25 శాతం భార్యాబాధిత కేసులే

23 Mar, 2017 04:52 IST|Sakshi
25 శాతం భార్యాబాధిత కేసులే

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని వెల్లడి  

సాక్షి, అమరావతి: మహిళా కమిషన్‌కు అందుతున్న కేసుల్లో 25 శాతం మహిళా బాధితులైన పురుషుల నుంచి వస్తున్నవేనని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. భార్యలు కొడుతున్నారంటూ సాక్ష్యాలుగా వీడియోలు కూడా చూపిస్తున్నారని చెప్పారు. బుధవారం తాత్కాలిక అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా నన్నపనేని అటువైపుగా వెళ్తూ ఆగారు.

ఆమెను చూసిన సోమిరెడ్డి.. మహిళా కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మగవాళ్లు తమను చూస్తున్నారంటూ ఎవరైనా మహిళ ఫిర్యాదు చేయగానే కేసులు పెట్టేయడం ఎంతవరకు సబబని ఆయన నవ్వుతూ అడిగారు.  ఈ విషయంలో పురుషుల పట్ల మహిళా కమిషన్‌ దయ చూపించాలన్నారు. దీంతో నన్నపనేని స్పందిస్తూ.. చూస్తేనే కేసులు పెడుతున్నారనడం సరికాదని, అసభ్యంగా చూస్తేనో, ప్రవర్తిస్తేనో మాత్రమే కేసులుంటాయని జవాబిచ్చారు.

మరిన్ని వార్తలు