అమరావతా.. భ్రమరావతి నిర్మాణమా?

21 Oct, 2015 03:41 IST|Sakshi

వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి
 
కంకిపాడు : అమరావతి రాజధాని నిర్మాణమా? లేక భ్రమరావతి నిర్మాణమా? ప్రత్యేక హోదా సంజీవనా, కాదా? ప్రజలకు తేల్చి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు ప్రధాన సెంటరులో కొవ్వొత్తులు, దీపాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పుష్కర ప్రచారం, రాజధాని నిర్మాణం ప్రచారం పేరుతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఓ వైపు నిధులు లేవంటూ సంక్షేమ పథకాల అమలులో కోత విధిస్తున్న ప్రభుత్వం నిధులు ఎందుకు దుర్వినియోగం చేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో అమాయక రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజధాని శంకుస్థాపన సభలో పీఎం మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని హితవుపలికారు.

బద్ధ శత్రువులు కలిశారు..
రాజధాని నిర్మాణం వంకతో నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్‌లు కలిసిపోయారని సారథి వ్యాఖ్యానించారు. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడ్డా, విద్యార్థులు తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అవస్థలు పడ్డా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. టీ ప్రభుత్వంతో చర్చిం చేందుకు చొరవ చూపలేదన్నారు. రాజధాని పేరుతో ఏకాంత చర్చలు జరపటంలో ఆంతర్యం ఏమిటో వివరించాలన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు