తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యాలు

18 Sep, 2019 04:21 IST|Sakshi

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై సర్కారు ప్రణాళిక 

అందుకనుగుణంగా డీపీఆర్‌ రూపకల్పన బాధ్యత కేఎఫ్‌డబ్ల్యూకి.. 

విజయవాడలో రెండు కారిడార్లకు ప్రాధాన్యత 

దేశంలోనే మెరుగ్గా ఉండాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ 

మూడు కారిడార్లు ఇవే.. 
1. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రైల్వేస్టేషన్, రామవరప్పాడు రింగు రోడ్డు మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ 26 కి.మీ.  
2. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకూ 12.5 కి.మీ.  
3. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి కేసీ కెనాల్‌ జంక్షన్‌ మీదుగా అమరావతి వరకూ 24 కి.మీ.  

సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును సాధ్యమైనంత తక్కువ వ్యయంలో ఎక్కువ సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును భారీ వ్యయంతో చేపట్టాలని నిర్ణయించి ప్రణాళికలు రూపొందించినా అవి కార్యరూపం దాల్చలేదు. మీడియం మెట్రో రైలు వ్యవస్థను రూ.7,200 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు మెట్రో శ్రీధరన్‌ నేతృత్వంలోని డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌) సవివర నివేదిక రూపొందించి ఇవ్వగా, దానిపై టెండర్లు కూడా పిలిచి నిర్మాణ సంస్థను ఖరారు చేసే దశలో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాము చెప్పిన సంస్థకే నిర్మాణ బాధ్యతను అప్పగించాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసినా శ్రీధరన్‌ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మీడియం మెట్రో రైలు ప్రతిపాదనను ఉపసంహరించుకుని లైట్‌ మెట్రోను ముందుకు తెచ్చింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఆధ్వర్యంలో లైట్‌ మెట్రో రైలు వ్యవస్థపై సవివర నివేదిక తయారు చేసే బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థకి అప్పగించగా విజయవాడలో రెండు, విజయవాడ నుంచి అమరావతికి మరో కారిడార్‌ నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది.  

సీఎం సూచనలకు అనుగుణంగా మార్పులు.. 
ఈ ప్రణాళికపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏఎంఆర్‌సీ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. గతంలో విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రైల్వేస్టేషన్, రామవరప్పాడు రింగు రోడ్డు మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ 26 కి.మీ. మేర ఒక కారిడార్, పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకూ 12.5 కి.మీ. మేర మరో కారిడార్, పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి కేసీ కెనాల్‌ జంక్షన్‌ మీదుగా అమరావతి వరకూ 24 కి.మీ. మేర మూడో కారిడార్‌ నిర్మించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేశారు. మూడో కారిడార్‌ను భూగర్భంలో నిర్మించాలనే ప్రతిపాదనపై వెడల్పైన రోడ్లు ఉండగా భూగర్భ మార్గం అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. నేల మీద కి.మీ.కు రూ.120 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉండగా భూగర్భ మార్గంలో కి.మీ.కు రూ.450 కోట్లు అవుతుంది కాబట్టి నేల మీదే మెట్రో మార్గానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఎలివేటేడ్‌ రైలు మార్గంలో ఎక్కడా విద్యుత్‌ లైన్లు, వైర్లు బయటకు కనపడకుండా చూడాలని సూచించారు. దేశంలో మిగతా మెట్రో రైలు కారిడార్ల కంటే మరింత మెరుగ్గా, డిజైన్లు ఆకర్షణీయంగా, అత్యాధునికంగా ఉండేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఎక్కువ వ్యయం కాకుండా చూడాలని ఆదేశించారు. 

రెండు మూడు దశల్లో మెట్రో రైలు 
రెండు, మూడు దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా డీపీఆర్‌ను సవరించే బాధ్యతను కేఎఫ్‌డబ్ల్యూ సంస్థకే అప్పగించాం. నెల రోజుల్లో ఈ సంస్థ డీపీఆర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీపీపీ విధానంలో చేపట్టాలా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలా అనే దానిపై డీపీఆర్‌ వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.  
    – రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌  

మరిన్ని వార్తలు