amp pages | Sakshi

కాల్‌మనీ కలర్ ఎల్లో!

Published on Mon, 12/14/2015 - 01:59

అడ్డగోలు వడ్డీ దందాలో భారీగా పెట్టుడులు పెట్టిన టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు
 
♦ మనీ-సెక్స్ గ్యాంగ్‌కు అండదండలు
♦ రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్
♦ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రసాద్..
♦ ఆయన వెంట కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్!
♦ అధికార పార్టీ నేతలపై కఠిన చర్యలకు
♦  వైఎస్సార్‌సీపీ, వామపక్షాల డిమాండ్
♦ నిందితులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో ఒత్తిళ్లు
 
 సాక్షి ప్రతినిధి విజయవాడ/ విజయవాడ సిటీ: కాల్‌మనీ వ్యాపారం ముసుగులో తమ్ముళ్లు నిర్వహిస్తున్న ‘మనీ-సెక్స్’ రాకెట్ వెనుక ‘ఎల్లో’ గ్యాంగ్ వ్యవహారాలు విస్మయపరుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతల అండదండలు కాల్‌మనీ ముఠాకు పుష్కలంగా ఉన్నాయనే విషయం ఒకపక్క స్పష్టమవుతుండగా.. మరోవైపు ఇందుకు భారీ పెట్టుబడులు కూడా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలే సమకూర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఉయ్యూరుకు చెందిన మరో టీడీపీ నేత కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్సీలు, ఓ ఎమ్మెల్యే, నగర, జిల్లా తెలుగు తమ్ముళ్లు కాల్‌మనీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు టాస్క్‌ఫోర్స్  నిర్ధారణకు వచ్చింది.  ఇటీవల ఎమ్మెల్సీ అయిన ఓ టీడీపీ నేత కూడా ఈ వ్యాపారంతోనే పైకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులోని చీకటి కోణాలు యలమంచిలి శ్రీరామమూర్తి (ఏ-1) ముఠా పట్టుబడడంతో వెలుగు చూశాయి. దివంగత టీడీపీ నేత చలసాని వెంకటేశ్వరరావు (పండు) అనుచరులుగా ఉన్నవారే ఈ రాకెట్‌లో ప్రధాన నిందితులుగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. బోడె ప్రసాద్ ఎమ్మెల్యే కాకముందు పండు అనుచరుడే. పటమట పంటకాల్వ రోడ్డులోని రాము కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, వేలది ప్రామిసరీ నోట్లతో.. నేతల పెట్టుబడులపై తమకు అందిన సమాచారాన్ని పోలీసులు సరిపోల్చుకుంటున్నారు.  మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన వారిపై, సహకరించిన అధికార పార్టీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి.

 టీడీపీ హయాంలో శ్రుతిమించిన ఆగడాలు
 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్‌మనీ ముఠా ఆగడాలు శ్రుతిమించిపోయాయి. ప్రధాన నిందితుడు (ఏ-1) రాము.. కృష్ణా జిల్లా తెలుగురైతు నేత చలసాని ఆంజనేయులుకు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మరో నేతకు సమీప బంధువని విశ్వసనీయవర్గాల సమాచారం. ఏ-2 అయిన భవానీ శంకర్‌కు నేతలందరితోనూ సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఏ-3 చెన్నుపాటి శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సహా అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఏ-4, ఎలక్ట్రికల్ డీఈ ఎం.సత్యానందం ప్రభుత్వ పెద్దలతోనే నేరుగా సంబంధాలు నెరిపేవారని తెలుస్తోంది.

ఈయన గత ఎన్నికల్లో నందిగామ సీటు కోసం యత్నించారు. ఇక ఏ-5 వెనిగళ్ల శ్రీకాంత్‌కు పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సన్నిహితుడు. వీరిద్దరూ ప్రస్తుతం బ్యాంకాక్ పర్యటనలో ఉండటం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీకాంత్ మరో దేశానికి ఉడాయించినట్లు సమాచారం. కాల్‌మనీ ముఠాతో కలసి ఆయన కొన్ని సెటిల్‌మెంట్లు సైతం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఏ-6 పెండ్యాల శ్రీకాంత్, ఏ-7 దూడల రాజేష్‌లు ముఖ్యంగా ప్రధాన నిందితుల వెంట ఉండి కార్యకలాపాలు చక్కబెడతారని తెలుస్తోంది. నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన మహిళ నేతల్లో కొందరి పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం.

అయితే పోలీసులు వీరిపై ఎటువంటి కేసులు పెట్టలేదు. మహిళలను బెదిరించి లొంగదీసుకోవడం, వాట్సాప్ ద్వారా బెదిరిం పులకు పాల్పడటం, అశ్లీల మెసేజ్‌లు పంప డం, యుక్త వయస్సు యువతులను తాము చెప్పిన వారి వద్దకు పంపాలంటూ హుకుం జారీ చేయడం, మాట వినకపోతే నిర్బంధించి కొట్టడం వంటి కాల్‌మనీ ముఠా అరాచకాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. మోహన్ అనే కాల్‌మనీ బ్రోకర్ ఓ బాధితురాలిని ఫోన్‌లో బెదిరించడానికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.

 ఫిర్యాదుల వెల్లువ
 ఆదివారం పటమట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు పోలీసుల వద్దకు వచ్చి రాము ముఠా తన స్థలం కబ్జా చేసినట్లు ఫిర్యాదు చేసింది. తీసుకున్న అప్పుకు పదింతలు వడ్డీ కింద జమ చేసినప్పటికీ ఇంకా ఇవ్వాలంటూ తన విలువైన భూమిని గుంజుకున్నారని పేర్కొంటూ వారు వ్యవహరించే తీరుకు సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందజేసినట్లు చెబుతున్నారు. ఇంకా అనేకమంది మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పోలీసులకు ఫోన్ల ద్వారా కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక మంత్రి, నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి కలసి నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

 నిందితుల కోసం వేట: కాల్‌మనీ ముఠాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుల్లో ఇద్దరి అరెస్టును ఆదివారం చూపారు. పరారీలో ఉన్న మి గతా నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. నిందితుల్లో విద్యుత్ శాఖ డీఈ సత్యానందం, చెన్నుపాటి శ్రీనివాసరావు ఒడిశా పరారయ్యారు. మిగిలిన నింది తులు గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్ సహకారంతో రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

 అదుపులో బౌన్సర్: పరారీలో ఉన్న బౌన్సర్లలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాము కార్యాలయం వద్ద నెలకు రూ.లక్ష వేతనంపై ఐదుగురు బౌన్సర్లు పనిచేస్తున్నారు. ముఠాను అదుపులోకి తీసుకున్న రోజునుంచి వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిలో శంకర్ అనే బౌన్సర్ బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
 కాల్‌మనీ అంటే..

 ► అవసరార్థులకు అప్పులు ఇస్తాం అంటూ ఊబిలోకి లాగే ప్రక్రియ ఇది.
 ► కాల్‌మనీగా అప్పు తీసుకున్న వారు రూ.లక్షకు చెల్లించాల్సిన వడ్డీ రోజుకు రూ.2 వేలు.
 ► అసలు ఆలస్యమైనా ఫర్వాలేదు కాని వడ్డీ ఏ రోజుకారోజు చెల్లించాలి.
 ► ఉదాహరణకు రూ.10 లక్షలు తీసుకుంటే సాయంత్రానికి రూ. 20 వేలు వడ్డీ కింద కట్టాలి. అంటే నెలకు రూ.10 లక్షలకు వడ్డీ కింద కట్టేది రూ. 6 లక్షలు.
 ► కాల్‌మనీ కావాలంటే తీసుకునే వ్యక్తి పేరిట ఉన్న ఆస్తులను అప్పు ఇస్తున్న వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి.
 ► ఇదే సమయంలో 10 చొప్పున సంతకాలు పెట్టిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకుంటారు.
 ► నిర్దేశిత రోజుల్లోగా నగదు వెనక్కి తిరిగి ఇవ్వకపోయినా, వ్యాపారం దివాళా తీస్తున్నట్టు అనుమానం వచ్చినా ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. పైగా మరికొంత నగదు ఇవ్వకుంటే తమ వద్దనున్న చెక్కులు, నోట్లతో కోర్టుల్లో కేసులు వేస్తామంటూ బెదిరిస్తారు. ఇదే క్రమంలో మహిళలపై లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నారు.
 
 రెండు నెలల కిందటే సీఎంకి చెప్పాం: శ్రీనివాస్
 కాల్‌మనీ వ్యాపారి ఆగడంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే చెప్పినా న్యాయం జరగలేదని అజిత్‌సింగ్‌నగర్‌కి చెందిన అన్సారి శ్రీనివాస్, చిన్నారి దంపతులు ఆరోపించారు. తాముంటున్న ప్రాంతంలో కాల్‌మనీ వ్యాపారి దుర్గేసి రమేష్ ఆగడాలపై కన్నీటి పర్యంతంగా వివరించారు. తాము కుటుంబ అవసరాల కోసం అతని వద్ద రూ.1.50 లక్షల నగదు అప్పుగా తీసున్నామని, వడ్డీ కింద రూ.9 లక్షలు చెల్లించామని చెప్పారు. అయినప్పటికీ వేధించడంతో రెండు నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి గోడు వెల్లబోసుకోగా, ఫిర్యాదును డీసీపీ కాళిదాస్‌కు అప్పగించినట్టు తెలిపారు. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారే తప్ప తమకు న్యాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికీ తమ ఇంటికి కాగితాలు అతని వద్దనే పెట్టుకోగా కనీసం స్థలంలోకి కూడా రానివ్వడం లేదని పేర్కొన్నారు. వారి ఫిర్యాదుమేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డుచేశారు.
 
 బాధితుల రహస్య విచారణ
 అప్పులు తీసుకున్న మహిళలను లోబరుచుకొని సెక్స్ రాకెట్ నిర్వహించిన బెజవాడ తెలుగు తమ్ముళ్ల  కార్యకలాపాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ముఠా సభ్యుల అరాచకాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సహకరించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు పోలీసు విచారణపై ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో.. బాధితుల రహస్య విచారణకు పోలీస్ కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది. అయితే తమపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని కమిషనర్ ఆదివారం అన్నారు. బాధితుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు వారిని రహస్య ప్రాంతాలకు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.
 
 పరారీలో ‘తెలుగు రైతు’ నేత!
కాల్‌మనీ పేరిట మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ముఠాతో సంబంధమున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు నగరం విడిచి పరాైరె నట్లు తెలుస్తోంది. ముఠా రింగ్‌లీడర్ యలమంచిలి శ్రీరామమూర్తి (రాము)కి ఈయన సమీప బంధువని, కాల్‌మనీకి పెట్టుబడి పెడుతుంటారని టాస్క్‌ఫోర్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
 
 విద్యుత్ డీఈ సత్యానందం సస్పెన్షన్
 నిర్భయ చట్టం కింద కేసు నమోదు.. పరారీలోనే నిందితుడు

కాల్‌మనీ కేసులో నిందితుడు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎం.సత్యానందంను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై దొర ఉత్తర్వులు జారీచేశారు. కాల్‌మనీ ముఠాలో నాలుగో నిందితుడిగా ఉన్న సత్యానందంపై నగర కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే నిర్భయ చట్టం కింద, ఐపీసీ 420, 376, 354ఎ (1,2), 384 , 509, 506, రెడ్‌విత్ 34, 120 (బి) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు సంఘటన స్థలం నుంచి ఎం.సత్యానందం తప్పించుకొని వెళ్లి అజ్ఞాతంలో ఉన్నారు.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు