amp pages | Sakshi

గ్యాస్‌ బాంబు!

Published on Thu, 08/03/2017 - 02:31

ఉరుము లేకుండా పడిన పిడుగులా వంటగ్యాస్‌ సిలెండర్ల సబ్సిడీకి భవిష్యత్తులో మంగళం పాడదల్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా ధరల నియంత్రణ వ్యవస్థను ఎత్తేసినట్టే ఇకపై వంటగ్యాస్‌పై కూడా తొలగించబోతున్నట్టు తెలిపింది. వాస్తవానికి నిరుడు జూలైలోనే సబ్సిడీ సిలెండర్‌ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచమని చమురు సంస్థలను కేంద్రం ఆదే శించింది. దాన్ని ఇప్పుడు నెలకు రు. 4 చేసింది. సబ్సిడీ పూర్తిగా పోయేవరకూ లేదా వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలా పెంచుకుంటూ పోవాలని కూడా కోరింది. ఒక్కసారిగా ధర పెంచితే అందువల్ల జనంలో ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వాలకు అర్ధమై చాలా కాలమైంది.

యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ‘కాలజ్ఞానం’ మొదలైంది. 2010లో తొలిసారి పెట్రోల్‌ ధరపై నియంత్రణ ఎత్తేసింది. సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉండే డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌ల జోలికి మాత్రం వెళ్లబోమని వాగ్దానం చేసింది. 2013లో ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించి డీజిల్‌పై ‘పాక్షికం’గా నియంత్రణ ఎత్తేస్తున్నట్టు ఆనాటి కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ప్రకటించారు. ఎన్‌డీఏ సర్కారు వచ్చాక 2014లో ఆ ముచ్చట కూడా ముగిసిపోయింది. ఈసారి వంటగ్యాస్‌ వంతు వచ్చింది. ముందూ మునుపూ కిరోసిన్‌ను సైతం ధరల నియంత్రణ వ్యవస్థ నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదు.

నిరుడు మే నెలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దారిద్య్ర రేఖకు దిగువునున్న కుటుంబాలకు మహిళల పేరిట ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. ఇప్పటికే ఈ పథకంలో 2.5 కోట్ల మంది మహిళలు వంటగ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సంప్రదాయ పొయ్యిల వల్ల వాతా వరణ కాలుష్యం, మహిళల ఆరోగ్యం దెబ్బతినడం వగైరా జరుగుతున్నాయి గనుక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. నిజానికి యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి తోడ్పడిన అంశాల్లో ఉచిత వంటగ్యాస్‌ కనెక్షన్ల అంశం కూడా ప్రధానమైదని అంటారు. ఈ పథకం కింద వంటగ్యాస్‌ కనెక్షన్‌ లభించిన కుటుంబాలు సెక్యూరిటీ డిపాజిట్‌గానీ, కనెక్షన్‌కి సంబంధించిన ఇతర చార్జీలుగానీ చెల్లించనవసరం లేదు.

మొదటి సిలెండర్‌ ధరనూ, స్టౌ ధరనూ వాయిదాల్లో కట్టొచ్చునన్న నిబంధన కూడా ఉంది. కనుక ఉచిత వంటగ్యాస్‌ కనె క్షన్లు చాలా కుటుంబాలే తీసుకున్నాయి. కానీ రెండో సిలెండర్‌ నుంచి వాయిదాల పద్ధతి ఉండదు. పర్యవసానంగా కనెక్షన్‌ తీసుకున్నవారిలో చాలామంది కొత్త సిలెండర్‌ కోసం రాలేదని ఒక సర్వేలో తేలింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు సబ్సిడీ సిలెండర్‌ ధర రూ. 450 చెల్లించలేని స్థితిలో ఉన్నారని దీన్నిబట్టే అర్ధమ వుతోంది. ఇప్పుడు ఆ సబ్సిడీని కాస్తా ఎత్తేస్తే సహజంగానే ఆ ధర మరింత పెరు గుతూ పోతుంది. ఏతావాతా అలాంటి కుటుంబాలన్నీ వంటగ్యాస్‌ సౌకర్యానికి దూరం కాక తప్పదు.

ఆర్ధిక సంస్కరణలు మొదలైనప్పటినుంచీ సంక్షేమ భావన క్రమేపీ కొడిగడుతోంది. దేనికైనా ‘తగిన ధర’ చెల్లించి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే వంటగ్యాస్‌ జోలికి ప్రభుత్వాలు చాలా ఆలస్యంగా వచ్చినట్టే లెక్క. దేశంలో సబ్సిడీ సిలెండర్లు ఉపయోగించే వారి సంఖ్య 18.11 కోట్లు. సబ్సిడీయేతర సిలెండర్ల వినియోగదారులు 2.66 కోట్లున్నారు. అసలు వంటగ్యాస్‌లో సబ్సిడీ, సబ్సిడీయేతర తరగతుల్ని తీసుకొచ్చింది యూపీఏ సర్కారే. రెండింటికీ రెండు రకాల ధరలు నిర్ణయించి... పెంచినప్పుడు చెరో రకంగా పెంచుతూ జనాన్ని అయోమయంలోకి నెట్టడం అప్పుడే మొదలైంది. వంటగ్యాస్‌ కనెక్షన్లలో 89 శాతం మంది ఏడాదికి 9 సిలెండర్లు మాత్రమే వాడతారని... తాము వారి జోలికి పోకుండా అంతకుమించి వాడేవారిపై భారం పడేలా పదో సిలెండర్‌ నుంచి సబ్సిడీని తీసేస్తున్నట్టు ఆనాటి ప్రభుత్వం చెప్పింది.

దీని ప్రభావమేమిటో త్వరలోనే వారికి అర్ధమైంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్ర హావేశాలు రగిలాయి. దాంతో 2014 ఎన్నికలకు ముందు దాన్ని కాస్తా సవ రించారు. ఏడాదికి 12 సిలెండర్లను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రక టించారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మూడేళ్లక్రితం చమురు, గ్యాస్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. నిరుడు ఇందులో స్వల్ప పెరుగుదల కనిపించినా అది 2014కి ముందున్న ధరలతో పోలిస్తే చాలా తక్కువే. నిజానికి దీన్ని ఆసరా చేసుకునే ప్రస్తుతం వంటగ్యాస్‌కిచ్చే సబ్సిడీని భవిష్యత్తులో ఎత్తేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఉదాహరణకు సబ్సిడీయేతర సిలెండర్‌ ధర ప్రస్తుతం రూ. 737. 2013లో దాని ధర రూ. 1,250.  మళ్లీ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పుంజుకుంటే ఇది తారుమారు కావొచ్చు. ఆ పరిస్థితే తలెత్తితే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.  

 పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెను ప్రభావం చూపే వంటగ్యాస్‌ సబ్సిడీ జోలికి వెళ్లడం ధర్మం కాదు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయని సంబరపడి ధరల నియంత్రణ వ్యవస్థ నుంచి వంటగ్యాస్‌ను తొలగిస్తే రేపన్న రోజున పరిస్థితులు వేరే రకంగా ఉండొచ్చు. నిజానికి చమురు సంస్థలపై కేంద్రం విధిస్తున్న అమ్మకం పన్ను, దిగుమతి సుంకం... ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌ వగైరాలు లేనట్టయితే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలు ఈ స్థాయిలో ఉండవు. వీటి ధరలు పెంచాల్సి వచ్చినప్పుడల్లా ప్రభుత్వం తామిస్తున్న సబ్సిడీల గురించి మాట్లాడుతుంది తప్ప ఈ పన్నుల ఊసెత్తదు. మన దేశంలో వంటిల్లు భారం మోస్తున్నది మహిళలే. వంటగ్యాస్‌ సబ్సిడీ తీసేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలకు అది పెను భారమవుతుంది. పర్యవసానంగా ఆ కుటుంబాలు తిరిగి పాత పద్ధతుల్లో పొయ్యి రాజేసుకుంటాయి. అందువల్ల ప్రధానంగా దెబ్బతి నేది మహిళల ఆరోగ్యమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)