వేసవిలో ‘ఉపాధి’కి కసరత్తు

10 Oct, 2023 05:57 IST|Sakshi

2024–25లో ఉపాధి పనుల కోసం లేబర్‌ బడ్జెట్‌ అంచనాల తయారీ మొదలు 

అక్టోబరు 2 నుంచి డిసెంబర్‌ 31 వరకు కొనసాగనున్న ప్రక్రియ

సిద్ధం చేసిన లేబర్‌ బడ్జెట్‌ను అనుమతి కోసం కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: పేదలకు వచ్చే వేసవిలో కూ­డా సొంత ఊళ్లలోనే పెద్ద ఎత్తున పనులు కల్పి0చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. 2024–25 ఆర్థి  క సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హా­మీ పథకం లేబర్‌ బడ్జెట్‌పై అన్ని గ్రామాల్లో కసరత్తు మొదలైంది. గత మూడేళ్లుగా గ్రామా­ల వారీగా ఉపాధి పథకం పనులకు వచ్చిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని.. వచ్చే ఆరి్థక సంవత్సరంలో ఎంత మందికి ఈ పథ­కం ద్వారా పనులు కల్పి0చాలన్న అంచనాల­ను సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ సూర్యకుమారి ఇప్పటికే కలెక్టర్లతో పాటు డ్వామా పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అక్టోబర్‌ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. గతంలో చేపట్టి ఇప్పటికీ పూ­ర్తి కాని పనులను 20వ తేదీకల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది సందర్శించి సమీక్షిస్తారు. నవంబర్‌ 10కల్లా గ్రామాల్లో అదనంగా చేపట్టే కొత్త పనులను గుర్తిస్తారు. నవంబర్‌ 15కల్లా ఆయా గ్రామాల్లో ఎంత మందికి ఎన్ని పనిదినాలు కల్పించాలన్న వివరాలతో లేబర్‌ బడ్జెట్‌ను రూపొందించి సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 మధ్య.. కొత్తగా గుర్తించిన పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి అను­మతి తీసుకుంటారు. అవసరమైతే మండ­ల, జి­ల్లా స్థాయిలో కూడా అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపడతారు. 2024–25 ఆరి్థక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి పనులు కల్పి0చాలనే వివరాలను గుర్తించి.. అందుకు అవసరమయ్యే పనులకు కలెక్టర్ల ద్వారా అనుమతి తీసుకునే ప్రక్రియను డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తి చేస్తారు.

గ్రామాల వారీగా తయారు చేసిన ఈ అంచనాలతో రాష్ట్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం లేబర్‌ బడ్జెట్‌ను రూపొందించి.. దానిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతికి పంపిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కొత్త పనుల గుర్తింపులో కనీసం 60 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు.

గ్రామాల వారీగా కమిటీలు.. 
2024–25 ఆరి్థక ఏడాదికి సంబంధించిన లేబర్‌ బడ్జెట్‌ అంచనాల తయారీ, కొత్త పనుల గుర్తింపు కోసం గ్రామాల స్థాయిలో ఉపాధి హామీ పథకం టెక్నికల్‌ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, విలేజ్‌ సర్వేయర్లు, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్‌ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు, పొదుపు సంఘాల గ్రామ స్థాయి లీడర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మండల స్థాయి అధికారులు ఈ గ్రామ కమిటీలకు తగిన సహకారం అందజేస్తారు. 

మరిన్ని వార్తలు