విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం

6 Nov, 2023 09:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫామ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. 12వ నంబర్‌ ఫ్లాట్‌ఫైమ్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందారు.  కండెక్టర్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 10 నెలల చిన్నారి కూడా ఉంది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే ఇలా జరిగిందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.  బస్సు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లాల్సి ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాద ఘటనను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటన దురదృష్టకరం. ప్రమాదంలో కుమారి అనే ప్రయాణీకురాలు, అవుట్ సోర్సింగ్ బుకింగ్ కంక్టర్ వీరయ్య ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో చిన్నారి అయాన్ష్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మానవ తప్పిదమా...బస్సులో లోపమా తేలాల్సి ఉంది. సాయంత్రంలోగా ప్రాధమిక నివేదిక వస్తుంది. 24 గంటల్లోగా పూర్తి నివేదిక తీసుకుంటాం. గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. మృతులకు ఆర్టీసీ తరపున రూ. 5 లక్షలు తక్షణ నష్టపరిహారం అందిస్తాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు