లుకలాం గ్రామం వద్ద నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు 35 గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతోంది. అలాగే సాగునీటి కోసం జలుమూరు, లింగాలవలస వద్ద ఎత్తిపోతల పథకాలను సాధించారు.

మరో సీనియర్‌ నాయకుడు కంబాల జోగులు మరోసారి రాజాం (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి మద్దతుగా నిలిచేందుకు జోగులు ముందు ఉంటున్నారు. టీడీపీ నాయకుల అక్రమాలను వెలుగులోకి తెచ్చి బాధ్యులపై చర్యల కోసం ఉద్యమాలు చేసిన అనుభవం ఉంది. జిల్లాలో సంచలనం కలిగించిన రూ.80 కోట్ల ఇండీట్రేడ్‌ కుంభకోణంలో బాధితులకు న్యాయం చేయాలని సంతకవిటి పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. 


యువ నాయకులకు అగ్రతాంబూలం...
ఇచ్ఛాపురం నుంచి యువ నాయకుడు పిరియా సాయిరాజ్‌ పోటీకి దిగుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన ఆయన 2014 ఎన్నికలలో పోటీ చేయలేదు. ఈసారి బరిలోకి దిగుతున్నారు. వృత్తి వ్యాపారమే అయినప్పటికీ తానున్న ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు సేవలందించేందుకు ఉద్దానం పౌండేషన్‌ను ప్రారంభించారు. తన భార్య పిరియా విజయతో కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా కిడ్నీ రోగులకు మందులు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గత ఏడాది ప్రారంభించిన రెండు అంబులెన్స్‌లు ఉద్దానం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నెలవారీ వచ్చే వేతన భత్యాలను కిడ్నీ రోగులకు నెలకు రూ.2 వేల చొప్పున సహాయంగా అందిస్తూ వస్తున్నారు.

ఈ ప్రాంతంలో టెలిమెడిసిన్‌ సేవలను కూడా నిర్వహిస్తున్నారు. మరో యువ వైద్యుడిగా పేరుపొందిన డాక్టరు సీదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయనిది నిరుపేద మత్స్యకార కుటుంబమే అయినా కష్టపడి ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చదివారు. తొలుత విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో కార్డియాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఉద్దనం ప్రాంతంలో ఏటా పెరుగుతున్న రోగులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పలాసలో ‘సేఫ్‌ ఆసుపత్రి’ని ప్రారంభించారు. విశాఖపట్నంలో కేజీహెచ్‌కు లేదంటే ప్రైవేట్‌ ఆసుపత్రులకు తీసుకెళ్తే కానీ ప్రాణం నిలబడదని స్థానిక వైద్యులు నిర్ధారించిన అనేక కేసులు చివరి నిమిషంలో ఈ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు రక్షించి పంపిన దాఖలాలు అనేకం ఉన్నాయి. మరో యువనాయకుడు పేరాడ తిలక్‌ టెక్కలి నియోజకవర్గంలో తలపడుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరంగా పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలో తిలక్‌ ముందుంటూ వచ్చారు.

స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేశారు. టీడీపీ పాలనలో మూతపడిన రావివలసలోని మెట్కోర్‌ ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమను తిరిగి తెరిపించాలంటూ ఉద్యమబాట పట్టిన కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గొర్లె కిరణ్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. జిల్లాలో వర్షాభావ ప్రాంతమైన ఎచ్చెర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించడానికి ఉద్దేశించిన నారాయణపురం ప్రాజెక్టు ఆధునికీకరణ డిమాండ్‌తో ఆయన గత ఏడాది జనవరిలో పాదయాత్ర నిర్వహించారు.  

శాసనసభ స్థానాల్లో అభ్యర్థులు వీరే...
శ్రీకాకుళం                ధర్మాన ప్రసాదరావు
ఆమదాలవలస         తమ్మినేని సీతారాం
నరసన్నపేట             ధర్మాన కృష్ణదాస్‌
టెక్కలి                     పేరాడ తిలక్‌
పలాస                     డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
ఇచ్ఛాపురం              పిరియా సాయిరాజ్‌
పాతపట్నం              రెడ్డి శాంతి
పాలకొండ (ఎస్టీ)        విశ్వాసరాయి కళావతి
రాజాం (ఎస్సీ)           కంబాల జోగులు
ఎచ్చెర్ల                    గొర్లె కిరణ్‌కుమార్‌

పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో...

శ్రీకాకుళం              దువ్వాడ శ్రీనివాస్‌
విజయనగరం         బెల్లాన చంద్రశేఖర్‌
అరకు (ఎస్టీ)           గొడ్డేటి మాధవి

Videos

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)