అందరికీ ‘జగనన్న అమ్మ ఒడి’ 

5 Nov, 2019 04:21 IST|Sakshi

విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు రెసిడెన్షియల్‌ సంస్థలకూ వర్తింపు 

దారిద్య్రరేఖకు దిగువన ఉండే ప్రతి తల్లికీ ‘జగనన్న అమ్మ ఒడి’ కింద రూ.15 వేలు 

సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు  పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో 79ను విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్,  ప్రయివేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్‌) వరకు చదువుతున్న విద్యార్ధుల తల్లులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2019–20) నుంచే ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అందించనున్నారు. తల్లి లేకుంటే ఆ పిల్లల అధికారిక సంరక్షకునికి ఈ మొత్తాన్ని ఇస్తారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు సైతం ఈ సహాయం అందనుంది. పాఠశాలల్లో చేరికల, హాజరు పెంపు, సమాన విద్యావకాశాల కల్పన, ఉత్తమ బోధనా ప్రమాణాల సాధన లక్ష్యంగా ‘జగనన్న అమ్మ ఒడి పథకాన్ని’ ప్రభుత్వం అమలు చేయనుంది. తద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే బలమైన విద్యాపునాదులు ఏర్పడతాయని ప్రభుత్వం అభిలషిస్తోంది.

అమ్మఒడి పథకం అర్హతలు
- కుటుంబంలోని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది.
ఆ కుటుంబానికి ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
లబ్ధిదారుడు/తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి
ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న ఆ కుటుంబంలోని పిల్లలకూ ఆధార్‌ కార్డు ఉండాలి.
రేషన్‌ కార్డులోని సమాచారాన్ని 6 దశల్లో పరిశీలించి ధ్రువీకరిస్తారు.
స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో ప్రవేశం పొందిన అనాథలు/వీధి పిల్లలకు ఈ ప్రయోజనాన్ని సంబంధిత శాఖలతో సంప్రదించి అమలుచేస్తారు.
విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి.
సమన్వయంతో కూడిన వ్యవస్థ ద్వారా విద్యార్థులు, లబ్ధిదారులను గుర్తిస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు.

చెల్లింపు విధానం ఇలా..
అర్హులైన ప్రతి లబ్ధిదారు జాతీయ బ్యాంకులో లేదా పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతా కలిగి ఉండాలి.
అర్హులైనవారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో రూ.15వేలు జమ అవుతుంది.
ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేస్తారు. దీన్ని కమిషనర్, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌కు లింకు చేస్తారు.
ఆయా విద్యాసంస్థలు అందించే విద్యార్ధుల డేటాను చైల్డ్‌ ఇన్ఫో, యూడైస్, సివిల్‌ సప్లయ్‌ డేటాలతో సరిపోల్చుతారు.
ఆ డేటాను సంస్థ తరఫున ఉండే తనిఖీ అధికారి ధ్రువీకరించాలి.
అనంతరం డీఈఓ, జిల్లా వృత్తి విద్యాధికారి, ప్రాంతీయ విద్యాధికారుల పరిశీలన అనంతరమే లబ్ధిదారుల ఖాతాలోకి జమచేస్తారు.
గ్రామ వలంటీరు స్కూలు డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలి. తన పరిధిలో తల్లి, లేదా సంర„ýుకుడిని వలంటీరు గుర్తించాలి. నిర్ణీత ప్రొఫార్మాలో వారి వివరాలు సేకరించి, ఎంఈఓలకు సమర్పించాలి.
డీఈఓ, ప్రాంతీయ విద్యాధికారి, వృత్తి విద్యాధికారి, జిల్లా కలెక్టర్లకు సంబంధిత లబ్ధిదారుల డేటాను సమర్పించాలి.
పథకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులు, లబ్ధిదారులే బాధ్యులు.
డేటా విశ్లేషణ, ఇతర కార్యకలాపాలకు ఐటీ, సివిల్‌ సప్లయిస్, రియల్‌ టైమ్‌ గవర్నెన్సు విభాగాలు సాంకేతిక సహకారంతో పనిచేయాలి. 
లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు వీలుగా ప్రదర్శించాలి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా