నాబార్డ్‌ చైర్మన్‌గా డాక్టర్‌ చింతల బాధ్యతల స్వీకరణ

28 May, 2020 04:27 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న నాబార్డ్‌ చైర్మన్‌ చింతల గోవిందరాజులు. చిత్రంలో డిప్యూటీ ఎండీ పీవీఎస్‌ సూర్యకుమార్‌(కుడి చివర) తదితరులు

డిప్యూటీ ఎండీగా పీవీఎస్‌ సూర్య కుమార్‌

సాక్షి, అమరావతి: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ చింతల గోవిందరాజులు బుధవారం బెంగళూరులో పదవీ బాధ్యతలు చేపట్టారు.  ప్రస్తుత చైర్మన్‌ డాక్టర్‌ హర్ష్ కుమార్‌ భన్వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రతిష్టాత్మక ఈ పదవికి ఓ తెలుగు వ్యక్తి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు రాజమండ్రికే చెందిన డాక్టర్‌ పీవీఎస్‌ సూర్యకుమార్‌ కూడా  డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సూర్య కుమార్‌తో పాటు మరో డీఎండీ కూడా  పదవీ బాధ్యతలు స్వీకరించారు. చింతల, సూర్యకుమార్‌ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అని బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం కన్వీనర్‌ వలేటి గోపీచంద్‌ హర్షం వ్యక్తం చేశారు. పలు బ్యాంకుల ప్రతినిధులు కొత్త చైర్మన్‌కు అభినందనలు తెలిపారు. 

ఏజీ బీఎస్సీ వరకు ఏపీలోనే
గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు చెందిన చింతల గోవింద రాజులు పొన్నూరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, జేకేసీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ బీఎస్సీ పూర్తి చేశాక ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ)లో పీజీ పూర్తి చేశారు. 1985లో క్యాంపస్‌ సెలక్షన్స్‌లో నాబార్డ్‌–బీ గ్రేడ్‌ ఆఫీసర్‌గా ఎంపికైన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ పదవికి సుమారు 30 మంది పోటీ పడగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ శర్మ నాయకత్వంలోని బ్యాంకుల బోర్డు బ్యూరో చింతలను ఎంపికచేసింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ సహా పలువురు బ్యూరో సభ్యులు చింతల పేరును ప్రతిపాదించారు.

పీవీఎస్‌.. ఇంటర్‌ వరకు రాజమండ్రిలో
డిప్యూడీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన పీవీఎస్‌ సూర్యకుమార్‌ రాజమండ్రిలో జన్మించారు. కామవరపుకోటలో పదో తరగతి వరకు చదివారు. రాజమండ్రిలో ఇంటర్, బాపట్ల వ్యవసాయ కాలేజీలో అగ్రి బీఎస్సీ చేసారు. 84–86 వరకు ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పీజీ చేశారు. 1986లో నాబార్డులో చేరారు. వీరి తల్లిదండ్రులు వెంకట పేరిశాస్త్రి, నాగమణి. నాబార్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో బాపట్ల వ్యవసాయ కళాశాలకు, డాక్టర్‌  వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి సుమారు మూడు వందల కోట్ల రూపాయల నాబార్డు నిధులు మంజూరు అయ్యేలా చేశారు. 

బాపట్ల వ్యవసాయ కళాశాల సిగలో మరో కలికితురాయి....
డాక్టర్‌ చింతల, సూర్యకుమార్‌ ఇద్దరూ ఈ కళాశాలలో చదివిన వారు కావడం, ఇద్దరూ పదోన్నతులు సాధించడంతో బాపట్ల వ్యవసాయ కళాశాల ఖ్యాతి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కళాశాలలో చదివిన అనేక మంది పద్మశ్రీ అవార్డులు పొందారు. మరికొందరు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లాం కూడా ఈ కళాశాల విద్యార్ధే కావడం గమనార్హం. కళాశాల పూర్వ విద్యార్థులు ఎంబీఎన్‌ రావు ఇండియన్‌ బ్యాంకు, కెనరా బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేశారు. 

మరిన్ని వార్తలు