amp pages | Sakshi

తమిళ రాజకీయాల్లో తాజా ట్విస్ట్

Published on Fri, 02/17/2017 - 19:13

చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బలపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని విపక్ష డీఎంకే ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు అసెంబ్లీ హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు.

తమ పార్టీకి చెందిన 89 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఎంకే స్టాలిన్‌ తెలిపారు. బలపరీక్షకు హాజరుకాబోమని ఈ ఉదయం డీఎంకే ప్రకటించింది. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది. డీఎంకే తాజా ప్రకటనపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. డీఎం నిర్ణయం మార్చుకోవడం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉండే అవకాశముందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. డీఎం వ్యూహంతో తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

మరోవైపు బలపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఓడించేందుకు పన్నీర్‌ సెల్వం తన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే శశికళ శిబిరం నుంచి 10 ఎమ్మెల్యేలు ఆయన వైపు రావాల్సి ఉంటుంది.