సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా...

11 Mar, 2019 14:37 IST|Sakshi
నిర్మల్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కూలర్లు›, నిర్మల్‌లో కూలర్లు తయారుచేస్తున్న వ్యాపారులు

సాక్షి, తానూరు(ముథోల్‌): ఎండాకాలం రాగానే మనందరికీ గుర్తొచ్చేవి కూలర్లే. ఎండ నుంచి ఉపశమనానికి, వేసవి తాపం నుంచి రక్షణకు ప్రతీ ఇంట్లో కూలర్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో కూలర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుంచే ఎండలు తమ ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో కూలర్లకోసం ప్రత్యేకమైన దుకాణాలు వెలుస్తుండగా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రికల్‌ షాపులో వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. వీటి ధర రూ.1600 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి. గత పక్షం రోజులుగా ఎండలు అధికం కావడంతో వీటి కొనుగోళ్లు అధికమయ్యాయి. 

ఎక్కడ చూసిన కూలర్ల దుకాణాలే..
జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూలర్‌ షాపులు అధికంగా కనిపిస్తున్నాయి. గతంలో వాడిన కూలర్లకు మరమ్మతు చేయడంతోపాటు కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల బాట పడుతున్నారు. కొంతమంది ఎండలు ముదిరితే కూలర్ల రేట్లు పెరుగుతాయని ముందుగానే కొంటున్నారు. ఫైబర్, ఇనుప కూలర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.  కూలర్లను మహారాష్ట్రలోని నాగపూర్, ఔరంగాబాద్, నాందేడ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

నాలుగు నెలలే వ్యాపారం..
ఎండాకాలంలో నాలుగు నెలలు కూలర్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఏటా సీజన్‌లో 10 నుంచి 20వేల కూలర్లు అమ్ముడవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో పక్క పెళ్లిళ్ల సీజన్‌ కావడం.. కట్నకానుకల జాబితాలో కూడా కూలర్‌ చేరడంతో వేసవిలో వీటికి డిమాండ్‌ పెరిగింది. టేబుల్‌పై ఉంచుకునే పర్సనల్‌ కూలర్‌తోపాటు పెళ్లిళ్ల సందర్భంలో ఫంక్షన్‌హాల్‌లో, హోటళ్లలో వినియోగించే జంబో కూలర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

యువకులకు ఉపాధి..
ఎండాకాలం రావడంతో పట్టణాల్లో ఉన్న షాపు యాజమాన్యాలు దుకాణాల్లో మరమ్మతు కోసం యువకులను పెట్టుకుంటున్నారు. దీంతో  ఉపాధి లభిస్తోంది. నాలుగు నెలలపాటు ఈ వ్యాపారం కొనసాగడంతో యువకులు దుకాణాల్లో వ్యాపారం సాగిస్తున్నారు. నాలుగు నెలలపాటు ఉపాధి లభిస్తుందని యువకులు చెబుతున్నారు. 

ఇనుప కూలర్ల తయారీ..
పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వ్యాపారులు ఇనుప కూలర్లు తయారు చేస్తున్నారు. కూలర్ల తయారీలో వినియోగించే ముడి సరుకును హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, పూణే నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కూలర్ల తయారీకి ఐరన్‌ స్డాండ్, ఐరన్‌ ఫీల్స్, పంపులు, మోటార్, గడ్డి, కలర్‌ స్విచ్‌లు, వాటర్‌ సప్‌లై పైపులు వాడుతున్నారు. స్టాండర్ట్‌ ఐరన్‌ వాడటంతో రెడీమేడ్‌ కూలర్ల కన్నా అవి నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. వీటి ధర నాణ్యతను బట్టి రూ.3 వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. 

మరిన్ని వార్తలు