Swarnamalya: 21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్‌.. చనిపోదామనుకున్నా..

17 Nov, 2023 13:27 IST|Sakshi

పైకి నవ్వుతూ ఉన్నంతమాత్రాన వారి జీవితాలు సంతోషంగా సాగిపోతున్నట్లు కాదు. కొందరు అంతులేని విషాదాన్ని, దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకుని బయటకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. నలుగురినీ నవ్విస్తారు, ఎంటర్‌టైన్‌ చేస్తారు. తమిళ యాంకర్‌, నటి స్వర్ణమాల్య కూడా అదే కోవలోకి వస్తుంది. యుక్త వయసులోనే ఎన్నో కష్టాలను చూసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది.

21 ఏళ్లకే విడాకులు.. కారణం తెలీదు
'నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు యూత్‌ ఇన్నొవేషన్‌ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అప్పుడు కొంత బెరుకు ఉండేది. నిజానికి నేను ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటాను. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేశారు. కానీ అది ఎంతోకాలం నిలవలేదు. 21 ఏళ్లకే విడాకులు అయిపోయాయి. అప్పుడతడి వయసు 25. ఆ వయసులో మాకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది కూడా పెద్దగా తెలియదు. బహుశా అమెరికా లైఫ్‌స్టైల్‌ నాకు వంటపట్టలేదేమో!

డిప్రెషన్‌, చచ్చిపోదామనుకున్నాను
ఈ విడాకుల వల్ల నాకన్నా నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడ్డారు. చదువులపై ధ్యాస పెడితే ఈ బాధ నుంచి బయటపడొచ్చన్నారు. ఈ బ్రేకప్‌, కొట్లాటల వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాను.  జీవితం అంటే ఇదేనా? ఎందుకు బతకాలి? అని విరక్తి చెందాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి చూడలేక నా సోదరి నన్ను డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లింది. డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి రెండు నెలలు పట్టింది' అని చెప్పుకొచ్చింది. కాగా యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన స్వర్ణమాల్య తర్వాత నటిగానూ మారింది. మణిరత్నం దర్శకత్వం వహించిన అలైపుతే సినిమాలో ఓ పాత్రలో నటించింది. నటన, యాంకరింగ్‌.. రెండింటిలోనూ ఆరితేరిన ఆమె ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతోంది.

నోట్‌: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: కొత్తింట్లో దీపావళి.. పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్‌.. ఎంతైనా ఆమె మనసు బంగారం!

మరిన్ని వార్తలు