మతం మార్చుకున్నందుకు బెదిరిస్తున్నారు

6 Jan, 2014 00:28 IST|Sakshi

 హైదరాబాద్‌, న్యూస్‌లైన్:
 ఇస్లాం మతాన్ని స్వీకరించిన హిందూ మతానికి చెందిన ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని న్యాయవాది షేక్ సైఫుల్లా ఖాన్ ఖలీద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పురాలోని డీజేఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మియాపూర్ స్వర్ణపురి కాలనీలో నివాసం ఉండే బంగారం వ్యాపారి బాబులాల్ చౌదరి కుమార్తె చంద్రకాంత (19) ఇస్లాం మతానికి ఆకర్షితురాలయ్యారన్నారు. దీంతో గతేడాది అక్టోబర్ 7న నగరంలోని ఆలిండియా మజ్లీస్ తమీర్-ఇ-మిల్లత్‌లో ఇస్లాంను స్వీకరించిందన్నారు. దీనిపై స్టేట్ వక్ఫ్‌బోర్డును ఆశ్రయించగా అక్టోబర్ 19న ఇస్లాం మతం స్వీకరించినట్లు రిజిస్ట్రర్ చేసి జైనాబ్ ఫాతీమా పేరు మీద సర్టిఫికెట్ జారీ చేశారన్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు హిందూ మతానికి చెందిన వ్యక్తితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. దీంతో చంద్రకాంత ఆలియాస్ జైనాబ్ ఫాతిమా డిసెంబర్ 11న ఇంట్లో నుంచి బయటికి వచ్చిందన్నారు. ఇదిలాఉండగా తమ కూతురు కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు రాంచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో డిసెంబర్ 12న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారన్నారు. అయితే కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ డిసెంబర్ 16న మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిందన్నారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ జైనాబ్ ఫాతిమాకు రక్షణ కల్పించాలని ఆదేశించిందన్నారు.
 
 జైనాబ్ ఫాతిమా తన ఇష్టంతో డిసెంబర్ 31న ఇస్లాం మతానికి చెందిన ఓ యువకున్ని వివాహం చేసుకొని పాతబస్తీలోని షాహిన్‌నగర్‌లో ఉంటుందన్నారు. జైనాబ్ ఫాతిమాను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జైనాబ్ ఫాతిమా మాట్లాడుతూ ఇస్లాం మతంపై ఆకర్షితురాలై మత మార్పిడి చేసుకున్నానని తెలిపారు. అదే మతానికి చెందిన తనకిష్టమైన వ్యక్తితో వివాహం జరిగిందని చెప్పారు. తమ కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
 
 కిడ్నాప్ కేసు నమోదైంది
 తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే బంగారం వ్యాపారి బాబులాల్ చౌదరి కూతురు కిడ్నాప్‌నకు గురైందని కుటుంబ సభ్యులు గతేడాది డిసెంబర్ 12న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని రామచంద్రాపురం ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రీనివాసులు తెలిపారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా విషయం తెలిసిందన్నారు. చంద్రకాంత ఆలియాస్ జైనాబ్ ఫాతిమా మేజర్ కావడంతో దీని ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు