బాధితులకు సత్వర భరోసా

2 Nov, 2023 04:52 IST|Sakshi

విజయనగరం రైలు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండ  

సీఎం వైఎస్‌ జగన్‌ వేగవంతమైన నిర్ణయాలతో నిలిచిన జీవితాలు 

ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే ఆస్పత్రికి క్షతగాత్రులు  

అత్యవసర వైద్యంతో కొంతమందికి తప్పిన ప్రాణాపాయం 

మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా 

సాక్షి ప్రతినిధి, విజయనగరం/ఆరిలోవ (విశాఖ తూర్పు): బాధితులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనితీరు మరోసారి రుజువైంది. జెట్‌స్పీడ్‌తో ఆయన తీసుకున్న నిర్ణయాలు విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణనష్టాన్ని కనిష్టస్థాయికి తీసుకురాగలిగాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును సంఘటన స్థలికి పంపించారు.

క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని ఆదేశించారు. మిగతా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రుల కోసం రెండు వార్డులను సిద్ధం చేశారు. తీవ్ర రక్తస్రావంతో వచి్చనవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెనువెంటనే వైద్యులు తగిన చికిత్స చేశారు. దీంతో కొంతమందికి ప్రాణాపాయం తప్పింది.

సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్‌ జగన్‌ విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎక్స్‌గ్రేషియాను ప్రకటించడంలోనూ, రెండురోజుల వ్యవధిలోనే వారి చేతికి చెక్కులను అందించడంలోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవను విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.  

మానవతా దృక్పథంతో ఎక్స్‌గ్రేషియా.. 
రైల్వే శాఖ ప్రకటించిన నష్టపరిహారంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా మంజూరుచేశారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.1.30 కోట్లు, క్షతగాత్రులకు తీవ్రతను బట్టి రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను క్షతగాత్రులకు మంగళవారం, బుధవారం ఇచ్చారు. బుధవారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు కుటుంబాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శృంగవరపుకోట నియోజకవర్గం పరిధిలో ఒక కుటుంబానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెక్కు అందజేశారు. మిగతావారికి గురువారం అందించనున్నారు. 

విశాఖలో రైలు ప్రమాద బాధితులకు పరిహారం  
విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో మృతిచెందిన రైల్వేగార్డు మరిపి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ప్రజాప్రతినిధులు బుధవారం అందించారు. విశాఖపట్నం ఆరిలోవ బాలాజీనగర్‌లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి వైఎస్సార్‌సీపీ నాయకుడు గొలగాని శ్రీనివాస్, అధికారులతో కలిసి రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

హెల్త్‌సిటీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా ఇందిరాకాలనీకి చెందిన కోలా నానాజీకి రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారు. ఇక, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నల్లా కుమారికి రూ. 5 లక్షలు, రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బి.తేజేశ్వరరావుకు  రూ. 2 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్‌ అందజేశారు. 

రైలు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి 
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముర్రు లక్ష్మి (40)  మృతి చెందారు. గాజువాకకు చెందిన ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ తెలిపారు. 

కుటుంబంలో ముగ్గురూ ఒకేచోట.. 
రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ వ్యక్తి పేరు జక్కల వెంకటరమణ. ఆ పక్కనున్న బెడ్‌పై ఉన్నవారు అతని భార్య బంగారుతల్లి, చిన్నారి కుమార్తె కోమలి. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఆ కుటుంబం విజయనగరం జిల్లా గరివిడిలోని అత్తారింటికి వస్తూ ఈ ప్రమాదం బారినపడ్డారు. తండ్రి, తల్లి, చిన్నబిడ్డ.. ఇలా ముగ్గురు ఒకేచోట గాయాలతో ఉండటం చూసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బంగారుతల్లికి రూ.10 లక్షలు, వెంకటరమణకు రూ.5 లక్షలు, కోమలికి రూ.2 లక్షలు.. మొత్తం రూ. 17 లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. ఆ చెక్కులను మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అందజేశారు. 

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం  
రైలు ప్రమాదంలో నా భర్త రాము చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయాను. మా కుటుంబానికి ఆ దేవుడే దిక్కు అని కుమిలిపోయాను. అంతటి విషాదంలో ఉన్న మాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అండగా నిలబడటంతో కొండంత ధైర్యం వచ్చింది. రూ. 10 లక్షలు ఇచ్చిన ఆయనకు రుణపడి ఉంటాం. వైఎస్సార్‌ బీమా కింద మరో రూ. 5 లక్షలు సాయం అందుతుందని చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 10 వేలు ఇచ్చారు.   – మజ్జి శారద, గదబవలస, గరివిడి మండలం,  విజయనగరం జిల్లా 

చెప్పిన వెంటనే సాయమందించారు  
నా భర్త పిళ్లా నాగరాజు రైలు ప్రమాదంలో చని­పోయారు. ఎలా బతకాలో తెలియక కుటుంబమంతా రోదిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మా పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు మరచిపోం. ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పిన వెంటనే చెక్కు పంపించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.  – పిళ్లా కళావతి, కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా 

మరిన్ని వార్తలు