amp pages | Sakshi

చదువు వెనుక‘బడి’!

Published on Sat, 11/05/2022 - 03:53

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్య నాణ్యత సూచీలో తెలంగాణ వెనుకబడింది. రాష్ట్రంలోని బడుల్లో మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయని కేంద్రం వెలువరించిన ‘పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ గ్రేడ్‌ (పీఐజీ)’ నివేదిక తేల్చింది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి చూస్తే.. పాఠశాల విద్య నాణ్యతలో తెలంగాణ 31వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. గత ఏడాదికన్నా ఐదు పాయింట్లు తగ్గిపోయి దిగువ నుంచి ఏడో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. వేలకొద్దీ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, బోధనతోపాటు పర్యవేక్షణ కూడా సరిగా లేదని పేర్కొంది. 

మనకన్నా వెనుక ఈశాన్య రాష్ట్రాలే.. 
పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పాలన (గవర్నెన్స్‌), విద్యార్థుల నమోదు వంటి అంశాల ఆధారంగా ఏటా ‘పీఐజీ’ సూచీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆయా అంశాల ఆధారంగా 2020–21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు 754 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు 2019–20 పీజీఐలో రాష్ట్రం 759 పాయింట్లు పొందడం గమనార్హం. ఈసారి తెలంగాణకన్నా దిగువన సిక్కిం (751 పాయింట్లు), మణిపూర్‌ (741), నాగాలాండ్‌ (728), ఉత్తరాఖండ్‌ (719), మేఘాలయ (716), అరుణాచల్‌ప్రదేశ్‌ (669) మాత్రమే నిలిచాయి. కేరళ, మహారాష్ట్రలు 928 పాయింట్లతో అన్నింటికన్నా ముందంజలో ఉన్నాయి. 

బోధన, పర్యవేక్షణ రెండూ కొరతే! 
రాష్ట్రంలో పీఐజీ తగ్గడానికి మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో (గురుకుల, రెసిడెన్షియల్‌ కాలేజీలు కలిపి) 69,15,241 మంది చదువుతున్నారు. ప్రభుత్వ   రంగ విద్యాసంస్థల్లో 33,03,699, ఎయిడెడ్‌ 90,601, ప్రైవేటు సంస్థల్లో 35,14,380 మంది విద్యార్థులున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి స్కూల్‌లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 22గా ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత, ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లతోనే నడిపించే పరిస్థితి ఉంది. 8,630 మంది భాషా పండితులు, పీఈటీ పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ కాలేదు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,207 పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులుండగా.. 2,386 మంది మాత్రమే పనిచేస్తున్నారు.

మిగతావి 1,821 ఖాళీలున్నాయి. కొత్తగా 5,793 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది.  ఇక పాఠశాల విద్యను పర్యవేక్షించాల్సిన డీఈవోలు, ఎంఈవోలు పూర్తిస్థాయిలో లేరు. ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలు ఉన్నారు. 21 జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్‌ బ్లాకులుగా చేశారు. అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవోలు ఉన్నారు. దీంతో హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంతేకాదు ఒక్కో హెచ్‌ఎంకు ఆరేడు మండలాలు అప్పగించారు. దీనివల్ల పాఠశాలల్లో విద్యా బోధన, పర్యవేక్షణకు ఇబ్బంది కలుగుతోంది. 

మౌలిక వసతుల కరువుతో.. 
పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఇంకా వేగం పుంజుకోలేదని.. రాష్ట్రంలోని ప్రతి స్కూల్‌లో సమస్యలు కనిపిస్తున్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 38వేల బడుల్లో శౌచాలయాలు ఉన్నా, వాటిలో 10వేల వరకు పనికిరాని స్థితిలో ఉన్నాయి.

బాలికలు ఎక్కువగా ఉండే 5,700 స్కూళ్లలోనూ శౌచాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇది బాలికల గైర్హాజరు పెరగడానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో దాదాపు 20వేల స్కూళ్లలో విద్యార్థులకు లైబ్రరీ అనేదే తెలియదు. లైబ్రరీ ఉన్నా అందులో పుస్తకాలు శూన్యం. 15వేల బడుల్లో ఆటస్థలాలు లేవు. దీనివల్ల విద్యార్థుల్లో మానసికోల్లాసం నష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40,437 స్కూళ్లకు విద్యుత్‌ సౌకర్యమున్నా.. 38,920 స్కూల్స్‌లోనే సరిగా సరఫరా జరుగుతోంది. డిజిటల్‌ విద్య వైపు దేశం అడుగులేస్తున్నా.. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేని స్కూళ్లు 20వేలకుపైగా ఉన్నాయి. ఇవన్నీ విద్య ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని పీఐజీ నివేదిక పేర్కొంది. 

కేంద్రం తీసుకున్న డేటా పాతది 
పీజీఐ నివేదికను పరిశీలించాం. వాళ్లు తీసుకున్న డేటా పాతది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. మౌలిక వసతుల మెరుగుకు మన ఊరు–మన బడి ప్రారంభించాం. ఇప్పటికే చాలా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యలో అనేక మార్పులు చేస్తున్నాం. బోధనా ప్రమాణాలు మెరుగు పరుస్తున్నాం. వచ్చే ఏడాది మనం మంచి ర్యాంకు సాధిస్తాం. 
– వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి 

వచ్చే ఏడాది గ్రేడ్‌–1లో ఉంటాం 
ఈ నివేదిక మొత్తం కోవిడ్‌ కాలంలో జరిగిన పరిశీలనే. పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో పాయింట్స్‌ తగ్గినా మనం గ్రేడ్‌–2లోనే ఉన్నాం. కోవిడ్‌ సమయంలో స్కూల్స్‌ తెరవలేదు. అందుకే బయోమెట్రిక్‌ హాజరు వాడలేదు. దాన్ని కొలమానంగా తీసుకోలేం. అదీగాక కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో విద్యా వలంటీర్లను కూడా నియమించలేదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది పీఐజీలో మనం గ్రేడ్‌–1లో ఉండటం ఖాయం. 
– దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్‌ 

టీచర్ల కొరత తీర్చితే నాణ్యత పెరుగుతుంది 
రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించకపోతే ఉపాధ్యాయ కొరత ఎలా తీరుస్తారు? ప్రతి స్కూల్‌లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ముందు దీన్ని పరిష్కరించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తే పాఠశాల విద్యలో నాణ్యత మెరుగుపడుతుంది. 
– చావా రవి, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

పారదర్శకత పెంచాలి 
ప్రైవేటు స్కూళ్లకు అనుమతి ఇచ్చే క్రమంలో ఆన్‌లైన్‌ విధానం ఉండాలి. ఈ తరహా పారదర్శకత అవసరం. డిజిటలైజేషన్‌ చేపట్టాలి. సకాలంలో నిధులు ఇవ్వాలి. అప్పుడే విద్యాశాఖలో నాణ్యత పెరుగుతుంది. 
– పి.రాజాభానుచంద్ర ప్రకాశ్, హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌