కృష్ణకు గో‘దారి’పై..

24 Sep, 2019 02:46 IST|Sakshi
సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో నదీజలాల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కృష్ణాకు గోదావరి జలాల తరలింపు కోసం వివిధ ప్రత్యామ్నాయాల పరిశీలన

ప్రధానంగా దుమ్ముగూడెం నుంచి సాగర్‌కు అక్కడి నుంచి రివర్స్‌ టర్బైన్ల ద్వారా శ్రీశైలానికి నీటి తరలింపుపై సమాలోచనలు

నాగార్జున సాగర్‌లో 230 టీఎంసీల కనీస నిల్వ నిర్వహణ

ఏపీలో తెలంగాణ కానిస్టేబుళ్ల శిక్షణకు నిర్ణయం

తిరుమల బ్రహ్మోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించిన జగన్‌

సాక్షి, హైదరాబాద్‌ : వీలైనంత తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయ మార్గాలపై సీఎంలిద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం 5.10 గంటలకు ప్రగతి భవన్‌ చేరుకోగా రాత్రి 9 గంటల వరకు చర్చలు సాగాయి. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా కారు వద్దకు వచ్చి ఏపీ సీఎంకు సాదర స్వాగతం పలికారు.

దుమ్ముగూడెం నుంచి తరలింపుపై...
దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి రివర్సబుల్‌ టర్బైన్స్‌ ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని తరలించే అంశంపై 
ఈ సమావేశంలో కేసీఆర్, జగన్‌ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. నాగార్జున సాగర్‌ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా కనీసం 230 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ ఇక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి రివర్స్‌ టర్బైన్స్‌ ద్వారా నీటిని తరలించే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలియవచ్చింది. దీంతోపాటు పలు ఇతర ప్రత్యామ్నాయాలను సీఎంలు ఇద్దరూ పరిశీలించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై మరోసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్ల స్థాయిలో సమావేశాలు జరిపి సాంకేతికపరమైన అంశాలపై అధ్యయనం జరిపించాలనే అభిప్రాయానికి వచ్చారు. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే దక్షిణ తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల రైతు సమస్యలు తీరుతాయని సీఎంలిద్దరూ అభిప్రాయపడ్డారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా నదీ జలాల తరలింపు, నీటి వినియోగం జరిపే దిశగా చర్చలు సాగాయి. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని సీఎంలు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో 18 వేల పోలీసుల నియామకం ..ఏపీలో శిక్షణ
విద్యుత్, పోలీస్‌ ఉద్యోగుల విభజనతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇతర పెండింగ్‌ అంశాలపై సీఎంలిద్దరూ ఈ సమావేశంలో చర్చలు జరిపారు. తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్న నేపథ్యంలో వారందరికీ ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు స్థలం చాలనందున 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్‌ను కోరారు. ఇందుకు జగన్‌ సానుకూలంగా స్పందించారు. పోలీసులకు ఒకేసారి శిక్షణ ఇవ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలగనుంది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఆహ్వానపత్రికను సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి 

తిరుమల బ్రహ్మోత్సవాలకు రండి...
ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సావాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ వైఎస్‌ జగన్‌ ఆహ్వాన పత్రిక అందించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌తోపాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు