ముంపు బాధితులను ఆదుకుంటాం

26 Sep, 2016 02:47 IST|Sakshi
ముంపు బాధితులను ఆదుకుంటాం

సీఎం చంద్రబాబు వెల్లడి
దాచేపల్లి/గురజాల రూరల్/రెంటచింతల : భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని, రెండు రోజుల్లో నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గుంటూరు జిల్లాలో ముంపునకు గుైరె న దాచేపల్లి, గురజాల, రెంటచింతలలో ఆదివారం ఆయన పర్యటించారు. నడికుడి సబ్ మార్కెట్ యార్డు  కొట్లబజార్‌లోని పలువురు దుకాణాదారులతో మాట్లాడారు. నష్టం వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం పాతబస్టాండ్ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.95,200, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5,200, పూర్తిగా దెబ్బతిన్న పూరిళ్లకు రూ.3,500 నష్టపరిహారం అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, మంగళవారం సాయంత్రంలోగా సర్వేను పూర్తి చేసిన తరువాత పరిహారం అందజేస్తామని చెప్పారు. అనంతరం గురజాలకు చేరుకుని గాడిదల వాగు ఉధృతికి ముంపునకు గురైన పంట పొలాలను సీఎం పరిశీలించారు. ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ ‘మెట్ట పంటలు వేసుకోమని 100సార్లు చెప్పినా మీరు వినడం లేదు.. నా గొంతు నెప్పి పుడుతా ఉంది.. మీరు ఇబ్బందుల్లో పడుతూ.. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నారు’అని తెలిపారు.

మరిన్ని వార్తలు