వట్లూరు బైపాస్‌లో బస్సు ప్రమాదం...

3 Feb, 2018 12:41 IST|Sakshi

వట్లూరు బైపాస్‌లో ఘటన

12 మందికి గాయాలు

క మహిళ పరిస్థితి విషమం  

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స

ఏలూరు  : ఏలూరు శివారు వట్లూరులోని గురుకుల బాలికల పాఠశాల వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు బస్సును పక్కకు తిప్పటంతో రోడ్డుపక్కగా చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళి బోల్తా కొట్టింది. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉండగా, 12 మందికి గాయాలయ్యాయి. ఒక మహిళకు పక్కటెముకలు విరిగి పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. ఈ ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీస్‌ సిబ్బంది, త్రీటౌన్‌ సీఐ పి.శ్రీనివాస్, ఎస్‌ఐ ఎ.పైడిబాబు సంఘటనా స్థలానికి వెళ్ళి క్షతగాత్రులను వైద్యచికిత్స నిమిత్తం ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రికి, ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వీస్‌ నెంబర్‌ 2556, నంబర్‌ ఏపీ 05 జెడ్‌ 5060 బస్సు ఏలూరు వట్లూరులోని గురుకుల బాలికల పాఠశాల వద్ద గురువారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. రోడ్డు మార్జిన్‌లో చెట్ల పొదలు, మట్టి ఉండడంతో కొంతవరకూ ప్రమాద తీవ్రత తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. గాయాలైన ప్రయాణికులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని వేరే బస్సులో పంపించి వేశారు. ఈ బస్సులో 25 మంది ప్రయాణికులతోపాటు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. అయితే వీరిలో 12 మంది ప్రయాణికులకు స్వల్ప, తీవ్ర గాయాలు అయ్యాయి.

 పెరవలి గ్రామానికి చెందిన సత్తి సత్యవతి (55) పక్కటెముకలు విరిగిపోవటంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే ఆమెను విజయవాడ తరలించారు. డ్రైవర్‌ ఏఎస్‌ఎన్‌ మూర్తికి స్టీరింగ్‌ బలంగా తాకటంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది వచ్చింది. కొత్తపేట గ్రామానికి చెందిన జి.సత్యవతి చేయివిరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామానికి చెందిన అన్నే సరస్వతికి ఎడమచేయి విరగగా, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. అదే విధంగా వైద్యం కోసం హైదరాబాద్‌ వెళుతున్న కె.శేషయ్య అనే వ్యక్తి గాయాలపాలయ్యాడు. గతంలో ఏలూరు డీఎస్పీగా పనిచేసిన ఎం.సత్తిబాబు బంధువులు పోతుల ప్రమీలాదేవి, పోతుల సరస్వతి, ముగ్గురు పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రి వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందించారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపటం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిలో బస్సును అజాగ్రత్తగా నడిపారని చెప్పారు. ముందు వెళుతున్న వాహనాలను గమనిస్తూ వెళ్ళాల్సి ఉండగా డ్రైవర్‌ బాధ్యతారాహిత్యంగా నడిపారని ఆరోపిస్తున్నారు. అయితే చివరిలో చాకచక్యంగా బస్సు స్పీడును తగ్గించి రోడ్డుమార్జిన్‌ పక్కకు తీసుకువెళ్ళటంతో పెనుప్రమాదం తప్పిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు