googletag.pubads().enableSingleRequest(); //googletag.pubads().disableInitialLoad(); googletag.pubads().collapseEmptyDivs(true,true); googletag.enableServices(); }); amp pages | Sakshi

ఈ ‘మండేలా’ చెర వీడేనా!

Published on Fri, 12/27/2013 - 00:17

విశ్లేషణ:  పిళ్లా వెంకటేశ్వరరావు

 ‘పాలస్తీనీయులకు స్వేచ్ఛ లభించక పోతే మా స్వేచ్ఛ అసంపూర్ణమైనదిగానే మిగిలిపోతుందని మాకు బాగా తెలు సు’, 1997 ఐక్యరాజ్య సమితి పాలస్తీనా సంఘీభావ దినం నాటి నెల్సన్ మండేలా మాటలు సుపరిచితమైనవే. కాకపోతే ఆయన మరణించిన వెంటనే జెరూసలెంలోని అమెరికన్ కాన్సులేట్ ‘ఫేస్‌బుక్’ పేజీపై అవి ప్రత్యక్షం కావడం మాత్రం రెండు విధాలుగా అసందర్భం. ‘చెప్పనలవిగాని దురాగతాలకు పాల్పడిన దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అమెరికాయే’ అన్న (2003) మండేలాను అమెరికా 2008 వరకు ఉగ్రవాద జాబితాలోనే ఉంచి తగిన శాస్తి చేసింది. మరణించాక పొగడ్తలు తప్పవుగానీ... మధ్యప్రాచ్యంలో అమెరికా బహిఃప్రాణమైన ఇజ్రాయెల్ రాజధాని నుంచి పాలస్తీనా స్వేచ్ఛ గురించి మాట్లాడటం ఏమిటి? పైగా మండేలా దృష్టిలో ఇజ్రాయెల్ ‘ఆక్రమిత ప్రాంతాల్లోని నిస్సహాయులైన అరబ్బులను ఊచకోత కోస్తున్న ఉగ్రవాద రాజ్యం!’  సదరు ఫేస్ బుక్ పేజీ పాలస్తీనీయుల ఆధీనంలోని గాజా, వెస్ట్‌బ్యాంక్ వ్యవహారాలను చూసే విభాగానికి మాత్రమే సంబంధించినది. మండేలా మాటలను అమెరికా వల్లె వేసినది కూడా పాలస్తీనీయులు విని తరించాలనే తప్ప ‘ఉగ్రవాద రాజ్యానికి’ తీరు మార్చుకోమని హితవు పలకడానికి కాదనేది స్పష్టమే. కాబట్టే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విమానం ఖర్చులు దండగని మండేలా అంత్యక్రియలకు వెళ్లలేదు. తద్వారా ‘ఆయన పాలస్తీనా ప్రేమికుడు మండేలాకు తన దృష్టిలో ఉన్న స్థానం ఏ పాటిదో  చెప్పకనే చెప్పారు’ అని సుప్రసిద్ధ ఇజ్రాయెల్ దినపత్రిక ‘హార్తెజ్’ వ్యాఖ్యానించింది! మండేలాను నిన్నటి వరకు ఉగ్రవాదిగా పరిగణించిన  ప్రపంచ పెద్దలంతా పోటీలు పడి మొసలి కన్నీళ్లు కార్చారే తప్ప మండేలా మరణానంతరమైనా ఆయన కల ‘సంపూర్ణ స్వేచ్ఛ’ను నిజం చేసే ఊసు ఎత్తడం లేదు. ‘పాలస్తీనా మండేలా’ ఇజ్రాయెల్ బందీగానే ఉన్నాడు.       

 ‘మండేలాను విడుదల చెయ్యండి!’

 మండేలా 27 ఏళ్ల జైలు జీవితంలో 18 ఏళ్లు  రాబిన్ దీవిలో గడిపారు. 1963 అక్టోబర్ 27న అహ్మద్ మొహ్మద్ కత్రదా అనే ఆప్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకర్త ‘మండేలాను విడుదల చెయ్యండి!’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ తదుపరి ఆయన కూడా అరెస్టయి అదే దీవిలో 18 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఈ ఏడాది సరిగ్గా అదే రోజున 84 ఏళ్ల వృద్ధునిగా కత్రదా భార్యా సమేతుడై తిరిగి రాబిన్ దీవికి వెళ్లి ‘పాలస్తీనా మండేలాను విడుదల చెయ్యండి!’ అనే అంతర్జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించాడు. పలువురు మండేలా సహచరులతో పాటూ ఐదుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు సైతం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 2002 నుంచి జైల్లో మగ్గుతున్న మర్వాన్ బార్గౌతి విడుదల కావాలంటే ఈ జన్మకాక మరి నాలుగు జన్మలెత్తాలి. ఆయన ఐదు జీవిత కాల కారాగారవాస శిక్షలను ఒకదాని తర్వత మరొకటి అనుభవించాల్సి ఉంది! మండేలాలాగే మర్వాన్ కూడా ‘ఉగ్రవాది’. మొట్టమొదటి పాలస్తీనా పార్లమెంటు సభ్యుడు. విడుదలైతే భౌగోళికంగా, రాజకీయంగా రెండు ముక్కలుగా విసిరేసినట్టున్న పాలస్తీనాకు అధ్యక్షుడవుతాడు. 1993 ఓస్లో శాంతి ఒప్పందాలు జరిగి మూడు ద శాబ్దాలు కావస్తున్నా ఇజ్రాయెల్‌లాగే పాలస్తీనా కూడా స్వతంత్ర సర్వసత్తాక దేశం ఎందుకు కాలేదని నిలదీస్తే అమెరికా ఠక్కున చెప్పే సాకు... పాలస్తీనీయులు ఫతా, హమస్‌ల మధ్య చీలిపోయి ఉన్నారనేదే. ఆ రెండు పాలస్తీనా వర్గాలను ఒక్క తాటిపైకి తేగల ఏకైక నేత మర్వాన్. అందుకే అతడు జైల్లో ఉండటం అమెరికా, ఇజ్రాయెల్‌లకు అవసరం. ‘మండేలా భక్తులకు’ మండేలా కల అసంపూర్తిగా మిగిలిపోవడమే శ్రేయస్కరం.

 ఉగ్రవాదా? విమోచనా యోధుడా?

 ఇజ్రాయెల్ ఉగ్రవాదిగా చెబుతున్న మర్వాన్ హిబ్రూ, ఇంగ్లిష్ భాషల్లో పాండిత్యం ఉన్నవాడు. జైలు నుంచి ఆయన స్మగుల్ చేసి పంపిన పాలస్తీనా విమోచన పోరాట చరిత్రకు డాక్టరేట్ పట్టా సైతం లభించింది. పదిహేనేళ్ల ప్రాయంలోనే యాసర్ అరాఫత్ నేతృత్వంలోని ‘ఫతా’లో చేరి సాయుధ పోరాట విభాగంలో కీలక పాత్రధారి అయ్యాడు. మొదటి, రెండవ పాలస్తీనా ‘ఇంతిఫాదా’లకు (తిరుగుబాట్లు) నేతృత్వం వహించాడు. మర్వాన్‌పై పలు హత్యాయత్నాలు విఫలలమయ్యాక వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా తాత్కాలిక రాజధాని రముల్లాలో మర్వాన్‌ను ఇజ్రాయెల్ సైన్యం 2002లో అరెస్టు చేసింది. ఇజ్రాయెల్ తనది కాని భూభాగంలో చేసిన ఈ అరెస్టు చెల్లదు. పైగా పార్లమెంటు సభ్యుడుగా మర్వాన్‌కు దౌత్య రక్షణ కూడా ఉంది. అయినా ఇజ్రాయెల్‌కు తోచిందే న్యాయం. ‘ఉగ్రవాది’ మర్వాన్ జైల్లోనే మగ్గుతున్నాడు. ఆయనను పాలస్తీనా మండేలాగా పిలవడమేమిటని ఇజ్రాయెల్ తప్పుబడుతోంది. కానీ మర్వాన్ అమాయక పౌరులను హతమార్చే హత్యాకాండకు వ్యతిరేకి. ‘‘రేపటి మా పొరుగువారైన ఇజ్రాయెల్ పౌరులపై దాడులను నేనూ, మా ఫతా ఉద్యమం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాం. అయితే మా ఆత్మరక్షణ హక్కును, ఇజ్రాయెల్ దురాక్రమణ ను ప్రతిఘటించడానికి మాకున్న హక్కును మాత్రం ఎన్నటికీ వదులుకునేది లేదు. 1967కు ముందటి సరిహద్దులకు ఇజ్రాయెల్ ఉపసంహరించుకునే ప్రాతిపదికపై పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు రెండు సమాన, స్వతంత్ర దేశాలుగా శాంతియుతంగా సహజీవనం సాగించాలనే నేడు కూడా కోరుకుంటున్నాను’’. ‘పాలస్తీనా విమోచనా సంస్థ కూడా మాలాగే స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడుతోంది... ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పొరాడుతున్నారు కాబట్టి ఖండించాలి అంటే కుదరదు, అది అసాధ్యం’ అని మండేలా 1990లోనే స్పష్టం చేశారు. ‘నిన్నటి వరకు నన్ను కూడా ఉగ్రవాదివనే అన్నారు’     అని మర్వాన్ లాంటి విముక్తి పోరాటాలకు మద్దతు పలికారు.

 మండేలా అన్నట్టు ఇజ్రాయెల్ కృత్రిమంగా ఏర్పడ్డ దేశం. అరబ్బు భూభాగంలో ఇజ్రాయెల్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను గాంధీజీ 1930లలోనే తీవ్రంగా నిరసించారు. అయినా బ్రిటన్, అమెరికాలు 1948లో ఐక్యరాజ్య సమితి పేరిట ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసి, పాలస్తీనాకు సగ భూభాగం మిగిల్చారు. ఆ ఐరాస సరిహద్దులను దాటి ఇజ్రాయెల్ సాగించిన దురాక్రమణలతో నేటి పాలస్తీనా 10 శాతం కంటే తక్కువగా మిగిలింది. అది కూడా వెస్ట్‌బ్యాంక్, గాజా అనే రెండు విడి విడి ముక్కలుగా ఉంది. 1993లో ‘బిగ్ ఫోర్’ (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా)మధ్యవర్తులుగా ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఓస్లో శాంతి ఒప్పందం కుదిరింది. 1948 నాటి ఐరాస సరిహద్దులను ఇజ్రాయెల్ దురాక్రమణతో చెరిపివేయడాన్ని పాలస్తీనా ఆమోదించింది, 1967 ఇజ్రాయెల్ దురాక్రమణకు ముందటి పాలస్తీనా, అరబ్బు భూభాగాలనన్నిటినీ తిరిగి అప్పగించడానికి ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఆ ఒప్పందాన్ని గౌరవించక తూర్పు జెరూసలెం, వెస్ట్‌బ్యాంక్, గాజాలలోకి యూదులను దించి అక్రమ సెటిల్మెంట్లను చేపడుతూనే ఉంది.  ఇజ్రాయెల్, పాలస్తీనాలు రెండు స్వతంత్ర దేశాలుగా అస్తిత్వంలో ఉండటాన్ని ఇజ్రాయెల్ ఆచరణలో తిరస్కరిస్తోంది.

 దెయ్యం చెబితే దారికి వస్తారా?

 నేడు వెస్ట్‌బ్యాంక్‌పై ఆధిపత్యం వహిస్తున్న ఫతా నేతగా, పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షునిగా ఉన్న మొహ్మద్ అబ్బాస్ ఇజ్రాయెల్, అమెరికాల సహాయంపైనే అధారపడి బతుకుతున్న ‘కీలుబొమ్మ’గా అప్రతిష్టపాలయ్యారు. ఇక గాజాపై ఆధిపత్యం వహిస్తున్న హమస్ ఒకప్పుడు ఫతాలో భాగంగా ఉన్నదే. ఖలీద్ మషాల్ నేతృత్వంలోని ఆ సంస్థ సాయుధ మిలిటెంటు కార్యకలాపాలు సాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో సైతం ఇటీవల బలపడుతోంది. అయితే ప్రస్తుతం ఫతాతో అంగీకారానికి వచ్చి పనిచేస్తోంది. అయితే ఫతా శాంతియుత పంథాను తిరస్కరిస్తోంది. పరస్పర విరుద్ధమైన ఈ శక్తులను ఐక్యం చేయగల శక్తి మర్వాన్‌కు ఉన్నది. పదేళ్లుగా జైల్లో ఉన్నా ఆయనకు రెండు ప్రాంతాల్లోనూ గొప్ప జనాదరణ ఉంది. పైగా హమస్ ఆయన నేతృత్వంలో పాలస్తీనా నేషనల్ అథారిటీలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందువల్లనే పాలస్తీనా సమస్య పరిష్కారంపై ఆసక్తి ఉన్నవారంతా ఆయనను విడుదల చేయాలని కోరుతున్నారు. ఇజ్రాయెల్ రాజకీయ పక్షాల్లో సైతం తరచుగా ఆయనకు క్షమాభిక్ష ప్రకటించి రాజకీయ సయోధ్య కుదుర్చుకోవాలనే చర్చ సాగుతోంది. అధ్యక్షుడు సైమన్ పెరస్ 2007 ఎన్నికల్లో గెలిస్తే మర్వాన్‌ను విడుదల చేస్తామనే వాగ్దానం చేశారు. గెలిచాక సహజంగానే అది మరిచారు. ప్రధాని నెతన్యాహూ వ్యతిరేకతే అందుకు కారణమని భావిస్తున్నారు. 2009లో ఒబామా సైతం 1967 సరిహద్దుల ప్రాతిపదికపై పాలస్తీనా సమస్య పరిష్కారం కావాలని ప్రకటించి ఆపై దాటవేశారు. మండేలా విడుదలతో దక్షిణ ఆఫ్రికా సమస్య పరిష్కారమైనట్టే మర్వాన్ విడుదలతోనే పాలస్తీనా సమస్య పరిష్కారం అవుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ‘రెండు దేశాల’ పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడదు.

 దేవుడు చెప్పినా వినని వాడు దెయ్యం చెబితే వింటాడట. అల్‌కాయిదా కారణంగానైనా మర్వాన్ విడుదల అవుతాడేమోనని ఆశించాలి. అల్‌కాయిదా అనుబంధ సంస్థ ముజాహిదిన్ షురా కౌన్సిల్ ఈ నెల 11న హెబ్రాన్‌లో తమ మిలిటెంట్లు ముగ్గురు ఇజ్రాయెల్ సైన్యం చేతిలో మరణించారని ప్రకటించింది. ఆ ప్రకటనతో పాటే అది తమ జిహాదీ ఉద్యమం వెస్ట్‌బ్యాంక్‌లో స్థిరంగా కాళ్లూనుకుందని తెలిపింది. ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ ‘షిన్ బెత్’ సైతం అది నిజమేననీ, షురా వెస్ట్‌బ్యాంక్‌లో భారీ ఎత్తున ఆయుధాలను నిల్వచేసి, స్థావరాలను ఏర్పరుచుకుందనీ, ఇజ్రాయెల్‌లో దాడులు చేయడానికి వేచి చూస్తోందని పేర్కొంది. అప్పుడెప్పుడో గాంధీ చెప్పాడు వినలేదు, నిన్న మండేలా చెప్పాడు వినలేదు. ఇప్పుడు అల్‌కాయిదా ముప్పు ముంచుకొస్తుంటేైనె నా అమెరికా, బ్రిటన్‌లు వింటాయా? స్వతంత్ర పాలస్తీనాకు ఇజ్రాయెల్‌ను అంగీకరింపజేస్తాయా? లేక పాలస్తీనా, ఇజ్రాయెల్‌లను అల్‌కాయిదా ఉగ్రవాద దాడులకు బలిచేస్తాయా?     
 

Videos

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని

రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..

రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్

వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం

సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)