పూలింగ్ నేటి నుంచే

9 Dec, 2014 08:03 IST|Sakshi
పూలింగ్ నేటి నుంచే

 * 9 నెలల్లో యాజమాన్య ధ్రువపత్రాలు.. త్వరలో అసెంబ్లీలో బిల్లు
రాజధానిపై సీఎం ప్రకటన
ఇన్నర్, మిడిల్, ఔటర్ రింగ్‌రోడ్లుగా నిర్మాణ పరిధి
* తొలిదశలో ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో పనులు

 
 సాక్షి, హైదరాబాద్:
రాజధానికి అవసరమైన భూ సమీకరణ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో, అత్యాధునిక టెక్నాలజీతో నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని భూ సమీకరణపై సీఎం విధాన ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణ పరిధిని ఇన్నర్ రింగ్‌రోడ్డు, మిడిల్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు పేరుతో మూడు భాగాలుగా విభజించామన్నారు. ఇందులో భాగంగా.. పక్కా వాస్తు ప్రకారం గుంటూరుకు సమీపంలో 75 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్డు పరిధిలో తొలి దశ రాజధాని నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
 
 ఆ తర్వాత గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో మిడిల్ రింగ్‌రోడ్డు 125 కిలోమీటర్ల పరిధిలో, ఔటర్ రింగ్‌రోడ్డు 200 కిలోమీటర్ల పరిధిలోనూ మరో రెండు దశల్లో నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజధానికి భూ సమీకరణ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చే రైతుల రుణమాఫీని (కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షలు) ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం 22,405 మంది లబ్ధిదారులకు రూ.200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. భూ సమీకరణకు సంబంధించిన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
 
 లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు
 రైతులు ప్రభుత్వానికి భూములు అప్పగించిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తామని, ఆ తర్వాత 9 నెలల్లో భూ సమీకరణయాజమాన్య ధ్రువపత్రాలను (ల్యాండ్ పూలింగ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్ - ఎల్‌పీఓసీ) ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ‘రైతులు భూములు ఇచ్చిన నాటినుంచి మూడేళ్లలో అభివృద్ధి చేసిన భూములు వారికిస్తాం. రైతులు ఇచ్చే భూములు ఏ ప్రాంతమైతే (మెట్ట, జరీబు (ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూములు) అదే ప్రాంతంలో ప్లాట్లు ఇస్తాం. భూములిచ్చిన రైతులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, నాలా ఫీజులు, మౌలిక వసతుల అభివృద్ధి ఫీజు తదితరాలు ఉండవు. అయితే ఇవి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఒకసారి అమ్మడం లేదా కొనడం) వరకే వర్తిస్తాయి. రైతులకు నివాస, వాణిజ్య స్థలాలను వారి భూములను బట్టి ఆయా కేటగిరీల వారీగా లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తాం.
 
  దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములకు భూ సమీకరణ యాజమాన్య ధ్రువపత్రాలను ఆ దేవాలయాలకే అందజేస్తాం. రైతులకు ఇచ్చే ప్యాకేజీ తరహాలోనే దేవాలయాలకూ పరిహారం ఉంటుంది. అసైన్ట్ భూములకు కూడా మెట్ట, జరీబు భూములుగా విభజించి, పదేళ్ల పాటు పట్టా రైతులకు ఇచ్చినట్టే పరిహారం ఇస్తాం..’ వివరించారు. ఇక్కడ కోల్పోయే పంట దిగుబడిని ఏవిధంగా భర్తీ చేస్తారన్న ప్రశ్నకు.. ఈ ప్రాంతాన్ని డ్రాట్ ప్రూఫ్ (కరువు రహిత) ప్రదేశంగా మారుస్తానంటూ చంద్రబాబు ముక్తాయింపునిచ్చారు. భూసమీకరణ ప్రాంతంలో భూములకు నష్టపరిహారం పొందని లేదా భూమిలేని సుమారు 12 వేల కుటుంబాలకు (ఇందులో కౌలుదారులున్నారు) నెలకు రూ. 2500 చొప్పున పదేళ్ల పాటు రాజధాని సామాజిక భద్రతా నిధి (క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్) కింద చెల్లింపులు చేస్తామన్నారు. ‘రైతు కూలీలకు వృత్తినైపుణ్య  శిక్షణనిస్తాం. శిక్షణా కాలంలో స్టైఫండ్ ఇస్తాం. అనంతరం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు అవకాశం ఇస్తాం. ఇక కూలీలకు 365 రోజులూ పని ఉండేలా చూస్తాం. ఇళ్లు లేని వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తాం. రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికీ కొత్తగా ఇళ్లు కేటాయిస్తాం.
 
 ఈ ప్రాంతంలో 2014 డిసెంబర్ 8 నాటికి స్థానికంగా నివాసం ఉన్న వారికి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం. వృద్ధుల కోసం ఆశ్రమాలు, ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం..’ అని చెప్పారు. సమీకరణ చేస్తున్న ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని సీఎం అన్నారు. సీఆర్‌డీఏ చట్టం వచ్చాక నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులు.. అంటే ఎకరా రెండెకరాల పొలం ఉన్న రైతులు ఒక్కరు లేదా గ్రూపుగా కలిసి ఒకే చోట భూమి కావాలన్నా ఇస్తామని అన్నారు. గ్రామ కంఠంలోని ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు త్వరలోనే ధ్రువపత్రాలను జారీ చేస్తామని చెప్పారు.
 
 దొంగలు కోర్టుకెళతారు
 బాబు వివాదాస్పద వ్యాఖ్యలు
 రాజధాని కోసం భూ సమీకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారన్న ప్రశ్నకు తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులను దొంగలతో పోల్చారు. భూ సమీకరణపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయిస్తున్నారనీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందన్న విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా.. ‘చాలామంది ఎర్రచందనం దొంగలు కూడా కోర్టుకు వెళ్లారు కదా! ఏం చేశారు. ఇది కూడా అలాగే ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి జవాబిచ్చారు. రాజధాని కోసం భూములు ఇవ్వలేమని రైతులు ఎవరైనా అంటే వారిపై చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. భూ సేకరణ ద్వారా తీసుకోవలసిన వస్తుందని స్పష్టం చేశారు. రాజధాని రావడం ఇష్టం లేని కొన్ని రాజకీయ పార్టీలు అక్కడికెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని, మరికొంతమంది దీనిపై రాజకీయాలు చేయాలని చూశారని, వాటిని పట్టించుకోమని అన్నారు.
 
 ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేం
 రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతులకు గానీ, కౌలుదారులకు గానీ, రైతు కూలీలకు గానీ ఎలాంటి ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ)నిచ్చి వారికి ప్రైవేటు ఉద్యోగాల్లో ప్రాధాన్యతనిస్తామని అన్నారు. ఈ ఆరు నెలల్లో మీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని విలేకరులు అడగ్గా.. నిద్రపోయే సమయం మినహా మిగతా సమయాన్నంతా ప్రజల కోసమే వెచ్చించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తానని అన్నారు.   
 
 చంద్రబాబు చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు..
 -    నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఒక ము ఖ్య భవనానికి ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు (దివంగత మాజీ మంత్రి) పేరు పెడతాం
 -    ప్రస్తుతం ఈ భూముల్లో టేకు చెట్లు ఉన్నాయి. వాటిని రైతులే అమ్ముకోవచ్చు
 -    నిమ్మ, సపోట, జామ తోటల రైతులకు ఎకరానికి ఏకమొత్తంగా రూ.50 వేలు అదనంగా ఇస్తాం
 -    పేద కుటుంబాల వారు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకునేందుకు రూ.25 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
 -    ప్రస్తుతం ఉన్న పంటలకు సంబంధించి తుది ఫలసాయం పొందేందుకు అనుమతి. తదుపరి పంటకు వీలుండదు
 -    భూ యజమానుల జాబితాను బహిరంగంగా ప్రకటిస్తాం. సవరణలు స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తాం
 -    భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్, ఆదాయ పన్నుల మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని  అభ్యర్థిస్తాం
 -    భూములిచ్చిన రైతులు వారి ప్లాట్లను మూడేళ్ల వరకు ఆగాల్సిన పనిలేకుండా ముందే అయినా అమ్ముకోవచ్చు
 -    డబ్బు ఉన్న రైతులకు పారిశ్రామికవేత్తలుగా శిక్షణనిస్తాం.

మరిన్ని వార్తలు