ఏసీబీ వలలో ఇద్దరు ఇరిగేషన్‌ ఎఈలు

15 Jun, 2017 13:00 IST|Sakshi

–రూ.48వేలు లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

నెల్లూరు(క్రైమ్‌): నీరు-చెట్టు పనుల్లో కాంట్రాక్టర్‌ వద్ద నుంచి లంచం తీసుకొంటుండగా ఇద్దరు ఇరిగేషన్‌ ఏఈలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అధికారుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన శాకమూరి సుందరనాయుడు క్లాస్‌–3 కాంట్రాక్టర్‌. 2016 ఆగస్టులో నీరు-చెట్టు పథకం కింద కొన్ని చెరువుల మరమ్మత్తులు, కోర్‌వెల్‌ నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. సుందరనాయుడు మావూరమ్మ చెరువుకట్టపనికి రూ. 26,25,368తో, వెంకటగిరి ట్యాంకు కోర్‌వెల్‌ నిర్మాణానికి రూ.32,83,922తో టెండర్లు వేసి పనులు దక్కించుకొన్నాడు.

వాటి నిర్మాణ పనులను తన బంధువు అయిన శ్రీరామచౌదరికి అప్పగించి ఈ ఏడాది ఏప్రిల్‌ 2017 నాటికి పూర్తిచేయించాడు. ఈ క్రమంలో ఈ పనులకు సంబంధించిన ఎం బుక్‌లు ఇరిగేషన్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఏఈలు చంద్రమౌళి, గిరిధర్‌ల వద్దకు వచ్చాయి. దీంతో శ్రీరామచౌదరి ఈ నెల 12వ తేదిన ఏఈ గిరిధర్‌రాజుకు ఫోన్‌ చేయగా మంగళవారం నెల్లూరుకు  వచ్చి తనతో, చంద్రమౌళితో మాట్లాడాలని సూచించారు. దీంతో జరిగిన విషయాన్ని శ్రీరామచౌదరి కాంట్రాక్టర్‌ సుందరనాయుడుకు చెప్పడంతో ఆయన  మంగళవారం నెల్లూరుకు వచ్చి ఏఈలను కలిశారు. ఈ సందర్భంగా ఎఈలు ఎం బుక్స్‌ను పరిశీలించి పంపాలంటే రూ.30వేలు, గిరిధర్‌ వద్ద ఉండే బుక్స్‌ పంపాలంటే రూ. 18వేలు ఇవ్వాలని లేదంటే బుక్స్‌ అధికారులకు పంపేది లేదని తేల్చిచెప్పారు.

వారికి లంచం ఇవ్వడం ఇష్టంలేని సుందరనాయుడు అదేరోజు జరిగిన విషయాన్ని ఏసీబీ డీఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నెల్లూరు ఇరిగేషన్‌ కార్యాలయంలో బాధితుడు రూ.48వేలు నగదును ఏఈలకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తన సిబ్బందితో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దాడుల్లో సీఐలు శివకుమార్‌రెడ్డి, శ్రీహరిరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు