అదే.. ‘సమ్మె’ట

10 May, 2015 01:03 IST|Sakshi
శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి బారులుతీరిన ప్రయాణికులు

విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు ఆదేశం
సమ్మె చట్టబద్ధమే...  ఆపబోమంటున్న కార్మిక సంఘాలు

 
{పజల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కార్మిక సంఘాలకు నోటీసులు.. విచారణ మంగళవారానికి వాయిదా
సమ్మెను ఉధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు
డిపోల వద్ద వంటావార్పు.. ర్యాలీలు, ధర్నాలతో నిరసనలు

 
హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. కార్మికులంతా డిపోల వద్ద వంటావార్పు, ధర్నాలు, ర్యాలీలతో నిరసనలు తెలుపుతున్నారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ మూలకూ సరిపోక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఆర్టీసీ ర్మికుల సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కార్మికులను ఆదేశించింది. సమ్మెతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారి కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సీఎల్ వెంకటరావు, మహ్మద్‌గౌస్ శనివారం హైకోర్టులో అత్యవసరంగా హౌజ్‌మోషన్ రూపంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో ఈ వ్యాజ్యాలను జస్టిస్ భాను నేతృత్వంలోని ధర్మాసనం తమ ఇంటి వద్దే విచారించింది. ఈ సందర్భంగా వెంకటరావు తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నెల 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష జరుగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముందని కోర్టుకు వివరించారు. అనంతరం ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం సమ్మె విరమించాల్సిందిగా కార్మికులను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

మరింత ఉధృతం..: ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం కూడా ఉధృతంగా సాగింది. తెలంగాణవ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కలేదు. రాజధాని హైదరాబాద్ సహా మొత్తంగా 2,500 బస్సులను మాత్రమే అధికారులు తిప్పగలిగారు. కార్మికులంతా డిపోల వద్ద వంటావార్పు, సామూహిక భోజనాలతో నిరసన తెలిపారు. దాదాపు పది వరకు బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలాపార్కులో ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో  ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళన చేశారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ డిపోల ఎదుట కార్మికులు వంటావార్పు నిర్వహించారు. మెదక్ జిల్లాలో పోలీసుల సహకారంతో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించినా కార్మికులు అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ముగ్గురుకార్మికులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోకార్మికులు ర్యాలీలతో నిరసన తెలిపారు. ఇక హైదరాబాద్ పరిధిలో శనివారం 631 బస్సులను నడిపించినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  నగర పరిధిలోని అన్ని డిపోల వద్ద కార్మికులు వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. కంటోన్మెంట్ డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పాల్గొని.. సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు 14న జరగనున్న ఎంసెట్‌కు 1,000 బస్సులను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.
 
సమస్యలను పట్టించుకోరా: ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ కార్మికుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని, చర్చలకు పిలిచిన ఎండీ అర్ధాంతరంగా వెళ్లిపోయారని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ విమర్శించారు.శనివారం హైదరాబాద్‌లోని ఈయూ కార్యాలయంలో నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ సంఘం గౌరవ అధ్యక్షుడు, మంత్రి హరీశ్‌రావు కూడా సమ్మెకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.
 
రంగంలోకి ముగ్గురు మంత్రులు..
 
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమ్మెపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా జోక్యం చేసుకోలేదు. రెండు దఫాలుగా రవా ణా మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రమే కార్మిక సంఘాలతో చర్చించారు. అయితే ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, టీఎంయూ నేతల మధ్య ఘర్షణ వాతావరణంతో కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులతో చర్చించాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. దీంతో మహేందర్‌రెడ్డికి తోడుగా మంత్రులు ఈటల, నాయిని రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి శనివారం సాయంత్రం టీఎంయూ నేతలకు సమాచారం అందించారు. ఆదివారం చర్చలకు సంబంధించి సమాచారమిస్తామని వెల్లడించారు. కాగా తమ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు సమ్మెకు పరోక్షంగా మద్దతిస్తున్నారని టీఎంయూ ప్రధా న కార్యదర్శి అశ్వత్థామరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే సమ్మె సమయంలో పోలీసులు తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, దీనిపై హరీశ్‌రావు పోలీసులతో మాట్లాడారని.. ఈ విషయంలోనే ఆయన మద్దతు తమకుందని పేర్కొన్నానని అశ్వత్థామరెడ్డి వివరణ ఇచ్చారు.
 
 ఇదేం తీరు: టీడీపీకి ఉమ్మారెడ్డి ప్రశ్న

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె అంశంలోనూ టీడీపీ ప్రాంతాలవారీగా మాట్లాడుతోందని వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించి, సమ్మెను ప్రభుత్వమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆర్టీసీ సమ్మెపై సీఎంసహా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు.
 
వారి డిమాండ్లు పరిష్కరించాలి: జానా


నల్లగొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి అన్నారు. సమ్మె కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శనివారం నల్లగొండలోని ఎంపీ గుత్తా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మరిన్ని వార్తలు