ఆ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవులు!

22 Nov, 2023 12:45 IST|Sakshi

చెన్నై: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. 

కేరళలో ఈ రెండు రోజులు(బుధ, గురువారాలు) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు.. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

కేరళ, తమిళనాడులో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జనం అవస్థలు పడుతున్నాయి. కాలనీల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  

ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?


 

మరిన్ని వార్తలు