amp pages | Sakshi

హెక్టారు పొలం.. పది నిమిషాల్లో పిచికారీ!

Published on Mon, 03/10/2014 - 00:29

* అందుబాటులోకి అత్యాధునిక బూమ్ స్ప్రేయర్
* ప్రపంచ స్థాయి పరికరాన్ని రూపొందించిన సృజనశీలి సయ్యద్ సుభానీ

 
పంట సాగుకు అదను, పదును తెలుసుకోవడంతోపాటు యాజమాన్య పద్ధతులను సక్రమంగా అర్థం చేసుకొని ఆచరించడంలోనే రైతు విజయ రహస్యం దాగి ఉంది. ఏ పంట సాగులోనైనా భూ యాజమాన్యం, విత్తన ఎంపిక, సస్యరక్షణ అనే మూడు అంశాలు దిగుబడులను ప్రభావితం చేసే కీలక అంశాలు. పంట పెరుగుదల దశలో సస్యరక్షణ అతి ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో దీని నిర్వహణ రైతులకు కత్తిమీది సామే. వీపున స్ప్రే ట్యాంక్ వేలాడేసుకొని మందు కలిపిన నీళ్లను మాటిమాటికీ నింపుకొని పిచికారీ చేయడానికి గంటల కొద్దీ సమయం పడుతుంది.
 
  పెద్ద రైతులైతే అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పంటలకు రోజుల తరబడి పిచికారీ చేయాల్సి వస్తుంది. భారీ మొత్తం వెచ్చిస్తే తప్ప త్వరితంగా పని ముగించుకోగలిగే యంత్ర పరికరాలు దొరకవు. సయ్యద్ సుభానీ వాణిజ్య పంటలను అధికంగా సాగు చేసే గుంటూరు జిల్లాలో సస్యరక్షణ పనుల్లో రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాడు.  విదేశాల్లో వాహనాల ద్వారా సస్యరక్షణ మందులు వెదజల్లే బూమ్ స్ప్రేయర్ పరికరాన్ని గుర్తించాడు. అదే తీరులో అత్యంత వేగంగా పనిచేసే స్ప్రేయర్‌ను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చాడు.
 
 పెదనందిపాడు మండలం నాగభైరవపాలెంలో పుట్టి పెరిగిన సయ్యద్ సుభానీ వృత్తిరీత్యా వ్యవసాయ పనిముట్లు తయారు చేసే వడ్రంగి. వ్యవసాయ అనుబంధ వృత్తిలో ఉన్న సుభానీ సస్యరక్షణ పనుల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి తానుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.
 
 వ్యవసాయ పరికరాలు, వివిధ రకాల స్ప్రేయర్ల మరమ్మతులో విశేష అనుభవం ఉన్న సుభానీ అత్యంత వేగంగా పని పూర్తి చేసే స్ప్రేయర్‌ను రూపొందించాలని ప్రయత్నించి విజయం సాధించాడు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పైపులను, నాజిల్స్‌ను వెల్డింగ్ ద్వారా జత చేసి వాటిని ట్రాక్టర్‌కు ఓ ఫ్రేమ్ ద్వారా అమర్చాడు. అదే ఫ్రేమ్‌లో ట్రాక్టర్ మీదే ఏర్పాటయి ఉన్న పెద్ద సింటెక్స్ ట్యాంక్‌కు కలిపాడు. ట్రాక్టర్ పుల్లీకి మోటార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ట్యాంక్‌లోని మందు ద్రావణం బూమ్ స్ప్రేయర్‌లోకి వెళ్లి ఒకేసారి అనేక నాజిళ్ల ద్వారా విరజిమ్మే విధంగా రూపొందించాడు.
 
 60 అడుగుల పొడవునా ఉండే స్ప్రేయర్‌తో మందు పిచికారీ చేయడం అత్యంత వేగంగా జరుగుతుంది. పొలం పొడవు, వెడల్పును బట్టి అత్యధికంగా పది నిమిషాల్లో హెక్టారు(రెండున్నర ఎకరాల) పొలంలో మందు లేదా జీవామృతం పిచికారీని ముగించవచ్చు. 2004 నుంచి స్ప్రేయర్ రూపొందించే కృషిలో నిమగ్నమైన సుభానీని ఈ విజయం అంత తేలికగా వరించలేదు. తొలుత సైకిల్ మీద ట్యాంక్ ఏర్పాటు చేసి బూమ్ స్ప్రేయర్‌ను ఏర్పాటు చేశాడు. సైకిల్‌ను నెట్టుకుంటూ పిచికారీ చేయాల్సి వచ్చేది.
 
 2007లో మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ జీప్ మీద ఏర్పాటు చేశాడు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జిల్లా అధికారులు, మంత్రులు ఈ స్ప్రేయర్ పనితనం చూసి ప్రశంసలు గుప్పించారు. అయితే, నల్లరేగడి నేలల్లో జీపు వినియోగంలో కొన్ని సమస్యలొచ్చాయి. ఇదే సమయంలో వ్యవసాయ శాఖ సిఫారసుతో నాబార్డ్ వారు రూ. 2.33 లక్షల రుణం మంజూరు చేశారు. ఆర్థిక వనరులు చేకూరడంతో బూమ్ స్ప్రేయర్‌ను మరింత మెరుగుపరచి ట్రాక్టర్‌కు అమర్చాడు.
 
 తాజాగా ఈ సంవత్సరం ఇదే స్ప్రేయర్‌ను మరింత ఆధునీకరించాడు. 100 అడుగుల వెడల్పుతో స్ప్రే చేసే విధంగా.. అవసరమైనప్పుడు పొలం వెడల్పు ఉన్నంత వరకూ స్ప్రే చేసే విధంగా రూపొందించాడు. అయితే, పొలం వెడల్పును బట్టి దాన్ని మడుచుకొనే వీలు కల్పించాడు. దీంతో ఒకే స్ప్రేయర్‌తో 50 అడుగులు, 70 అడుగులు, 100 అడుగుల వెడల్పు ఉన్న చేలల్లో మందు పిచికారీ చేసే అవకాశం ఏర్పడింది. దీనికి తోడు సోలార్ విద్యుత్‌తో స్ప్రేయర్ ట్యాంక్‌లో మందు నిల్వ ఎప్పటికప్పుడు డ్రైవర్ తెలుసుకొనే విధంగా ఓ సూచిని రూపొందించి.. దాన్ని ట్రాక్టర్ డ్రైవర్ ముందున్న డాష్‌బోర్డులో అమర్చాడు. అవసరానికి తగినట్లు.. చేతితో మడుచుకోవడం ద్వారా సవరించుకొనే వీలున్న బూమ్ స్ప్రేయర్ ప్రపంచంలో ఇదొక్కటేనని స్పష్టం చేశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు బృందం దీన్ని పరిశీలించి వివరాలను నమోదు చేసింది. ఆధునీకరించిన బూమ్ స్ప్రేయర్‌ను కూడా ఈ బృందం పరిశీలించనుంది. సాధారణ గ్రామీణుడు ప్రపంచ స్థాయి పరికరాన్ని రూపొందించడం అసాధారణ విజయం.          
 - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్
 
 23 స్ప్రేయర్లు తయారుచేసి ఇచ్చా..!
 రైతులు సస్య రక్షణ మందుల పిచికారీ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి ఏదైనా పరిష్కారం ఆలోచించాలనుకున్నాను.  ఆరేడేళ్లుగా అదే పనిగా శ్రమిస్తున్నాను. తొలుత సైకిల్‌తో స్ప్రేయర్‌ను తయారు చేశాను. తరువాత జీపుపై ఏర్పాటు చేసి స్ప్రేయర్‌ను పరిశీలించాను. వ్యవసాయ ప్రదర్శనలో మంచి ప్రశంసలు వచ్చాయి. నేను చేసిన ప్రయత్నం పల్లెసృజన సంస్థ అధ్యక్షుడు గణేశం గారి దృష్టికి వెళ్లింది.

ఆయన నన్ను ప్రొత్సహించడమే కాకుండా అవార్డుకు సిఫారసు చేశారు. మరింత మెరుగైన పరికరం రూపొందించడానికి నాబార్డ్ ద్వారా రుణ సదుపాయం పొందేందుకు తోడ్పడ్డారు.   ఇప్పుడు మరింత ఆధునికమైన 100 అడుగుల స్ప్రేయర్‌ను తయారు చేశాను. సంవత్సరానికి కనీసం 10 స్ప్రేయర్లకు ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పటికి 23 స్ప్రేయర్లు తయారు చేసి రైతులకు ఇచ్చాను. ఒక్కొక్క స్ప్రేయర్ తయారీకి రూ.60 వేలు ఖర్చవుతుంది. అప్పటి వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అభ్యుదయ రైతు అవార్డు అందుకున్నాను.  పొగాకు పంట కోసం బూమ్ స్ప్రేయర్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాను.
 - సయ్యద్ సుభానీ(98486 13687), నాగభైరవపాలెం,
 పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు