amp pages | Sakshi

18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Published on Mon, 09/18/2017 - 11:23

సాక్షి,  చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం తలెత్తింది. రాజకీయ ఉత్కంఠకు తెరదించే విధంగా బల పరీక్ష విషయంలో గవర్నర్‌ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఎదురు చూపులు చూడగా చివరికి దినకరన్ వర్గానికి స్పీకర్ భారీ షాకిచ్చారు. అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. సీఎం పళని స్వామిపై తిరుగుబావుట ఎగురవేసిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ సోమవారం ప్రకటించారు. దీంతో దినకరన్ వర్గానికి ఏం చేయాలో మింగుడు పడటం లేదు.

తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్‌రావు నేడు చెన్నైకి రానున్న నేపథ్యంలో స్పీకర్ ధనపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ధనపాల్ నిర్ణయాన్ని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. తమపై అనర్హత వేటు వేయడం అన్యాయమని, దీనిపై తాము హైకోర్టుకు వెళతామని తెలిపారు. మరోవైపు గవర్నర్‌ బల పరీక్షకు ఆదేశిస్తే, ఇరాకాటంలో పడుతామన్న ఆందోళనతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమపై తిరుగుబాటు చేస్తున్న వారిపై అనర్హత వేటు పడేలా పావులు కదిపింది. మైనారిటీ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో దినకరన్ వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

డీఎంకే సభ్యులకూ అనర్హత టెన్షన్..!
దినకరన్ వర్గం ఎమ్మెల్యేలతో పాటు డీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్‌ చేయడానికి పళనిస్వామి వర్గం తగ్గ కార్యాచరణ సిద్ధం చేసి, సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు. గుట్కా వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడం, ఇప్పటికే నిషేధిత వస్తువులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని నోటీసు రద్దుకు డీఎంకే సభ్యులు హైకోర్టు తలుపు తట్టడంతో సస్పెన్షన్ వేటు నుంచి ఇటీవల తాత్కాలిక ఊరట లభించింది. ఏ సమయంలోనైనా స్పీకర్ వారిపై వేటు వేసే అవకాశాలున్నాయి.