ఆర్నెల్లు.. చేసింది నిల్

9 Dec, 2014 03:26 IST|Sakshi
ఆర్నెల్లు.. చేసింది నిల్

ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా హామీలు
సీఎం అయ్యాక మరికొన్ని వరాలు
జిల్లాకు నాలుగుసార్లు వచ్చిన బాబు


నెల్లూరు (అర్బన్): ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆర్నెల్ల కాలంలో జిల్లాకు ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు. కేవలం ప్రచారానికే ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాలుగు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనల్లోనూ అనేక హామీలను గుప్పించారు. వాటిలోనూ ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. వచ్చిన ప్రతిసారీ కోస్తా కారిడార్‌లో భాగంగా జిల్లాను పారిశ్రామిక హబ్, పర్యాటక హబ్ చేస్తాం, నెల్లూరుకు భూగర్భ డ్రైనేజీ, ఫిషింగ్ హార్బర్, నెల్లూరుకు విమానాశ్రయం.... ఇలా హామీల మీద హామీలను గుప్పించారు. అయితే ఇప్పటివరకు వీటి కోసం జిల్లాకు ఒక్క పైసా కూడా విదల్చలేదు.

ఎన్నికలకు ముందు..
ఎన్నికలకు ముందు మార్చి 5న చంద్రబాబు జిల్లాకు వచ్చారు. నగరంలోని వీఆర్‌సీ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాగర్జనలో అనేక హామీలు ఇచ్చారు. నెల్లూరులో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా నెల్లూరును పారిశ్రామిక నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దుతామని, ఒకటి, రెండుచోట్ల రింగురోడ్డును ఏర్పాటు చేయిస్తామని, మత్స్యకార హార్బర్‌ను నిర్మిస్తామని చెప్పారు. పెన్నా, కండలేరు, సోమశిల, ఉత్తర కాలువను అభివృద్ధి చేస్తామని, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు.

ఇంకా ఎరువుల పరిశ్రమ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్‌సెజ్‌లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు స్థాపిస్తానని ఆర్భాటంగా సభలో చెప్పారు. ఎన్నికలు జరిగాక మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో నాలుగుసార్లు బాబు జిల్లాకు వచ్చారు. జూన్ 6న షార్‌లో జరిగిన కార్యక్రమం కోసం, జులై 19న నెల్లూరులోని వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి, ఆగస్టు 24న స్వర్ణభారత్‌లో జరిగిన కార్యక్రమం కోసం, అక్టోబర్ 10న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ వల్లిస్తూ వచ్చారు గానీ చేసిందేమీ లేదు.

సీఎంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు
జూలై 19న: వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చిన బాబు ఈ సమయంలోనే అధికంగా హామీలు గుప్పించారు. సోమశిల ఎత్తిపోతల పథకం, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకుకాలువతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒక కాలపరిమితి నిర్ణయించి ఐదేళ్లలో పూర్తిచేస్తామని, మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని, పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నెల్లూరు నగరాన్ని స్మార్టుసిటీగా రూపొందిస్తామని కేంద్రం ప్రకటించిన వంద స్మార్ట్‌సిటీల్లో నెల్లూరు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

నెల్లూరుకు విమానాశ్రయం సాధించాల్సి ఉందని తెలిపారు. నెల్లూరు నగర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ.575 కోట్ల హడ్కో రుణం, మంచినీటి పథకానికి రూ.500 కోట్లు మంజూరుకు రాష్ట్రప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. రే కింద నెల్లూరుకు రూ.16 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పులికాట్, నేలపట్టు, మైపాడ్, పెంచలకోనలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని, మైపాడుకు నాలుగు వరుసల రోడ్డు మంజూరుచేస్తున్నట్లు, నెల్లూరుకు రింగురోడ్డు కావాలని అడిగారని, అది కూడా మంజూరు చేస్తున్నామని సభలో ఘనంగా ప్రకటించారు.
ఆగస్టు 24న ఇచ్చిన హామీలు: నేషనల్ గేమ్స్‌ను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒక ఈవెంట్‌ను నెల్లూరులో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు.
అక్టోబర్ 10న : కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెంలో, వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలిలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న బాబు జిల్లాను టూరిజం హబ్‌గా తయారుచేస్తానని, వెంకటగిరి సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణం పూర్తిచేస్తానని, తెలుగుగంగ బ్రాంచి కాలువల నిర్మాణంపై దృష్టిపెడతానని, వెంకటగిరి ప్రాంత పొలాలకు కండలేరు జలాలు తెప్పిస్తానని, వెంకటగిరిలో విమానాశ్రయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు.
 
చేసింది శూన్యం..
బాబు ప్రటించిన హామీలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సంగం బ్యారేజీ నుంచి తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి హడ్కో నుంచి రూ.1500 కోట్ల రుణం ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు హామీ ఇచ్చారు. ఆ నిధులు వచ్చేలా చూస్తానని బాబు కూడా మాట ఇచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా రెండు పథకాల కోసం ప్రతిపాదనలు పంపారు. అయితే ఆర్థిక శాఖ దానిని బుట్టదాఖలు చేసింది. ఒకసారి నెల్లూరులో విమానాశ్రయం అని చెప్పిన బాబు మరోసారి వెంకటగిరిలో విమానాశ్రయం అని ప్రకటన చేశారు.

రెండుసార్లు రెండు ఊర్ల పేర్లు చెప్పడంతో జిల్లా ప్రజలు బాబు తీరును చూసి నవ్వుకున్నారు. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఐదు పథకాలను ప్రారంభించింది. ఇవి జిల్లాలో సక్రమంగా అమలు కాలేదు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2 కు ఇరవై లీటర్ల మంచి నీళ్ల పథకాన్ని జిల్లాలో 420 గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయించగా కేవలం 18 చోట్ల మాత్రమే ప్లాంట్లు మొదలుపెట్టారు. ఇవీ అంతంతమాత్రంగానే సాగుతున్నాయి.  జిల్లాలో 50వేల మంది అర్హులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అదీ సక్రమంగా అమలు కావడంలేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అని చెప్పి.. 7 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదు. వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే హామీలు ఇచ్చి ఇప్పటివరకు జిల్లాకు పైసా కూడా ఇవ్వని బాబుపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రుణమాఫీ సంగతి సరేసరి
రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన బాబు అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ విషయంలో ఇరువర్గాలను మోసం చేశారు. రూ.50వేల లోపు తీసుకున్న రైతులకు మాత్రమే పూర్తి మాఫీ వర్తిస్తుందని, ఆ పైన లక్షన్నర లోపు తీసుకున్న రైతులకు వాయిదాల పద్ధతిన చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి విడతలో కేవలం 63 వేలమంది రైతులను మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. జిల్లాలో 35,335 డ్వాక్రా సంఘాలు రూ.592.28 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.300 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇంతవరకు డ్వాక్రా రుణాల ఊసెత్తకపోవడంతో తీసుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది.

మరిన్ని వార్తలు