మండలి చైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికం

23 Jan, 2020 14:11 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: శాసనమండలి చైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికం అని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. శాసనమండలి చరిత్రలో నిన్నటి సంఘటన దురుద్దినం అని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌ చంద్రబాబు చెప్పినట్టు నడుచుకున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారం ఇచ్చారని.. శాసనసభలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు కూడా నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని సూచించారని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికి..
చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నారా లోకేష్‌ నేరుగా తనపైకి దూసుకువచ్చారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికే అని.. తిరస్కరించడానికి కాదని చెప్పారు. సంఖ్యాబలం ఉంటే మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తారా అని నిప్పులు చెరిగారు. టీడీపీ చర్యలు వల్ల కొంత జాప్యం మాత్రమే జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో అందరికి తెలుసునని ఆయన పేర్కొన్నారు.

లోకేష్‌ నీ స్థాయి ఏమిటో తెలుసుకో..
చైర్మన్‌తో మాట్లాడేందుకు వెళ్తుంటే లోకేష్‌ తనపై దౌర్జన్యం చేశారని మంత్రి బొత్స అన్నారు. లోకేష్‌ స్థాయి ఏమిటో ముందు తెలుసుకోవాలని సూచించారు. కొన్ని పత్రికలు తమ పై తప్పుడు కథనాలు ప్రచురించాయని మండిపడ్డారు.డివిజన్‌ చేయకుండా బిల్లు సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. అన్ని పక్షాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పాయన్నారు. కొంత మంది టీడీపీ సభ్యులు కూడా ఇదే విషయం చెప్పారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చైర్మనే తెలిపారని బొత్స సత్యనారాయణ  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు