amp pages | Sakshi

దళిత స్త్రీ వాదాన్ని ఎత్తిపట్టిన మొదటి ఆత్మకథ

Published on Sun, 01/22/2017 - 23:56

ఆవిష్కరణ
జనవరి 28న సాయంత్రం 5:30కి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘మా బతుకులు’ పుస్తకావిష్కరణ జరగనుంది.
మరాఠీ మూలం: బేబీ కాంబ్లే.
మరాఠీ–ఇంగ్లిష్‌: మాయ పండిట్‌.
తెలుగు: బి.అనూరాధ.
ఆవిష్కర్త: ప్రొఫెసర్‌ సుజితారు.
ప్రచురణ: ‘మలుపు’.
ఫోన్‌: 9866559869.


అంబేడ్కర్‌ నడిపిన చారిత్రాత్మక దళిత ఉద్యమంలో తొలితరం మహిళా కార్యకర్త బేబి కాంబ్లే. ఆమె రాసిన ‘జీనా అమూచ’(మా బతుకులు) తెలుగులోకి చాలా ఆలస్యంగా వస్తోంది. మరాఠీ దళిత సాహిత్యం నుంచి కొన్ని కవితలు, కథలు తెలుగులోకి వచ్చాయి కానీ ఆత్మకథలు, నవలలు రాలేదు. ఆలస్యంగానైనా దళిత ఆత్మకథ తెలుగులోకి రావడం ఆహ్వానించదగినది. బేబి కాంబ్లే తన భర్తతో పాటు చిన్న కిరాణా షాపు నడుపుకునేది. పెద్దగా చదువుకోలేదు. తన జీవితకాలంలో మహర్ల జీవితంలో వచ్చిన మార్పుల్ని తన అనుభవాల రూపంలో రాసింది. 1960లలోనే చాలా నోట్స్‌ పుస్తకాలు నింపేసింది. తన రాతలను భర్త చూస్తే అభ్యంతర పెడతాడని ఆ నోట్స్‌ పుస్తకాలని పాత పుస్తకాలు, పత్రికలతో పాటు అటకపై దాచేసింది. 1980లలో మహారాష్ట్రలో పరిశోధన చేయటానికి వచ్చిన సామాజిక శాస్త్ర పరిశోధక విద్యార్థి మాక్సీన్‌ బెర్నస్టీన్‌... బేబీ కాంబ్లేను కలిసింది.

బేబీ కాంబ్లే చెప్పిన ఉద్యమ అనుభవాల్ని విని, ఈ అనుభవాల్ని రాస్తే బాగుంటుందని అన్నది. అవి విన్న బేబీ కాంబ్లే తాను ఎప్పుడో రాశానని చెప్పింది. బెర్నస్టీన్‌ ఆ పుస్తకాల్ని తెప్పించుకుని చదివింది. ఒక మహిళా పత్రిక వారితో మాట్లాడి ఈ ఆత్మకథని 1982లో ధారావాహికంగా ప్రచురించడానికి సహాయపడింది. అది పుస్తకరూపంలో 1986లో వచ్చింది. మరాఠీ సాహిత్యంలో, బహుశా భారతీయ భాషల్లోనే దళిత మహిళ రాసిన మొదటి ఆత్మకథగా దీన్ని చెప్పవచ్చు. ఈ పుస్తకాన్ని ‘ద ప్రిజన్స్‌ వియ్‌ బ్రోక్‌’ పేరుతో 2008లో ఇంగ్లిష్‌లో ప్రచురించారు. ‘మా బతుకులు’ రాసిన తరువాత 20 ఏళ్లకు మరాఠీ భాషలో పుస్తకరూపంలో వచ్చింది. మరో 20 ఏళ్ల తరువాత ఇంగ్లిష్‌లో ప్రచురితమైంది. దళిత మహిళల అనుభవాలు, ఆలోచనలు వెలుగులోకి రావటం ఎంత కష్టమో ‘మా బతుకులు’ ప్రచురణ చరిత్ర చదివితే అర్థమవుతుంది.

మరాఠీ దళిత సాహిత్య చరిత్రలో ఆత్మకథా ప్రక్రియ ఒక విశిష్టతను సంతరించుకుంది. ఆత్మకథా ప్రక్రియ అనగానే ‘‘ప్రముఖులు’’, తత్వవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, అందులోనూ పురుషుల వ్యక్తిగత జీవిత చరిత్రని రికార్డు చేసే రూపంగా మనకి తెలుసు. అరకొర చదువులతో, సాధారణ వ్యక్తులైన దళితులు తమ జీవిత చరిత్రలు రాసి ఆ మొదటి ప్రయత్నంలో రచయితలుగా ఎదిగారు. ఆత్మకథా ప్రక్రియ రూపురేఖల్ని మార్చి వేసారు. ఈ ప్రక్రియ చుట్టూ ఏర్పరిచిన సరిహద్దుల్ని చెరిపేసారు. దయాపవార్‌ రాసిన ‘బలూత’, శరణ్‌ కుమార్‌ లింబాలే రాసిన ‘అక్కర్‌ మాషీ’ లాంటి ఆత్మకథలు సంచలనం సృష్టించాయి. సాధారణ వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా మొత్తం దళితుల సామూహిక జీవన దృశ్యాన్ని చిత్రించే ప్రయత్నం చేశాయి. ‘మా బతుకులు’ దళిత మహిళ దృష్టికోణం నుంచి, దళిత జీవితాన్ని, మొత్తంగా సమాజపు స్వభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

‘మా బతుకులు’లో మహారాష్ట్రలో అంటరాని కులస్తులైన మహర్ల జీవితాన్ని రెండు భాగాలుగా విభజించి చూపించారు. మొదటి భాగంలో మహర్ల సాంప్రదాయక సంస్కృతి, జీవితం, రెండవ భాగంలో అంబేడ్కర్‌ ఉద్యమ వెలుగులో మహర్లు ఆధునికత వైపు అడుగులు వేయటాన్ని చూడవచ్చు.

మహారాష్ట్రలోని పూనా సమీపంలోగల వీర్‌గాంవ్‌ గ్రామంలోని మహర్ల జీవితం గురించి బేబీ కాంబ్లే రాసింది. ఆ గ్రామంలో తన అమ్మమ్మగారి ఇంట్లో ఆమె పుట్టింది. బేబీ కాంబ్లే తన వ్యక్తిగత జీవిత వివరాల కంటే మహర్‌ కుల ప్రజల జీవిత చరిత్రకే ప్రాధాన్యత ఇచ్చింది. మహర్ల జీవిత చరిత్రలోనే ఆమె జీవిత చరిత్ర ఉందని ఆమె భావించింది.

అంటరానితనం, కులవివక్ష, పేదరికం, అజ్ఞానంలో బతుకుతున్న మహర్లు దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ప్రతి కుటుంబానికి 8 నుంచి 15 మంది పిల్లలు ఉంటారు. పూరి గుడిసెల్లో సరైన బట్టలు, వంట పాత్రలు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఆనాటి మహర్లని చూస్తే ‘‘ఎలుకలు కొరికేసిన గుడ్డ బొమ్మల్లాగుంటారు’’.

మహర్‌ కులంలో మహిళలది చాలా కీలకమైన పాత్ర. కుల సంప్రదాయాలు, ఆచారాలు పాటించడంలో వారు చాలా నిష్టగా ఉంటారు. ఆషాడ మాసంలో జరిగే ‘పవిత్ర’ స్నానాలు, ఆచారాల గురించి చాలా వివరమైన, సుదీర్ఘమైన వర్ణనలు ఉన్నాయి. స్నానం తరువాత గోచిగుడ్డ, చింకిపాతల చీరలే, కొత్త దుస్తులుగా కట్టుకుంటారు. పండుగలకు, జాతర్లకు అలంకరణ చేయడం, వంటలు, నైవేద్యం తయారు చేయడం నుంచి అమ్మవారిలా పూనకం ఊగే వరకు అన్ని రకాల మంత్రతంత్రాలు, తంతుల్లో మహర్‌ మహిళలు పాల్గొంటారు.

ఈ ఆత్మకథలో మూడు తరాల మహర్‌ మహిళలు కనిపిస్తారు. అమ్మమ్మలు/ నాన్నమ్మలు, అమ్మలు/ అత్తలు, కూతుళ్లు/ కోడళ్లు. చిన్న వయస్సులోనే కష్టాలకు, అణచివేతకు గురయ్యే కూతుళ్లు, కోడళ్ల గురించి కొంత తెలుసుకోవాలి. మహర్‌ కులంలో అమ్మాయిలకు 7 లేదా 8 ఏళ్లకే పెళ్లయిపోతుంది. శారీరకంగా ఎదగకుండానే గర్భవతులవుతారు. అనేక అనారోగ్య సమస్యలతో వారిలో చాలామంది ప్రసవ సమయంలో చనిపోతారు. ఇక కోడళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వేకువ జామునే లేచి జొన్నలు దంచాలి. రొట్టెలు చేయాలి. నీళ్లు మోసుకురావాలి. మొత్తం ఇంటిపనంతా కొత్త కోడలే చేయాలి. అత్తగారు, ఆడపడుచులు, బావగార్ల తిట్లు, వేధింపులు భరించాలి. ఈ పని ఒత్తిడి, వేధింపులు భరించలేక కొందరు కొత్త కోడళ్లు పారిపోతారు. వాళ్లను పట్టుకొని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తారు. మహర్‌వాడలో ప్రతి ఇంటినుంచి కోడళ్ల ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉంటాయి. కొందరి తలలు పగలడం, ఎముకలు విరగడం, వారు స్పృహ తప్పి పడిపోవడం సర్వసాధారణం.

సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల గురించి, పెళ్లిళ్లలో మిగిలిన ఆహారం తినడం, చచ్చిన గొడ్డు మాంసాన్ని దాచుకుని రోజుల తరబడి తినడం, ఆకలితో చావలేక బ్రహ్మజెముడు కాయలు తిని కడుపు పాడై ఇబ్బందులకు గురికావడం లాంటి అనేక విషయాల్ని బేబీ కాంబ్లే విపులంగా వర్ణించారు. అందుకే మహర్లు తోకలేని జంతువులుగా బతికారని అంటుంది.

‘‘జంతువులుగా జీవిస్తున్న వారిని మనుషులు’’గా అంబేడ్కర్‌ మార్చారని బేబీ కాంబ్లే అంటుంది. చిన్న బాలికగా ఉన్నప్పుడు అంబేడ్కర్‌ ఒక సమావేశంలో చేసిన ప్రసంగాన్ని ఆమె విన్నది. ఆయన మాటల్ని ఆచరణలో పెట్టింది. అంబేడ్కర్‌ ‘‘మనమూ మనుషులమే. మనకూ మనుషులుగా జీవించే హక్కు’’ ఉందని ప్రకటించాడు. ఆత్మగౌరవంతో బతకలేకపోతే చావడం మేలన్నాడు. చచ్చిన గొడ్డు మాంసాన్ని తినవద్దన్నాడు. తిండిలేక కొందరు చనిపోయినా, బతికినవారు గౌరవంగా, మర్యాదతో బతుకుతారని అన్నాడు. ఈ బానిస బతుకు మనపై రుద్దబడింది. ఇది పోవాలంటే పోరాటం తప్పదన్నాడు. ముఖ్యంగా ఈ విప్లవాత్మక సంస్కరణలో మహిళలే ముందుండాలి అన్నాడు. జాతిని మేల్కొలిపి, పోరాటాల ద్వారా చైతన్యపరచి మహర్‌ కుల ప్రజల్ని ఆధునికత వైపు నడిపించాడు. ఈ ఆత్మకథలో అంబేడ్కర్‌ ఒక పాత్రగా చారిత్రక వ్యక్తిగా ఉద్యమ ప్రతీకగా కనిపిస్తారు.

అంబేడ్కర్‌ జయంతినాడు తెల్లని బట్టలు ధరించి ఆత్మగౌరవంతో నడుస్తూ కొత్త మనుషుల్లా మహర్లు కనిపించడంతో కథ ముగుస్తుంది. కొస మెరుపుగా, చదువుకున్న దళితులు స్వార్థంతో జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారనీ, అంబేడ్కర్‌ ఆశించింది ఇదేనా? అనీ బేబీ కాంబ్లే ప్రశ్నిస్తుంది.
కె.సత్యనారాయణ
పై వ్యాసం, ముందుమాటనుంచి సంక్షిప్తం చేసింది.


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌