చిత్తూరు మేయర్‌ కంటతడి

4 Feb, 2019 08:09 IST|Sakshi
భావోద్వేగంతో మాట్లాడుతున్న మేయర్‌ హేమలత

అందరి ముందూ ఎమ్మెల్యే ఆగ్రహం

పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీలో రచ్చ

వీధికెక్కిన చిత్తూరు టీడీపీ

చిత్తూరు నగరంలో నిర్వహించిన పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం టీడీపీ నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను బయటపెట్టింది. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి సూటిపోటి మాటలు అంటుంటే ఓర్చుకోలేని మేయర్‌ హేమలత కన్నీటి పర్యంతమయ్యారు. సమావేశం మధ్యలోనే అర్ధంతరంగా వెళ్లిపోయారు.

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని 36, 37వ డివిజన్లకు సంబంధించి పసుపు–కుంకుమ చెక్కులు, పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో నగర మేయర్‌ హేమలత, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ దొరబాబు, కమిషనర్‌ ఓబులేశు, మేయర్‌ భర్త కటారి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతుండగా పక్కపక్కనే కూర్చున్న ఎమ్మెల్యే సత్యప్రభ మేయర్‌ హేమలతను ఉద్దేశించి సూటిపోటి మాటలు అంటున్నట్లు అక్కడే ఉన్నవారు చెబుతున్నారు. ‘సౌండ్‌ సిస్టమ్‌ ఎందుకు పనిచేయలేదు..? ఏ పనిచెప్పినా చేయడం మీకు చేతగాదు’ అంటూ సత్యప్రభ మేయర్‌తో అన్నారు. అప్పటికే తన భావోగ్వేదాన్ని అదుపులో పెట్టుకున్న మేయర్‌ హేమలత కమిషనర్‌ను పిలిచి సౌండ్‌ సిస్టమ్‌ గురించి నిలదీశారు. మరోసారి ఇలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటామని కమిషనర్‌ చెప్పడంతో హేమలత కూర్చుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యే సత్యప్రభ మేయర్‌తో గొడవపెట్టుకున్నారు. దీంతో మైక్‌ తీసుకున్న మేయర్‌ హేమలత నాలుగు మాటలు మాట్లాడి స్టేజి నుంచి దిగుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏం జరుగుతోందో తెలియని మేయర్‌ భర్త కటారి ప్రవీణ్‌ సైతం మేయర్‌ వెంట నడుస్తూ కళాక్షేత్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన చూసిన సభావేదికపై ఉన్న అధికార పార్టీ నాయకులు, అధికారులు నిచ్చేష్టులయ్యారు. ఇవేమీ లెక్కచేయని ఎమ్మెల్యే సత్యప్రభ మేయర్‌ లేకపోయినా మహిళా సంఘాలకు చెక్కులు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు. ఇకమీదట కార్పొరేషన్‌లో జరిగే కార్యక్రమాలకు తనను పిలవొద్దని కమిషనర్‌కు చెప్పి ఎమ్మెల్యే సైతం వెళ్లిపోయారు.

తారాస్థాయికి విభేదాలు
ఈ ఘటనతో మేయర్, ఎమ్మెల్యే మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరింది. ఇది ఒక్కసారిగా బయటపడ్డ వివాదం కాదు. మున్సిపల్‌ కార్పిరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫకాల విషయంలో మేయర్‌పై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులతో చేసిన పనులకు శిలాఫలకంలో అధికారులు తొలి పేరు మేయర్‌ది వేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకు నచ్చడంలేదు. గత నెల గిరింపేట, కొంగారెడ్డిపల్లె ప్రాంతాల్లో నిర్వహించి న జన్మభూమి సభల్లో అలిగిన ఎమ్మెల్యే శిలాఫలకాలు ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. ఇక కార్పొరేషన్‌లో జరుగుతున్న రూ.కోట్ల పనులను ఎమ్మెల్యే తన అనుచరులకు కట్టబెడుతున్నా అడ్డుచెప్పడంలేదని మేయర్‌ వర్గం ఆరోపిస్తోంది. తనకు నచ్చని ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రూ.కోట్ల విలువైన పనులు ఇవ్వడాన్ని ఎలా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఇక నిఘా వర్గాల నివేదికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకత, మేయర్‌కు సానుకూలత ఉందనే వివరాలు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. పైగా కళాక్షేత్రంలో సౌండ్‌ సిస్టమ్‌కు రూ.30 లక్షల బిల్లులు ఇటీవల ఇచ్చినా సరిగా పనిచేయలేదని ఎమ్మెల్యే చెప్పడం, మీరు చెప్పిన వారికే పనులు ఇచ్చామని మేయర్‌ చెబుతుండడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు