దోపిడీకి ‘పవర్‌’ఫుల్‌ బ్రేక్‌

25 Sep, 2019 04:38 IST|Sakshi

పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి అప్పగింత

ఆరు నెలల్లో కొత్త టారిఫ్‌ 

అప్పటిదాకా యూనిట్‌ పవన విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.2.43 

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ 

ఏపీఈఆర్‌సీ ముందు సమర్థంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్న అధికారులు 

సాక్షి, అమరావతి: ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్ల పేరిట సాగుతున్న దోపిడీకి కళ్లెం వేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ప్రజలకు చౌకైన విద్యుత్‌ ఇవ్వాలన్న సర్కారు లక్ష్యానికి అత్యున్నత న్యాయస్థానం తీర్పు బలాన్నిచ్చింది. పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి(ఏపీఈఆర్‌సీ) అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిపుణులు స్వాగతిస్తున్నారు. ఆరు నెలల్లో కమిషన్‌ విచారణ పూర్తయి, కొత్త టారిఫ్‌ ఇచ్చే వరకూ పవన విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని సూచిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు ఏపీఈఆర్‌సీ ముందు తమ వాదన బలంగా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. 

కేంద్రం సూచించిన దానికన్నా అధికంగా కొనుగోలు 
గత ప్రభుత్వం పవన విద్యుత్‌కు అత్యధిక ధర చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో పవన విద్యుత్‌ కొనుగోలును ప్రోత్సహించింది. దీనికోసం తక్కువ ధరకు లభించే ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌కు సైతం కోత పెట్టారు. పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్లను అడ్డగోలుగా ప్రోత్సహించడం వల్ల గత ఐదేళ్లలో విద్యుత్‌ సంస్థలపై(డిస్కంలు) రూ.5,497.3 కోట్ల అదనపు భారం పడింది. మార్కెట్‌లో థర్మల్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.4.20కే లభిస్తోంది. కానీ, పవన విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.84 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో పవన, సౌర విద్యుత్‌ కలిపి 13,142 మిలియన్‌ యూనిట్లు ఉంటోంది. ఇందులో పవన విద్యుత్‌ వాటా 9,000 మిలియన్‌ యూనిట్లు. 

పవన విద్యుత్‌ అంశంలో ఎవరి పాత్ర ఎంత?  
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రైవేటు విద్యుత్‌ దోపిడీ నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రైవేటు సంస్థల నుంచి కరెంటు కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీలోనే పవన విద్యుత్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. కరెంటు కొనుగోళ్ల పేరిట సాగుతున్న దోపిడీని అరికట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను పవన విద్యుత్‌ ఉత్పత్తిదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర స్థాయిలో రాష్ట్రానికి లేఖలు రాయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టులో ప్రభుత్వం బలమైన వాదనలు విన్పించగలిగింది. పవన విద్యుత్‌ వల్ల వినియోగదారులకు జరిగే నష్టమేంటో చెప్పడంలో సఫలమైంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి విద్యుత్‌ అధికారులతో భేటీ అయ్యారు. పవన విద్యుత్‌ విషయంలో శాస్త్రీయ వాదనను ఏపీఈఆర్‌సీ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పరిమితికి మించి పవన విద్యుత్‌ను ప్రోత్సహించడంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలోనూ ఆయన విచారణ చేపట్టారు. ఇప్పటికే కొందరు అధికారులకు సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. అధికారులపై ఎవరి ఒత్తిడి పనిచేసిందనే విషయాలను రాబడుతున్నారు. 

న్యాయ విచారణ చేపట్టాలి 
‘‘హైకోర్టు తీర్పు హర్షణీయం. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌కు వెళ్లకుండా యూనిట్‌ రూ.4.84 చొప్పున జనరిక్‌ టారిఫ్‌ ఇవ్వడానికి ఏపీఈఆర్‌సీ ఎందుకు సాహసిందనేది తేల్చాల్సి ఉంది. దీని వెనుక ఎవరికి ఎలాంటి మేలు జరిగింది? అనేది బయటపడాలి. గత ఐదేళ్లలో జరిగిన పవన విద్యుత్‌ కొనుగోళ్లపై న్యాయ విచారణ చేపట్టాలి.’’    
 – వేణుగోపాల్, విద్యుత్‌ రంగ విశ్లేషకులు

వినియోగదారులకు మేలు 
‘‘పవన విద్యుత్‌ ధరను యూనిట్‌కు రూ.2.43కు తగ్గిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది. విద్యుత్‌ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం సాహసోపేతంగా అడుగులు వేయడం అభినందనీయం’’ 
– వేదవ్యాస్, ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

పీపీఏలను తప్పకుండా సమీక్షించాలి 
‘‘విద్యుత్‌ సంస్థలను బతికించాలన్న నిజాయతీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. పవన విద్యుత్‌ ధరలను సమీక్షించాలన్న ఆలోచనను ప్రజల కోణం నుంచి చూడాలి. కేంద్రంతో సహా ఎవరు అడ్డుపడ్డా ప్రజలకు నష్టమే. అవసరం ఉందా లేదా అనేది చూడకుండా, వ్యక్తుల అవసరాల కోసమే చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) తప్పకుండా సమీక్షించాలి.        
– టీవీ రావు, జన విజ్ఞాన వేదిక, జాతీయ ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు