పట్టణానికి వార్డు సచివాలయం..

23 Jul, 2019 09:30 IST|Sakshi

పట్టణాల్లో ప్రతీ నాలుగువేల మందికి ఒక వార్డు సచివాలయం

వార్డు సచివాలయాల గుర్తింపునకు అధికార యంత్రాంగం కసరత్తు

పట్టణాల్లోనూ ‘స్థానిక’ పాలనకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగువేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటుచేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు సచివాలయాల గుర్తింపులో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏడాది అక్టోబర్‌ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణాల్లో కొత్తపాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: గ్రామ సచివాలయాల తరహాలోనే మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వార్డు సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. పట్టణాల్లో నాలుగు వేల మంది జనాభాకు ఒక వార్డు సచి వాలయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికోసం విధివిధానాలను శనివారం విడుదల చేసింది.

వార్డు సచివాలయాల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నవరత్నాలతో పాటు ఇతర ప్రభు త్వ సంక్షేమ పథకాల అమలు, పన్నుల వసూ ళ్లు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతలు వార్డు సచివాలయం పర్యవేక్షణలో సాగనున్నాయి. దీనికోసం అధికమంది పట్టణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. పట్టణాల్లో కొలువుల సందడి ప్రారంభం కానుంది.

ప్రాంతం జనాభా వార్డు సచివాలయాల సంఖ్య
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌ 3,00,000 60
నెల్లిమర్ల నగర పంచాయతీ 29,000 8
పార్వతీపురం మున్సిపాలిటీ 60,000 15
బొబ్బిలి మున్సిపాలిటీ 63,058 16
సాలూరు మున్సిపాలిటీ 54,935 14

ఇదీ పరిస్థితి... 
జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో  మొత్తం 113 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యే అవకాశముంది. జిల్లాలో ఇటీవల కార్పొరేషన్‌ హోదా దక్కించుకున్న విజయనగరంతో పాటు సాలూరు, బొబ్బి లి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో  5.70 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏటా 10.98 శాతం జనాభా వద్ధిరేటును పరిగణనలోకి తీసుకుని, ప్రతీ 4 వేల జనాభాకు ఓ వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. దీనికి అనుగుణంగా జిల్లాలో 113 వరకు వార్డు సచి వాలయాలను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఒకే వార్డులో నాలుగు వేల మంది జనాభా ఉంటే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. వార్డులో అంతకు తక్కువ మంది ఉంటే రెండు, మూడు వార్డులు కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా నుం చి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పం చాయతీల వారీగా ప్రభుత్వానికి క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు. మరోవైపు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 919 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

‘స్థానిక’ పాలన దిశగా..
వార్డు సచివాలయాల్లో పాలనా కార్యదర్శి, మౌలిక సదుపాయాల కార్యదర్శి, పారిశుద్ధ్యం, విద్య, వార్డు ప్రణాళిక, సంక్షేమం – అభివద్ధి, విద్యుత్తు, ఆరోగ్యం, రెవెన్యూ, వెనుకబడిన వర్గాల రక్షణ కార్యదర్శులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సచివాలయాలతో పాటు వాటి పరిధిలో సేవలందించనున్న వలంటీర్లపై పర్యవేక్షణను కూడా సచివాలయ ఉద్యోగులే నిర్వహిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకుని మిగిలిన అవసరాలకు సిబ్బందిని నియమించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. సచివాలయాల్లో నియామకాలకు ఈనెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు రాత– మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు కలెక్టర్‌ పర్యవేక్షణలో యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు