amp pages | Sakshi

అశ్విన్.. నీ తెలివి ఇంతేనా: నెటిజన్లు ఫైర్

Published on Thu, 07/20/2017 - 14:12

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై ఉన్న రెండేళ్ల నిషేధం ముగియడంతో 2018 ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతున్నాయి. గత వారం రోజులుగా చెన్నై జట్టుకి శుభాకాంక్షలు చెబుతూ ఆ ఫ్రాంచైజీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం చెన్నై జట్టు నిషేధం ముగియడంపై చేసిన పోస్ట్ మిస్ ఫైర్ అయింది. దీంతో అశ్విన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

‘రెండేళ్ల నిషేధాన్ని ముగించుకున్న చెన్నై జట్టు విలువ మరింత పెరిగింది. ఈ రెండేళ్ల సమయం మాకు ఎలా గడిచిందంటే.. 1958లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్స్ సహా 23 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఆ విషాదం నుంచి మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు అదేరీతిలో రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు మరింత ఉత్సాహంతో, పటిష్టంగా మీ ముందుకు వచ్చిందని’  ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించి అశ్విన్ తీవ్ర విమర్శల పాలయ్యాడు.

ఫిక్సింగ్‌ కారణంగా నిషేధం ఎదుర్కొన్న జట్టును విమాన ప్రమాదంతో పోల్చుతున్నావ్, నువ్వేంటో అర్థమైందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన వల్లే నీ ర్యాంకు మూడుకు పడిపోయింది చూసుకో అశ్విన్ అంటూ నితిన్ నాయక్ అనే నెటిజన్ ఎద్దేవా చేశాడు. ప్రమాదానికి, ఫిక్సింగ్ కు ముడిపెట్టాలని నీకు ఎలా అనిపించింది అంటూ అశ్విన్ పై ట్వీట్ల దాడికి దిగారు. తన పొరపాటును గ్రహించిన అశ్విన్ ట్వీట్ల ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. ‘ప్రమాదంలో ఆటగాళ్లను కోల్పోయిన మాంచెస్టర్ యూనైటెడ్ జట్టు పుంజుకోవడానికి రెండేళ్లు సమయం పట్టిందని, రెండేళ్ల నిషేధం తర్వాత తమ జట్టు అలాంటి పరిస్థితే ఎదుర్కొందని చెప్పడానికే ప్రమాదం ఘటనపై ట్వీట్ చేశానని’  వివరించాడు.