amp pages | Sakshi

రాదారి రక్తసిక్తం

Published on Wed, 05/30/2018 - 01:22

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/మానకొండూర్‌: రాష్ట్రంలో రహదారి మరోసారి రక్తమోడింది.. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వద్ద 13 మందిని బలిగొన్న ఘటనను మరువకముందే.. మరో ఏడుగురిని కబళించింది. కరీంనగర్‌–వరంగల్‌ ప్రధాన రహదారిపై మానకొండూరు మండలం చెంజర్ల వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళుతున్న ఓ లారీ ముందు వెళుతున్న మరో లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. 

అదే వేగంతో ముందుకెళుతూ బస్సు కుడివైపు భాగాన్ని చీల్చేసింది. దీంతో బస్సులో కుడివైపు సీట్లలో కూర్చున్నవారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చికిత్స పొందుతూ ఒకరు మరణించగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

చీలిపోయిన బస్సు..
కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం 7.30 గంటలకు వరంగల్‌ నుంచి 51 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయలుదేరింది. 9.25 గంటల సమయంలో మానకొండూర్‌ మండలం చెంజర్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోకి చేరుకుంది. అదే సమయంలో కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు కోళ్లదాణాతో వెళుతున్న ఒక లారీ.. తన ముందు ప్రయాణిస్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అదే వేగంతో బస్సు కుడివైపు భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లి బస్సు వెనకాల వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టింది. 

ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు కుడివైపు సీట్ల భాగం చీలిపోయి.. ఆ వైపు కూర్చున్న ప్రయాణికులకు కాళ్లు, చేతులు తెగిపోయాయి. బస్సు మొత్తం రక్తంతో నిండిపోయింది. ప్రయాణికులంతా బస్సులో, రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయారు. అందులో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కాజీపేటలో దక్షిణ మధ్య రైల్వే ఐవోడబ్ల్యూగా పనిచేస్తున్న రాజేశ్వర్‌ పటేల్‌ (45) చికిత్స పొందుతూ మృతి చెందారు. 

ఘటనా స్థలంలో మృతి చెందినవారిని కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన పిల్లి లక్ష్మి (60), జమ్మికుంటకు చెందిన గుండా హరిప్రసాద్‌ (35), సైదాపూర్‌కు చెందిన చేరాల ప్రభాకర్‌ (56), హన్మకొండలోని గోపాల్‌పూర్‌ కాలనీకి చెందిన రాయబారపు సుభాషిణి (41), గీసుకొండ ఎల్కుర్తి హవేలికి చెందిన ఐలోని నాగరాజు (28), హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఎండీ.జాకీర్‌ హుస్సేన్‌ (40)లుగా గుర్తించారు. ఇక క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రితోపాటు మూడు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో లారీ డ్రైవర్‌ అజయ్‌శర్మ (51) (మధ్యప్రదేశ్‌)తో పాటు ఉమర్, అనిల్‌యాదవ్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

పరామర్శించిన మంత్రులు
చెంజర్ల రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే మంత్రి ఈటల రాజేందర్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తీరును పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. అపోలోరీచ్, మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యేవరకు అక్కడే ఉండి.. అంబులెన్స్‌లలో స్వస్థలాలకు పంపించారు. మరోవైపు మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ కూడా క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తామని క్షతగాత్రులకు మంత్రులు ఈటల, మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు.

రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రులు
ప్రమాద మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రులు దద్దరిల్లాయి. ముఖ్యంగా కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రి వద్ద అత్యంత విషాదకర పరిస్థితి కనిపించింది. తమ వారి కోసం బంధువులు, కుటుంబ సభ్యులు ఆవేదనతో రోదించడం కంటతడి పెట్టించింది. ప్రమాదంలో మరణించిన ఆరుగురి దేహాలకు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి.. మంగళవారం రాత్రి బంధువులకు అప్పగించారు. 

సీఎం దిగ్భ్రాంతి..
చెంజర్ల ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

కన్నీరు పెట్టిన ఈటల..
చెంజర్ల ప్రమాద క్షతగాత్రుల పరిస్థితిని చూసి మంత్రి ఈటల రాజేందర్‌ కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సులో హన్మకొండకు చెందిన రాయబారపు జయప్రకాశ్, ఆయన భార్య సుభాషిణి ప్రయాణించారు. వారిలో సుభాషిణి మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ జయప్రకాశ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఈటల పరామర్శించినప్పుడు జయప్రకాశ్‌ రోదిస్తూ.. ‘‘నేను కిటికీ పక్కన కూర్చుంట.. నువ్వు అటు పక్క కూర్చో అని మరీ నా భార్య కిటికీ పక్కన కూర్చుంది. లారీ ఆమె ఉన్న దగ్గరే బస్సును ఢీకొట్టింది. నా భార్య నా చేతిలోనే పడిపోయింది. ఆమెకు ఎలా ఉంది..’’అని అడిగారు. ఇది చూసి మంత్రి ఈటల చలించిపోయి కన్నీరు పెట్టారు. జయప్రకాశ్‌ను ఓదార్చారు.

సుభాషిణి నేత్ర దానం
ప్రమాదంలో మరణించిన సుభాషిణి నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆమె భర్త జయప్రకాశ్‌ అంగీకారం మేరకు నేత్రదానం చేసినట్టు బంధువులు తెలిపారు.

వేగంగా వచ్చి ఢీకొట్టేసింది..
‘‘పొద్దున 7.30కు వరంగల్‌లో బయలుదేరినం. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సమయంలో బస్సులో 51 మంది ఉన్నారు. చెంజర్ల దాటుతుండగా ఓ లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన లారీ మా బస్సును ఢీకొట్టింది. కన్నుమూసి తెరిచేలోపు అంతా అయిపోయింది..’’
  – గోగు యుగంధర్‌రెడ్డి, బస్సు డ్రైవర్, హుజూరాబాద్‌

అతివేగమే కొంపముంచింది
‘‘మా బస్సు డ్రైవర్‌ సరైన మార్గంలోనే వెళ్తున్నాడు. కానీ ఎదురుగా వచ్చిన లారీ చాలా వేగంగా ఢీకొట్టింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. బస్సు రక్తసిక్తమైంది. గాయపడినవారితో ఆర్తనాదాలతో భయానకంగా మారింది..’’
     – ఎం.డి.రఫీక్, బస్సు కండక్టర్, జమ్మికుంట (29ఎంఎన్‌కే102)

మేల్కొని చూస్తే.. ఒళ్లంతా గాయాలే..
‘‘వరంగల్‌లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి వెళ్లాను. ఉదయమే ఫిజికల్‌ టెస్ట్‌లు ముగియడంతో.. కరీంనగర్‌ వెళ్లే బస్సు ఎక్కాను. బస్సు బయల్దేరిన కాసేపటికే నిద్రపోయాను. ఒక్కసారిగా శబ్దం, కుదుపు. మేల్కొని చూసే సరికి నా ఒళ్లంతా గాయాలే. తల నుంచి రక్తం కారుతోంది. ఏం జరిగిందో అర్థం కాలేదు..’’
   – మందె అశోక్, ఆదిలాబాద్‌ (29ఎంఎన్‌కే101)

కళ్లముందే చనిపోయారు..
‘‘ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో ఫిజికల్‌ టెస్ట్‌కు హాజరై.. తిరిగి సొంతూరికి బయల్దేరిన. కానీ మధ్యలోనే ప్రమాదం జరిగింది. నేనున్న బస్సును లారీ ఢీకొట్టుకుంటూ పోవడంతో.. బస్సు రేకులు మొత్తం ఊడిపోయాయి. కిటికీల పక్కన కూర్చున్నవారు నా కళ్ల ముందే చనిపోయారు. పక్కన ఉన్నవాళ్లకు బాగా దెబ్బలు తగిలాయి..’’
   – దుర్గం ప్రశాంత్, గుడిహత్నూర్, ఆదిలాబాద్‌ జిల్లా (29ఎంఎన్‌కే103)
 
పొద్దున 7.30కు వరంగల్‌లో బయలుదేరినం. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సమయంలో బస్సులో 51 మంది ఉన్నారు. చెంజర్ల దాటుతుండగా ఓ లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన లారీ మా బస్సును ఢీకొట్టింది. కన్నుమూసి తెరిచేలోపు అంతా అయిపోయింది..
     – గోగు యుగంధర్‌రెడ్డి, బస్సు డ్రైవర్, హుజూరాబాద్‌ 


 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)