బాబు బెయిల్‌ తీర్పులో ఏముంది?.. కొన్ని సందేహాలు.. అనుమానాలు!

21 Nov, 2023 12:56 IST|Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చిన తీరు ఆసక్తికరంగా ఉంది. గౌరవ న్యాయస్థానానికి, న్యాయమూర్తి గారికి ఉద్దేశాలు ఆపాదించకుండా తీర్పును విశ్లేషించుకోవచ్చు. మొత్తం ఈ తీర్పును పరిశీలిస్తే అనేక సందేహాలు వస్తాయి. ఈ తీర్పు ప్రభావం వల్ల ఎవరైనా  అవినీతికి పాల్పడినా తేలికగా తప్పించుకునే అవకాశం ఉంటుందా అన్న అనుమానం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా, ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా బెయిల్ ఇవ్వదలిస్తే కోర్టువారు ఇవ్వవచ్చు. అంతవరకు ఆక్షేపణీయం కాదు. కాని తీర్పులో పేర్కొన్న అంశాలలో కొన్ని హేతుబద్దంగా కనిపించడం లేదు.. తీర్పులో కొన్ని విషయాలు పరస్పర విరుద్దంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

✍️సీఐడీ కేసు పెట్టడంలో రాజకీయంగా కక్ష లేదని చెప్పడం వరకు ఒకే. అదే సమయంలో  చంద్రబాబుకు ఎలాంటి కండిషన్‌లు పెట్టకుండా బెయిల్ ఇవ్వడమే ఆశ్చర్యమనిపిస్తుంది. అవినీతికి పాల్పడినట్లు అభియోగాలకు గురైన వ్యక్తి రాజకీయ పార్టీ నడుపుతుంటే ఆయనకు పలు మినహాయింపులు ఇవ్వవచ్చన్న సంప్రదాయం ఎక్కడైనా ఉంటుందా?. ఆరోగ్య పరిస్థితిపై బెయిల్ తీసుకున్న వ్యక్తి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చని ఎలా చెబుతారు? ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయిన మంత్రులకు నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. కాని ఏపీలో పలు స్కామ్‌లలో చంద్రబాబుతో సహా ఆయా  నిందితులకు ఎలా బెయిల్ వచ్చేస్తోంది?

✍️కొందరు నిందితులు సీఐడి విచారణకే ఎగవేసినా కోర్టులు ఉదాసీనంగా ఉండడం కరెక్టేనా?. ఇలాంటి విషయాలలో ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడం సరైనదేనా?. అన్న ప్రశ్నలు వస్తాయి. చంద్రబాబు ఈ కేసులో ఎవరిని ప్రభావితం చేయరన్న భావనకు ఉన్నత  న్యాయ స్థానం ఎలా వచ్చింది అర్దం కాదు. కేసులో మెరిట్స్ ప్రకారం కింది కోర్టు విచారణ చేసుకోవచ్చని చెబుతూనే, కేసులో చేసిన పలు అబ్జర్వేషన్స్  ప్రభావం చూపవా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.  ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒవర్ స్టెప్డ్ జడ్జిమెంట్ అని ఒక సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు.

✍️తీర్పులో అవసరం లేని చర్చను చేసినట్లు అనిపిస్తుందని కొందరు అంటున్నారు. చంద్రబాబుకు నిర్దిష్ట షరతులతో బెయిల్ ఇచ్చి, మిగిలిన విచారణ కింది కోర్టుకు వదలిపెడితే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అలాకాకుండా కేసులోని కొన్ని పూర్వాపర అంశాలను చర్చించడం సమస్య కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి కారణమైన ప్రైవేటు ఆస్పత్రి మెడికల్ రిపోర్టును కోర్టు పరిగణనలోకి తీసుకుంటే తర్వాత కాలంలో ఇలాంటి కేసులలో చిక్కి  అరెస్టు అయిన  ప్రతివారు ప్రైవేటు ఆస్పత్రి రిపోర్టులను తీసుకు వచ్చి బెయిల్ పొందడానికి ఆస్కారం ఉండవచ్చు. అది ఒక ప్రిసెడెన్స్ గా మారవచ్చు.

✍️ఆ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదిక వాస్తవం అయినదైతే చంద్రబాబు కదలకుండా మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. అదే డాక్టర్‌లు చంద్రబాబు తన టూర్‌లలో ప్రత్యేక అంబులెన్స్, నిపుణులైన వైద్యులను పెట్టుకుని తిరగవచ్చని చెప్పారు. ఇది పరస్పర విరుద్దంగా ఉంది. దీని గురించి కోర్టువారు ప్రశ్నించి ఉంటే బాగుండేది. అలా చేయకపోగా చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చని బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చారని ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఆస్పత్రి సర్టిఫికెట్ నమ్మదగిందే  అయితే చంద్రబాబు ర్యాలీలలో పాల్గొని ఆవేశపడితే ఆయన గుండె  మరింత డామేజీ అయ్యే అవకాశం ఉంటుంది కదా! అది వాస్తవ నివేదిక కాకపోతే , చంద్రబాబు యథాప్రకారం ఏ ఇబ్బంది లేకుండా టూర్లు చేస్తే కోర్టును తప్పుదారి పట్టించినట్లు అవ్వదా?

✍️కంటి చికిత్స కోసం బెయిల్ దరఖాస్తు చేసి, ఆ తర్వాత దానిని గుండె సమస్య వరకు తీసుకువెళ్లడం, కనీసం ప్రత్యేక మెడికల్ బోర్డుకు, లేదా ఢిల్లీ ఎయిమ్స్ వంటి ఆస్పత్రికి కేసును రిఫర్ చేయడం వంటివి చేయకుండా గౌరవ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం అంటే విష్తుపోయే పరిస్థితి అని కొందరు అంటున్నారు.. నిజానికి  ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన నివేదిక సంగతి అలా ఉంచి, ఢిల్లీలోని ఎయిమ్స్ వంటి సంస్థకు చంద్రబాబును పంపించి పరీక్షలు చేయించి ,తదుపరి ఆయన ఆరోగ్యం గురించి నిర్దారణ చేసి ఉంటే ప్రజలలో విశ్వసనీయత వచ్చేదని చెబుతున్నారు. మరో  విశేషం ఏమిటంటే టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి 77 కోట్లు వచ్చాయని సీఐడీ చేసిన అభియోగానికి బ్యాంక్ స్టేట్ మెంట్ లను ప్రస్తావిస్తూనే ప్రాథమిక ఆధారాలు కనిపించలేదని అనడం చర్చనీయాంశంగా ఉంది. అలాగే  ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసును కూడా సాక్ష్యంగా తీసుకోకపోవడం కూడా గమనించవలసిన విషయం. ప్రైవేటు ఆస్పత్రి సంస్థ రిపోర్టును కోర్టువారు నమ్మడం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వాదనను విశ్వసించకపోవడం సమాజానికి మంచి సంకేతం ఇవ్వకపోవచ్చు

✍️టీడీపీ ఖాతాలోకి నగదు జమ జరిగిందా? లేదా? అన్నదానిపై కోర్టువారు విస్తృతంగా పరిశీలించి ఉండాల్సింది. నిధులు విడుదల చేయమని చెప్పినంత మాత్రాన ఉల్లంఘననలలో పాత్ర ఉందని అనలేమని కోర్టువారు అనడం కూడా అభ్యంతరకమేనని కొందరు లాయర్లు అభిప్రాయపడ్డారు. సీఎం చెప్పడం వల్లే నిధులను విడుదల చేశామని అధికారులు ఫైళ్లలో స్పష్టంగా రాసిన తర్వాత ఆయన ప్రమేయం ఉందా అన్న సంశయం ఎలా వస్తుందన్న ప్రశ్న ఎదురవుతుంది. ఏసీబీ కోర్టుకు కనిపించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నత కోర్టుకు కనిపించకపోవడం ఏమిటో తెలియదు. సాక్షులను ప్రభావితం చేస్తారనడానికి ఆధారాలు లేవంటున్న కోర్టువారు ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు సీఐడీ నోటీసు ఇచ్చిన తర్వాత అమెరికా ఎలా పరారయ్యారన్న దానిపై దృష్టి పెట్టి ఉండాల్సిందేమో!

✍️శ్రీనివాస్‌పై విచారణకు చట్టపరమైన చర్య తీసుకోవచ్చని కోర్టు చెప్పినా, అది అంత తేలిక కాదన్న సంగతి తెలిసిందే. మరో  నిందితుడు మనోజ్ పార్ధసాని కూడా దుబాయి పారిపోయిన దాని గురించి కోర్టువారు ఎలా చూశారో అర్ధం కాలేదు. కోర్టువారు తమ అబ్జర్వేషన్ ఆధారంగా ఏసీబీ కోర్టు కేసు విచారణ చేయనవసరం లేదని చెప్పినా, దాని ప్రభావం పడకుండా ఉంటుందా అన్నది డౌటేనని చెబుతున్నారు. గతంలో అవినీతి కేసులలో కోర్టులు ఇచ్చిన బెయిల్ తీర్పులకు, చంద్రబాబు కేసులో వచ్చిన తీర్పునకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

✍️దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కాని, ఇతర టీడీపీ నేతలు కాని చేసిన వ్యాఖ్యలు చూస్తే మరీ ఘోరంగా ఉన్నాయి. అసలు కేసు మొత్తాన్ని హైకోర్టు కొట్టివేసినట్లు, సీఐడీ పెట్టిన కేసులోని వివరాలు ఫేక్ అని కోర్టు తెలిపినట్లు వ్యాఖ్యానించడం చూస్తే అబద్దాలు చెప్పడంలో కొత్త రికార్డులు సృష్టించేలా ఉన్నారు. కొద్ది కాలం క్రితం చంద్రబాబుకు బెయిల్ రాకుండా వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్  ప్రభుత్వం మేనేజ్ చేస్తోందని లోకేష్ ఆరోపించారు. అయినా కోర్టులు పట్టించుకోలేదు. మరి ప్రజలు ఇప్పుడు లోకేష్‌ను ఈ బెయిల్ విషయమై ప్రశ్నిస్తే సమాధానం ఏమి వస్తుంది?


::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు