amp pages | Sakshi

‘అంధ’లమెక్కాడు...

Published on Fri, 01/24/2014 - 23:36

దుర్భర దారిద్య్రం... తల్లీతండ్రి కూలికి వెళితేనే గానీ పూట గడవని పరిస్థితి...
 ఇంట్లో అన్నయ్య గుడ్డివాడు... వీటన్నింటికీ మించి తానూ అంధుడే...
 ధైర్యంగా నాలుగు మాటలు చెప్పి, సాయం చేసేవారూ లేరు...
 ఇలాంటి పరిస్థితుల్లో ఓ పిల్లాడు ఏమవుతాడు..?
 ఎలాగోలా జీవితం గడిస్తే చాలనుకుంటాడు. కానీ పారపాటి రమేశ్ మాత్రం అలా కాదు.
 విధితో పోరాడాడు. అంధత్వాన్ని అధిగమించాడు.
 వెయిట్ లిఫ్టింగ్ లాంటి ‘బరువైన’ క్రీడను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
 దొరికిన చిన్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
 ఫలితం... రాష్ట్రంలో వెయిట్ లిఫ్టింగ్‌లో సబ్‌జూనియర్ కేటగిరీలో
 అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎదిగాడు.

 
 అవరోధాలను అధిగమించి...

శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన రమేశ్ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మరో సోదరుడు కూడా అతనిలాగే అంధుడే. ఇలాంటి నేపథ్యంలో రమేశ్ ఒక ఒలింపిక్ క్రీడ వైపు ఆసక్తి చూపించడం, అందుకు తగ్గట్లుగా శ్రమించేందుకు సిద్ధపడటం అతని పట్టుదలను సూచిస్తోంది. విజయనగరం అంధుల పాఠశాలలో ఉండగా అతనికి ఈ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే పూర్తిగా కళ్లు కనిపించని అతను ఇలాంటి భారీ క్రీడను ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అది కేవలం సరదాకే పరిమితమవుతుందని అందరూ భావించారు.

కానీ అతను మాత్రం ఆటపై అభిమానం పెంచుకున్నాడు. ఆరంభంలో కాస్త బరువైన కర్రను ఎత్తడంతో అతని అభ్యాసం మొదలైంది. ఆ తర్వాత శరీరం ఎలా కదపాలో, చేతులు ఎలా ఎత్తాలో అన్నీ సాధన చేశాడు. మొదట్లో కేవలం ఐరన్ బార్‌ను ఎత్తడం ప్రారంభించిన అతను ఆ తర్వాత వాటికి వెయిట్స్ జత చేశాడు. మెల్లమెల్లగా బరువు పెంచుతూ పోయాడు. ఇదే పాఠశాలలో అనేక మంది రమేశ్‌తో పాటే నేర్చుకున్నా మధ్యలోనే మానేశారు. కానీ అతను మాత్రం మొండిగా ముందుకు సాగాడు.
 
ఆ ముగ్గురి అండతో...
 
జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నా రమేశ్ పట్టుదలగా లిఫ్టర్‌గా ఎదిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొంత మంది అతనికి అన్ని విధాలా అండగా నిలిచారు. ఇందులో మొదటి వ్యక్తి కోచ్ రవికుమార్. అంధుల పాఠశాలలో రమేశ్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో ఓనమాలు నేర్పించి తీర్చిదిద్దింది ఆయనే. ఒక అంధ విద్యార్థికి ఆట నేర్పించడం అంత సులువు కాదు. ఆటగాడిలో పట్టుదలతో పాటు కోచ్‌కు ఎంతో సహనం కూడా కావాలి. నేర్చుకునే దశలో ప్రతీ లోపాన్ని సవరిస్తూ వచ్చిన రవికుమార్, ప్రాక్టీస్‌లో కుర్రాడికి దెబ్బలు తగలకుండా దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. తన ముగ్గురు కూతుళ్లతో సమానంగా రమేశ్‌ను కూడా కుటుంబసభ్యుడిలా చూసుకున్నారాయన. అంధుడితో లిఫ్టింగ్ ప్రమాదమని చెప్పినా సొంత పూచీపై ఆయన నేర్పించారు.
 
విశాఖలో ప్రభుత్వాధికారిగా పని చేస్తున్న కోరుకొండ రమేశ్ ప్రాక్టీస్ కోసం, వివిధ టోర్నీలకు హాజరయ్యేందుకు ఆర్థిక సహాయం అందించారు. ఏపీ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య కూడా తన పరిధిలో ఎంతో సహకారం అందించారు. ఓపెన్ కేటగిరీలో పోటీల్లో తరచూ పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ఆయన అవకాశం కల్పించారు.
 
వీడని సమస్యలు...
 
ఇటీవల గౌహతిలో జాతీయ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించడంతో రమేశ్ కూడా అందరిలాగా రాణించగలడనే నమ్మకం కలిగింది. ఈ నెలలోనే విజయనగరంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల సబ్ జూనియర్ విభాగంలో రమేశ్ బెస్ట్ లిఫ్టర్‌గా నిలవడం విశేషం. అయితే ఇతర క్రీడాకారుల్లాగే అతనికి కూడా సౌకర్యాలలేమి సమస్యగా మారింది. ఇప్పటికీ అతను ఇనుప బార్‌తోనే సాధన చేస్తున్నాడు. ఎలికో బార్, పవర్ బార్, వెయిట్ డిస్క్‌లు అతనికి ఇంకా అందుబాటులో లేవు. వాటిని కొనేంత ఆర్థిక స్థోమత లేదు. ఇటీవల సాంగ్లీలో జరిగిన నేషనల్స్‌లో లిఫ్టింగ్ షూస్ లేకపోవడంతో నిర్వాహకులు అంగీకరించలేదు.

చివరి నిమిషంలో ఏదో షూస్‌తో బరిలోకి దిగినా అతని ప్రదర్శనపై అది ప్రభావం చూపించింది. రమేశ్ అంధుడే అయినా ఓపెన్ పోటీల్లో పాల్గొంటుండటం వల్ల అతనికి నిబంధనల విషయంలో ఎలాంటి సడలింపూ ఉండదు. ఇక వికలాంగుల పింఛన్ కింద నెలకు ఇచ్చే రూ. 500 ఏ మూలకూ సరిపోవు. ఒక లిఫ్టర్‌కు అవసరమయ్యే బలవర్ధకమైన ఆహారం తీసుకునేందుకు కూడా అతనికి డబ్బు సమస్యగా మారింది. అయినా పట్టుదలతో శ్రమిస్తున్న అతడికి ఎవరైనా పూర్తిస్థాయిలో చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తే అద్భుతాలు చేయగలడనడంలో సందేహం లేదు.
 
- బి.ఎస్. రామచంద్రరావు (సాక్షి, విశాఖపట్నం ప్రతినిధి)
 
 ఎలా ఆడతాడంటే..

 సాధారణంగా కళ్లు కనిపించని వ్యక్తి నడవడమే కష్టం. అలాంటిది వేదిక మీదకు వెళ్లి బార్‌ను కచ్చితంగా పట్టుకుని బరువు లేపడం అసాధారణ విషయం. అందులోనూ తప్పుగా బార్ పట్టుకుంటే ఫౌల్ అవుతుంది. కాబట్టి కోచ్ రవి ఓ కొత్త ఆలోచన చేశారు. ‘నువ్వు వేదిక మీదకు వెళ్లి బార్ పట్టుకో. కరెక్ట్‌గా పట్టుకుని బరువు ఎత్తితే అందరూ చప్పట్లు కొడతారు. సమస్య లేదు. అలా కాకుండా వెళ్లి బార్‌ను తప్పుగా పట్టుకుంటే నేను చప్పట్లు కొడతాను. సరిచేసుకో’ అని రవి సూచించారు. ప్రస్తుతం రమేశ్ ఇదే ఆచరణలో పెడుతున్నాడు. బరువు ఎత్తకముందే చప్పట్లు వినిపించాయంటే తాను తప్పు చేస్తున్నట్లు అర్థం.
 
 ‘విజయనగరం స్కూల్‌లో శరీరం తీవ్రంగా నొప్పి పెట్టినా, మణికట్టు దగ్గర బాధగా అనిపించినా నేను ఆట వదల్లేదు.
 ఎన్ని కష్టాలు వచ్చినా వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకున్నా.
 నాతో పాటు మా కోచ్ కూడా చాలా కష్టపడుతున్నారు. అందుకే
 ఇంకా పెద్ద పోటీల్లో గెలవాలి. మరిన్ని పతకాలు సాధించాలి.  కనీసం నేను గెలిచిన మెడల్స్ కూడా చూడలేను.
 అయినా సరే పెద్ద స్థాయికి చేరుకుంటా.  పారాలింపిక్స్‌లో అవకాశం వస్తే స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు సహకరిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు’  

- రమేశ్
 

Videos

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..

పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు

Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ

ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి

కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..

మంగళగిరిలో సీఎం జగన్ సభ

టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..

చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్

మత్స్యకారులకు గుడ్ న్యూస్

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు