amp pages | Sakshi

11/12 టెన్షన్‌.. చివరి ఎత్తులు

Published on Tue, 12/11/2018 - 00:38

సాక్షి, హైదరాబాద్‌: ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో హైదరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. హంగ్‌ రావొచ్చంటూ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అధికారం కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులతోపాటు ప్రజల్లోనూ మంగళవారం విడుదలయ్యే ఫలితాలకు ముందే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. సోమవారం మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో మూడుగంటలపాటు చర్చలు జరిపారు.

అటు విపక్ష కాంగ్రెస్‌ తన భాగస్వామ్యపక్షాల నేతలతో కలిసి గవర్నర్‌ను కలిసింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పక్షంలో కూటమి మొత్తాన్ని ఒక యూనిట్‌గా గుర్తించాలని డిమాండ్‌ చేసింది. హంగ్‌ వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ నాగర్‌ కర్నూలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డికి.. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్‌ చేశారంటూ వార్తలు రావడం రాజకీయంగా దుమారం రేపింది. వివాదాలకు దూరంగా ఉండే విశ్వేశ్వర్‌రెడ్డిపై ఆరోపణలు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలాఉంటే.. మునుపటి శాసనసభలో కంటే ఈసారి తమ బలం పెంచుకుంటామని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ.. ఈ సారి హంగ్‌ ఏర్పడితే కింగ్‌మేకర్‌ పాత్ర పోషించాలన్న ఉత్సాహంతో ఉంది. 
 
అసద్, సీఎంల కలయికపై ఆసక్తి 

ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల ముందు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. సెక్యూరిటీని పక్కకు పెట్టి ద్విచక్ర వాహనంపై ప్రగతి భవన్‌ వెళ్లడం.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎంను కలువడానికి ముందు.. టీఆర్‌ఎస్‌ సొంతంగా మెజారిటీ సాధించబోతుందంటూ అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. అసద్‌ మూడు గంటలసేపు ప్రగతి భవన్‌లో ఉండటం.. రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. టీఆర్‌ఎస్‌కు మెజారిటీకి ఏమైనా సీట్లు తక్కువ పడితే మజ్లిస్‌ పార్టీ నుంచి మద్దతు లేఖ తీసుకునేందుకే.. ఈ సమావేశం జరిగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావించారు. ‘మామూలుగా అయితే, ఫలితాల ప్రకటన తరువాత టీఆర్‌ఎస్‌ గెలిస్తే అభినందించడానికి వెళ్లవచ్చు.

లేదంటే టీఆర్‌ఎస్‌కు మెజారిటీకి సీట్లు తక్కువ పడితే మద్దతు ఇస్తామని చెప్పడానికి వెళ్లవచ్చు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీ ముందు రోజే వెళ్లడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ వస్తుందని చెప్పడం వల్ల అపోహలకు కొంత మేర తెరపడిందని చెప్పొచ్చు’అని రాజకీయ విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు కొందరు.. గెలుస్తారని భావిస్తున్న ఇండిపెండెంట్లు, బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల మద్దతు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను టీఆర్‌ఎస్‌ తోసిపుచ్చింది. తాము మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు సాధించి గద్దెనెక్కబోతున్నామని పునరుద్ఘాటించింది. 
 
హంగ్‌ భావనలో కాంగ్రెస్‌ 
రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడుతుందన్న భావనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బట్టి అర్థమవుతోంది. కౌంటింగ్‌కు ముందు రోజే ఆ పార్టీ నేతలు కొందరు.. గెలిచే అవకాశాలున్న ఒకరిద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో రాయబారాలు నడిపారు. రామగుండం టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్‌కు కేబినెట్‌ పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి శివకుమార్‌రెడ్డితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్‌పీ తరపున పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి తన మద్దతు కాంగ్రెస్‌కేనని ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది చెప్పలేమని ఓ కాంగ్రెస్‌ నాయకుడే వ్యాఖ్యానించారు. ఓ వైపు గెలుస్తారనుకున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థుల మద్దతు కోరుతూనే మరోవైపు తమ కూటమిని ఒక యూనిట్‌గా గుర్తించాలంటూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్‌ విధానం చూస్తే కచ్చితంగా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందన్న భావనలో వారు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 
 
బీజేపీ, ఇండిపెండెంట్లే కీలకం!
ఓట్ల లెక్కింపునకు ముందే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. కొద్ది స్థానాల్లో గెలువగలిగే సత్తా ఉన్న బీజేపీ, ఇండిపెండెంట్లు కీలకం అవుతారేమోనన్న చర్చ జరుగుతోంది. అయితే పోలింగ్‌ శాతం అనూహ్యంగా పెరిగినందున హంగ్‌ ఉండకపోవచ్చనే వాదనలూ వినబడుతున్నాయి. ఏదేమైనా కౌంటింగ్‌కు ముందే రెండు ప్రధాన పార్టీలు తమ జాగ్రత్తలో తాము ఉన్నాయనేది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తనకు మంత్రిపదవి ఇస్తేనే మద్దతు ఇస్తానని రామగుండం స్వతంత్ర అభ్యర్థి పేర్కొనడం గమనార్హం. అంటే రాష్ట్రంలో హంగ్‌ వస్తే తప్ప ఇండిపెండెంట్లకు మంత్రి పదవి ఆఫర్‌ చేసే పరిస్థితి రాదు.

గెలుస్తారని అనుకుంటున్న మిగిలిన వారు గుంభంగానే ఉన్నారు. ‘ముందు ఓట్ల లెక్కింపు జరగాలి. అప్పుడు మద్దతు ఎవరికనేది నిర్ణయించుకుంటామ’ని ఓ అభ్యర్థి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హంగ్‌ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంలో బీజేపీకి స్పష్టమైన వైఖరి లేదు. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని, అదీ మజ్లిస్‌తో రాంరాం చెపితేనే సాధ్యమని శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అయితే.. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ సోమవారం వివరణ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికల్లా రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయ మార్పులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)