బాక్సైట్ ఉద్యమాన్ని అణిచేందుకే అక్రమ అరెస్టులు

13 Jan, 2016 23:31 IST|Sakshi
బాక్సైట్ ఉద్యమాన్ని అణిచేందుకే అక్రమ అరెస్టులు

ఆరు రోజులైనా తమవారి
జాడ చెప్పకపోవడం అన్యాయం
ఐటీడీఏ పీవో ఎదుట గోడు వెళ్లబోసుకున్న గిరిజన కుటుంబాలు

 
పాడేరు రూరల్: గిరిజన ప్రాంతంలో బాక్సైట్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ఆరోపించారు. ఆయన బుధవారం స్థానిక గిరిజన సంఘ కార్యాలయంలో బాధిత గిరిజన కుటుంబాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.  జీకేవీధి మండలం జర్రెల పంచాయతీ మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణను మావోయిస్టులు హత్య చేయడం వెనుక గిరిజనుల హస్తం ఉందని ఆరోపిస్తూ అమాయక గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. జర్రెల పంచాయితీ కోండ్రుపల్లి గ్రామానికి చెందిన 10 మంది గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకొని 6 రోజులవుతున్నా వారి జాడ బైట పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణ పేరుతో అమాయక గిరిజనులను అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

గిరిజనులు సాగు చేస్తున్న అపరాలు, కాఫీ గింజలు చేతికొచ్చిన సమయంలో గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబాలకు తిండి గింజలు కూడా కరువయ్యాయని చెప్పారు. అదుపులోకి తీసుకున్న గిరిజనులను నేటికీ కోర్టులో హాజరుపర్చకుండా మానవహక్కులను పోలీసులు హరిస్తున్నారని,  నిర్బంధంలో ఉన్న గిరిజనుల యోగక్షేమాలు వారి కుటుంబాలకు తెలియజేయకపోవడంతో బాధిత కుటుంబాలు తిండీ తిప్పలు లేకుండా పిల్లా పాపలతో పస్తులు ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని  ఆవేదన వ్యక్తంచేశారు. అదుపులో ఉన్న గిరిజనులకు హాని జరిగితే గిరిజన ప్రాంతం భగ్గుమంటుందని హెచ్చరించారు. ఈ విషయంపై  ప్రభుత్వం, జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జోక్యం చేసుకొని పోలీసుల అదుపులో ఉన్న గిరిజనులను విడిపించి, రక్షణ కల్పించాలని,  అక్రమంగా గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 
విడుదల చేయండి.. లేదా కోర్టులో హాజరుపర్చండి

చింతపల్లి రూరల్: పోలీసుల నిర్బంధంలో ఉన్న  వైఎస్సార్‌సీపీ నాయకులను విడుదలైనా చేయండి.. లేదా కోర్టులో  హాజరుపర్చడని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. ఆమె బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జీకేవీధి  మండల  వైఎస్సార్‌సీపీ కన్వీనర్ అడపా విష్ణుమూర్తి, జర్రెల ఎంపీటీసీ భర్త, పార్టీ మండల కార్యదర్శి ప్రసాద్‌లను అక్రమ నిర్బంధంలో ఉంచి కుటుంబీకులకు సైతం ఆచూకి తెలపకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారనే నెపంతో సంబంధం లేని తమ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకున్న వారిని   కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ ఆరు రోజులుగా తమ పార్టీ నాయకులతోపాటు అదే ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆచూకీ చెప్పకపోవడం పోలీసులు చేస్తున్న దమన నీతికి నిదర్శనమని దుయ్యబట్టారు. గిరిజనుల నిర్బంధంపై మానవహక్కుల సంఘాన్ని కూడా కలవనున్నామని, ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు.

బాధిత కుటుంబాలకు ఓదార్పు : జర్రెల సంఘటనలో పోలీసు ల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకుల కుటుంబాలను బుధవారం  ఎమ్మెల్యే ఓదార్చారు. జెడ్పీటీసీ పద్మకుమారి గృహంలో కుటుంబీకులను ఓదార్చుతూ, ఆదివాసీ కుటుంబాలన్నింటికీ అందుబాటులో ఉంటానని, మీ కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడానని భయపడవద్దని ధైర్యం చెప్పారు.  ఈ కార్యక్రమంలో జర్రెల సర్పంచ్ విజయకుమారి, పార్టీ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.
 
పీవో ఎదుట గోడు వెల్లబోసుకున్న గిరిజనులు

పోలీసుల అదుపులో ఉన్న తమ కుటుంబ సభ్యులను బేషరతుగా విడుదల చేసేందుకు చొరవ చూపాలని బాధిత గిరిజన కుటుంబాలు ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్, సబ్‌కలెక్టర్ లోతేటి శివశంకర్ ఎదుట బుధవారం తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ బాధను వివరిస్తూ వినతిపత్రం  అందజేశారు.
 
 

>
మరిన్ని వార్తలు