మెట్రో దూకుడు

2 Jul, 2015 00:55 IST|Sakshi
మెట్రో దూకుడు

రెండు నెలల్లో పేపర్ వర్క్ పూర్తి
నాలుగు నెలల్లో పనులు ప్రారంభం
సిద్ధం కావాలని డీఎంఆర్‌సీకి ప్రభుత్వం లేఖ
సిబ్బందిని సమకూర్చుకుంటున్న శ్రీధరన్ బృందం
8న ఢిల్లీలో ప్రాథమిక సమావేశం

 
మెట్రో ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌కి లేఖ కూడా రాసింది. దీంతో రెండు నెలల్లో ప్రాజెక్టు పేపర్ వర్క్ పూర్తి చేయడానికి డీఎంఆర్‌సీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పనులు ప్రారంభించడానికి నాలుగు నెలలు పడుతుందని చెబుతున్నారు.
 
విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్)కి సూచించింది. ఈ మేరకు లేఖ అందుకున్న డీఎంఆర్‌సీ పనులు చేపట్టడానికి అవసరమైన
 ప్రాథమిక వనరులను సమకూర్చుకోవడానికి సమాయత్తమైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో సమావేశమై ప్రాజెక్టు గురించి చర్చించిన శ్రీధరన్ బృందం ఈ నెల ఎనిమిదో తేదీన మరో కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వంతో కుదుర్చోవాల్సిన ఒప్పందం, నిధుల సమీకరణ, ప్రాజెక్టు విధివిధానాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రాజెక్టుకు అయ్యే రూ.6,823 కోట్ల వ్యయంలో 40 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించాలని ఇప్పటికే నిర్ణయించాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా సంస్థ నుంచి రుణంగా తీసుకోవాలని భావించి వారితోనూ చర్చలు జరిపారు. పనులు మొదలు పెట్టడానికి తొలుత ప్రభుత్వం కొంత నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ అంశాలన్నింటిపైనా సమావేశంలో చర్చించి వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పిస్తారు. అనంతరం కొద్దిరోజుల్లోనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకు అయ్యే మొత్తంలో ఆరు శాతాన్ని డీఎంఆర్‌సీ ఫీజుగా తీసుకుంటుంది. పనులన్నింటినీ దాదాపు కన్సల్టెన్సీలు, ఇతర కంపెనీలకు అప్పగించి డీఎంఆర్‌సీ పర్యవేక్షణ చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ ఒప్పందంలో చేర్చే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వాటితో సంబంధం లేకుండా పనులు ప్రారంభించడానికి డీఎంఆర్‌సీ ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం కూడా ఇందుకు మౌఖికంగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో ప్రాజెక్టు పేపర్ వర్క్‌ను పూర్తి చేయడానికి డీఎంఆర్‌సీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించడానికి నాలుగు నెలలు పడుతుందని డీఎంఆర్‌సీ అధికారులు చెబుతున్నారు.

సీఈ నేతృత్వంలో ప్రాజెక్టు పనులు
మెట్రో పనులు మొత్తం ఒక చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో జరగనున్నాయి. రైల్వేలో అనుభవం ఉన్న సీనియర్ చీఫ్ ఇంజనీర్‌ను డీఎంఆర్‌సీ త్వరలో నియమించనుంది. సవివర నివేదిక రూపకల్పన దశ నుంచే ఒక డెప్యూటీ డెరైక్టర్ (డెప్యూటీ చీఫ్ ఇంజనీర్) పనిచేస్తుండగా వారం క్రితం మరో డెప్యూటీ డెరైక్టర్‌ను నియమించింది. త్వరలో 30 నుంచి 40 మంది సిబ్బందిని నియమించనున్నారు. నగరంలో మెట్రో కార్యాలయాన్నీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు