మనసున్న మా రాజు సీఎం

2 May, 2020 13:21 IST|Sakshi
ఫిషరీస్‌ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

గుజరాత్‌ నుంచి శ్రీకాకుళానికి మత్స్యకారుల తరలింపు

12 బస్సుల్లో వచ్చినవారికి ‘నన్నయ’లో భోజన ఏర్పాట్లు

మూడు వేల కోట్లతో హార్బర్‌ అభివృద్ధికి హామీ ఇచ్చిన సీఎం

రాజానగరం: సరైన ఉపాధి లేకపోవడంతోనే తామంతా ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్‌ మాసాలలో గుజరాత్‌కు వలస పోయి, తిరిగి ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో తిరిగి వస్తుంటామని మత్య్సకారులు తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో ప్రకటించిన లాక్‌ డౌన్‌ కారణంగా గుజరాత్‌ రాష్ట్రంలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 4080 మంది మత్స్యకారులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకుగాను 54 బస్సుల్లో వారిని అక్కడ నుంచి ఆయా జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ విధంగా పయనమైన మొదటి విడతగా 12 బస్సుల్లో వచ్చిన 890 మంది మత్స్యకారులకు రాజమహేంద్రవరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం మధ్యాహ్నం రెవెన్యూ అధికారులు భోజన సదుపాయాలను కల్పించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ కారణంగా గుజరాత్‌లో తాము తిండికి, బట్టకు అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఈ విషయాన్ని వీడియో ద్వారా సీఎం జగన్‌కి తెలియజేయడంతో ఆయన వెంటనే తమకు దుప్పట్లు, దొంతర్లు పంపించారన్నారు.

అంతేకాకుండా 54 బస్సుల్లో అందరినీ స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు కూడా చేశారన్నారు. జీవనోపాధి కోసం ఈ విధంగా ప్రతి ఏటా వెళ్తున్నామని తెలుసుకున్న ఆయన తమ ప్రాంతంలో హార్బర్‌ని రూ.మూడు వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు కూడా హామీ ఇచ్చారన్నారు. తమ కోసం ప్రభుత్వపరంగా చేస్తున్న కృషికి, తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం ఉదయంలోగా మిగిలిన వారు కూడా జిల్లాలకు చేరుకుంటారని జిల్లా మత్స్యకార శాఖ డైరెక్టర్‌ కోటేశ్వర్రావు తెలిపారు. ఈ సందర్భంగా మత్సకారులను రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ కలుసుకుని వారికి మానసిక ధైర్యాన్నిస్తూ, మాస్కులు అందజేశారు. 

మరిన్ని వార్తలు