amp pages | Sakshi

హరహర మహాదేవ.. శంభోశంకర...

Published on Sat, 02/25/2017 - 05:47

- తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శివరాత్రి
- ఎములాడకు పోటెత్తిన భక్తులు.. శ్రీశైలంలో కమనీయం..


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.  ఉదయం స్వామి వారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకుని తరించారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి ఐదుగంటల సమయం పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి లయకారుడి లింగోద్భవం జరిగింది.

స్వామి వారికి ప్రభుత్వం తరఫున మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 7.30 గంటలకు టీటీడీ పక్షాన జేఈవో శ్రీనివాస్‌రాజు ఆధ్వర్యంలో అర్చకుల బృందం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ప్రజల కోరిక మేరకే యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాలను ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు.             – సాక్షి, సిరిసిల్ల

కల్యాణం.. కమనీయం
మహాశివరాత్రి పర్వదినాన పాగాలంకరణతో వరుడైన ముక్కంటి కల్యాణ మహోత్సవం ఏపీలోని శ్రీశైలంలో కనుల పండువగా సాగింది. సాయంత్రం 6 గంటలకు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ప్రభోత్సవం వేడుకగా జరిగింది. మల్లికార్జునుడికి రాత్రి 10 గంటల తర్వాత లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం పంచామృతాలతో జల, క్షీర, ఫలరసాలతో వైభవంగా ప్రారంభమైంది. దీనికి ముందు రాత్రి 7.30 గంటలకు లింగోద్భవ కాలానికి ముందు జరిగే అభిషేకాన్ని నిర్వహించారు. రాత్రి 10.30 గంటల నుంచి పాగాలంకరణోత్సవం ప్రారంభమైంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవ ఘడియలు రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్స వాల్లో భాగంగా శుక్రవారం భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై దర్శనమిచ్చారు. శనివారం సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.           
 – శ్రీశైలం

శివనామ స్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి శివయ్య క్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా శివ నామస్మరణతో మార్మోగింది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తకోటి ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్రవిమానం చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి వారు నంది వాహనంపై, అమ్మవారు సింహవాహనంపై ఊరేగారు.మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో పంచారామక్షేత్రాలైన భీమవరం సోమారామం, పాలకొల్లు క్షీరారామాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. పట్టిసీమలో కొలువైన భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అలాగే, కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి వారి సన్నిధానంలో జరిగే కోటప్పకొండ తిరు నాళ్లను రాష్ట్ర పండుగగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు, వెండి ప్రభను సమర్పించారు.
– శ్రీకాళహస్తి/భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా)/నరసరావుపేటరూరల్‌ (నరసరావుపేట)

విశాఖలో కోటి లింగాలతో మహా లింగం
ప్రతి సంవత్సరం మాదిరిగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో ప్రతిష్టించిన కోటి లింగాలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు  విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీ, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి క్షీరాభిషేకం చేసి మహా కుంభాభిషేకం ప్రారంభించారు.     
– సాక్షి, విశాఖపట్నం