అనేక దేశాల కంటే.. ఏపీలోనే ఎక్కువ టెస్టులు

5 May, 2020 02:33 IST|Sakshi

జపాన్, బ్రెజిల్‌ కంటే ఎక్కువ పరీక్షలు రాష్ట్రంలో జరుగుతున్నాయి

జపాన్‌లో పది లక్షల జనాభాకు 1,377, బ్రెజిల్లో 1,597 టెస్టులు జరుగుతుంటే ఏపీలో 2,345 టెస్టులు

రాష్ట్రంలో ప్రతీ 76 పరీక్షలకు ఒక పాజిటివ్‌ నమోదు

అదే దక్షిణ కొరియాలో కేవలం 58.5 టెస్టులకే ఓ కోవిడ్‌ కేసు

అమెరికాలో అయితే ప్రతీ 6 టెస్టులకూ ఒక పాజిటివ్‌

బ్రిటన్‌లో ప్రతీ 4.7 టెస్టులకూ ఒక పాజిటివ్‌

ఏపీలో ఇన్‌ఫెక్షన్‌ రేటు కూడా తక్కువే

సాక్షి, అమరావతి: గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌.. ఇప్పుడు ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందంజలో ఉంది. పది లక్షల జనాభాకు చేస్తున్న టెస్టుల సంఖ్యలో కూడా ప్రపంచంలోని 50 దేశాల కంటే ఏపీ ఎక్కువ పరీక్షలు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. 

► ఏపీలో ప్రతీ పది లక్షల జనాభాకు 2,345 మందికి టెస్టులు చేస్తున్నారు. మే 4వ తేదీ నాటికి ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,229 పరీక్షలు నిర్వహించారు.
► అదే అభివృద్ధి చెందిన జపాన్‌ లాంటి దేశంలో పది లక్షల జనాభాకు 1,377 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. 
► బ్రెజిల్‌లో 1,597.. మన పొరుగునున్న శ్రీలంకలో 1,099 పరీక్షలు చేస్తున్నారు. ఇక మన దేశంలో సగటున పది లక్షల జనాభాకు 798 టెస్టులు చేస్తున్నారు.
► అత్యల్పంగా నైజీరియాలో 76 టెస్టులు చేస్తుండగా, అల్జీరియాలో 148 చేస్తున్నారు.

ఏపీలో సగటున 76 పరీక్షలకు ఒక పాజిటివ్‌
రాష్ట్రంలో సగటున ప్రతీ 76 పరీక్షలకు ఒక పాజిటివ్‌ నమోదవుతోంది. అదే దేశ సగటు చూస్తే కేవలం ప్రతీ 26 పరీక్షలకు ఒక పాజిటివ్‌ వస్తోంది. పలు పాశ్చాత్య దేశాలతో పోల్చినా ఏపీ చాలా మెరుగైన స్థితిలో ఉంది. ఎందుకంటే.. దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా చాలా తక్కువ టెస్టులకే పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది అనేదానికి ఇదే ఉదాహరణ. పైగా ఈ దేశాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు (పాజిటివ్‌ కేసుల శాతం) కూడా ఎక్కువగా ఉంటోంది. ఏపీలో అది కేవలం 1.32 శాతం మాత్రమే.

ఏపీలో పరిస్థితులు ఇలా..
► మే 4 నాటికి రాష్ట్రంలో జరిగిన పరీక్షలు : 1,25,229
► మిలియన్‌ జనాభాకు జరిగిన పరీక్షల సగటు : 2,345
► రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు : 1650
► పాజిటివ్‌ కేసుల శాతం : 1.32
► రాష్ట్రంలో సగటున ప్రతీ వంద మందికి మృతి చెందుతున్న కేసులు : 2 శాతం

>
మరిన్ని వార్తలు